MI vs SRH : ముంబై ముందుకు
ABN , First Publish Date - 2023-05-22T03:30:56+05:30 IST
అసలైన పోరులో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. కానీ రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై గుజరాత్ నెగ్గితేనే రోహిత్ సేనకు ప్లేఆఫ్స్ బెర్త్

● శతక్కొట్టిన గ్రీన్.. రాణించిన రోహిత్
● ఓటమితో ముగించిన సన్‌రైజర్స్
● ఓపెనర్లు వివ్రాంత్, మయాంక్ శ్రమ వృథా
సన్‌రైజర్స్‌పై గెలిచి ప్లేఆఫ్ చేరిన రోహిత్ సేన
ముంబై: అసలైన పోరులో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గెలిచింది. కానీ రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై గుజరాత్ నెగ్గితేనే రోహిత్ సేనకు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమయ్యేది. ఈనేపథ్యంలో ఆర్‌సీబీ–జీటీ పోరుకోసం ముంబై ఉత్కంఠగా ఎదురు చూసింది. ఆ మ్యాచ్‌లో బెంగళూరు ఓడడంతో ముంబైకి దారి క్లియర్ అయింది. ఆదివారం ఇక్కడ జరిగిన హైస్కోరింగ్ పోరులో మాజీ చాంపియన్ ముంబై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 83), వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 69) మెరుపు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కామెరూన్ గ్రీన్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 నాటౌట్) సూపర్ సెంచరీతో విజృంభించగా, రోహిత్ (37 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 56) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సత్తాచాటిన వేళ ముంబై 18 ఓవర్లలోనే 201/2 స్కోరు చేసి గెలిచింది. భువనేశ్వర్, మయాంక్ దాగర్ చెరో వికెట్ తీశారు. సెంచరీ వీరుడు గ్రీన్‌కు ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. కాగా, హైదరాబాద్ పదో ఓటమితో ఆఖరిస్థానంతో ఈ సీజన్‌ను ముగించింది.
గ్రీన్ సూపర్.. రో ’హిట్’..: భారీ ఛేదనకు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (14) తక్కువ స్కోరుకే అవుటైనా, అతని స్థానంలో వచ్చిన కామెరూన్ గ్రీన్ మాత్రం సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి వాంఖడే పరుగుల వరద పారించాడు. తానెదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించిన గ్రీన్.. అదే దూకుడును చివరిదాకా కొనసాగించాడు. సన్‌రైజర్స్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా గ్రీన్ ఎక్కడా తగ్గలేదు. మరోవైపు రోహిత్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక తనదైన స్టయిల్లో చెలరేగాడు. వివ్రాంత్ వేసిన 9వ ఓవర్లో ఐదో బంతిని సిక్సర్ కొట్టిన గ్రీన్.. 20 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక, ఉమ్రాన్ వేసిన పదో ఓవర్‌లో రోహిత్ మూడు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో 11వేల పరుగుల మైలురాయి చేరుకున్న హిట్‌మ్యాన్.. కార్తీక్ త్యాగి ఓవర్‌లో ఫోర్ కొట్టి 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఈ ఇద్దరి బాదుడుతో 13 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోరు 150 పరుగులకు చేరింది. అయితే మయాంక్ దాగర్ వేసిన 14వ ఓవర్‌లో నితీశ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 64 బంతుల్లో 128 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక, ఉమ్రాన్ బౌలింగ్ 16వ ఓవర్‌లో గ్రీన్ 4,6 కొట్టగా.. చివరి రెండు బంతులను సూర్యకుమార్ (16 బంతుల్లో 4 ఫోర్లతో 25 నాటౌట్) బౌండరీలుగా మలిచాడు. భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్‌లో రెండో బంతికి బౌండరీ కొట్టి 98లోకి వచ్చిన గ్రీన్.. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి సింగిల్ తీసి తన టీ20 కెరీర్‌లోనే తొలి సెంచరీ సాధించాడు.
ఓపెనింగ్ ధనాధన్...: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు భారీ శుభారంభాన్నిచ్చారు. లీగ్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన వివ్రాంత్ శర్మ, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశారు. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు బౌలర్లను ఉతికారేశారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో తప్ప ఏడో ఓవర్ వరకూ ప్రతి ఓవర్‌లోనూ బంతిని బౌండరీ లైన్‌ను దాటించారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికల్లా జట్టు 53/0 స్కోరుతో పటిష్ఠంగా నిలిచింది. ఈ క్రమంలోనే ఓపెనర్లిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 13.5 ఓవర్లలోనే 140 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. జోర్డాన్ వేసిన పదో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన లెఫ్టాండర్ బ్యాటర్ వివ్రాంత్.. ఐదో బంతికి సింగిల్ తీసి 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెహ్రాన్‌డార్ఫ్ వేసిన 13వ ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాదిన మయాంక్ 32 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ఇతనికిదే మొదటి అర్ధ సెంచరీ. తర్వాతి ఓవర్లోనే వివ్రాంత్‌ను ఆకాశ్ మధ్వాల్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో అలరించిన మయాంక్.. ఆకాశ్ వేసిన 17వ ఓవర్‌లో నాలుగో బంతికి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ ఇద్దరి నిష్క్రమణ తర్వాత జట్టు తడబాటుకు లోనైంది. ఓపెనర్లు ఇచ్చిన అద్భుత శుభారంభాన్ని అవకాశంగా మలచుకోవడంలో మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మూడో నెంబర్‌లో వచ్చిన క్లాసెన్ (13 బంతుల్లో 2 ఫోర్లతో 18) వేగంగా ఆడలేకపోయాడు. ఇక, గ్లెన్ ఫిలిప్స్ (1), కెప్టెన్ మార్‌క్రమ్ (13 నాటౌట్), హ్యారీ బ్రూక్ (0), సాన్వీర్ సింగ్ (4 నాటౌట్) ఆఖర్లో హిట్టింగ్ చేయలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్ చివరి మూడు ఓవర్లలో 26 పరుగులకే పరిమితమైంది.
స్కోరుబోర్డు
హైదరాబాద్: వివ్రాంత్ (సి/సబ్) రమణ్‌దీప్ (బి) ఆకాశ్ 69, మయాంక్ అగర్వాల్ (సి) ఇషాన్ (బి) ఆకాశ్ 83, క్లాసెన్ (బి) ఆకాశ్ 18, ఫిలిప్స్ (సి) కార్తికేయ (బి) జోర్డాన్ 1, మార్‌క్రమ్ (నాటౌట్) 13, హ్యారీ బ్రూక్ (బి) ఆకాశ్ 0, సాన్వీర్ సింగ్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం 20 ఓవర్లలో 200/5; వికెట్ల పతనం: 1–140, 2–174, 3–177, 4–186, 5–186; బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 3–0–36–0, గ్రీన్ 1–0–2–0, జోర్డాన్ 4–0–42–1, ఆకాశ్ మధ్వాల్ 4–0–37–4, పీయూష్ 4–0–39–0, కార్తికేయ 4–0–39–0.
ముంబై: ఇషాన్ (సి) బ్రూక్ (బి) భువనేశ్వర్ 14, రోహిత్ (సి) నితీశ్‌కుమార్ (బి) దాగర్ 56, గ్రీన్ (నాటౌట్) 100, సూర్యకుమార్ (నాటౌట్) 25, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18 ఓవర్లలో 201/2; వికెట్ల పతనం: 1–20, 2–148; బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–1, నితీశ్ కుమార్ 3–0–35–0, మయాంక్ దాగర్ 4–0–37–1, కార్తీక్ త్యాగి 2.5–0–41–0, ఉమ్రాన్ 3–0–41–0, వివ్రాంత్ 1–0–19–0, మార్‌క్రమ్ 0.1–0–1–0.