Jaydev Unadkat: జయదేవ్ ఉనద్కత్ సంచలన రికార్డ్!

ABN , First Publish Date - 2023-01-03T21:48:47+05:30 IST

పుష్కర కాలం తర్వాత భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్న జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) తాజాగా అత్యంత అరుదైన రికార్డు సృష్టించింది.

Jaydev Unadkat: జయదేవ్ ఉనద్కత్ సంచలన రికార్డ్!

రాజ్‌కోట్: పుష్కర కాలం తర్వాత భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్న జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) తాజాగా అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు. రంజీట్రోఫీ(Ranji Trophy)లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ అయిన ఉనద్కత్ తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసి సంచలన రికార్డును తన పేర వేసుకున్నాడు. 12 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. ఉనద్కత్ కెరియర్‌లోనే ఇది అత్యుత్తమం.

తొలుత ధ్రువ్ షోరేను అవుట్ చేసిన ఉనద్కత్.. రెండో బంతికి రావల్‌ను, మూడో బంతికి యశ్ దుల్‌ను పెవిలియన్ పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కెప్టెన్ ధుల్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. సౌరాష్ట్ర బౌలర్ల దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు చిగురుటాకులా వణికారు. వరుసపెట్టి వికెట్లు సమర్పించుకున్నారు. మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, అందులో ముగ్గురు బ్యాటర్లు ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరడం గమనార్హం.

తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించడం రంజీ చరిత్రలోనే ఇది తొలిసారి. అంతకుముందు 2017-18లో కర్ణాటక ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్ హ్యాట్రిక్ సాధించాడు. అయితే, ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఓవర్ చివరిలో, మళ్లీ మూడో ఓవర్‌లో వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. ఉనద్కత్ మాత్రం తొలి ఓవర్ మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుసగా మూడు వికెట్లు తీసుకున్నాడు. కాగా, ఐదు వికెట్ల ప్రదర్శన ఉనద్కత్‌కు ఇది 21వ సారి కావడం గమనార్హం. సౌరాష్ట్ర బౌలర్ల దెబ్బకు ఢిల్లీ 133 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది.

Updated Date - 2023-01-03T21:52:55+05:30 IST

News Hub