IPL Punjab vs Lucknow : సికందర్‌ షో

ABN , First Publish Date - 2023-04-16T03:46:29+05:30 IST

ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌. కష్టసాధ్యమైన లక్ష్యం కాకపోయినా లఖ్‌నవూ బౌలర్లు ఛేదనను కాపాడుకునేం దుకు గట్టిగానే పోరాడారు. అయితే సికందర్‌ రజా (41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57),

IPL Punjab vs Lucknow : సికందర్‌ షో

సహకరించిన షారుక్‌

ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌ విజయం

2 వికెట్లతో లఖ్‌నవూ ఓటమి

లఖ్‌నవూ: ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌. కష్టసాధ్యమైన లక్ష్యం కాకపోయినా లఖ్‌నవూ బౌలర్లు ఛేదనను కాపాడుకునేం దుకు గట్టిగానే పోరాడారు. అయితే సికందర్‌ రజా (41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), షారుక్‌ ఖాన్‌ (10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 23 నాటౌట్‌) నిలకడైన ఆటతీరుతో పంజాబ్‌ ఆఖరి ఓవర్‌లో 2 వికెట్లతో గట్టెక్కింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. రాహుల్‌ (74), మేయర్స్‌ (29) మాత్రమే రాణించారు. కర్రాన్‌కు మూడు, రబాడకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్‌ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. షార్ట్‌ (34), హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా (22) రాణించారు. యుధ్‌వీర్‌, వుడ్‌, బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సికిందర్‌ నిలిచాడు. గాయంతో ధవన్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండడంతో పంజాబ్‌ కెప్టెన్‌గా సామ్‌ కర్రాన్‌ వ్యవహరించాడు.

సికందర్‌, షారుక్‌ అండగా..

160 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌ ఆరంభం పేలవంగా సాగినా.. సికిందర్‌ రజా, షారుక్‌ అద్భుత ఆటతీరుతో ఆదుకున్నారు. అరంగేట్ర పేసర్‌ యుధ్‌వీర్‌ తొలి ఓవర్‌లో అథర్వ (0)ను, మూడో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ (4)ను అవుట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ మాథ్యూ షార్ట్‌ మాత్రం రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లతో జోరు చూపాడు. అతడు ఆరో ఓవర్‌లోనూ సిక్సర్‌ బాదినా చివరి బంతికి వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లేలో 45 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 7-11 ఓవర్ల మధ్య రెండు ఫోర్లే రాగా హర్‌ప్రీత్‌ సింగ్‌ వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో సికందర్‌ రజా వరుసగా 6,6,4తో 13వ ఓవర్‌లో 17 రన్స్‌ సాధించి జోష్‌ తెచ్చాడు. మరో ఎండ్‌లో బిష్ణోయ్‌ గూగ్లీకి కెప్టెన్‌ కర్రాన్‌ (6) అవుట్‌ కావడంతో ఐదో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 34 బంతుల్లో సికందర్‌ ఫిఫ్టీ పూర్తి చేసిన వెంటనే.. రాహుల్‌ డైవింగ్‌ క్యాచ్‌తో జితేశ్‌ (2) వెనుదిరిగాడు. 25 బంతుల్లో 38 రన్స్‌ అవసరమైన ఈ దశలో రజాకు షారుక్‌ జత కలిశాడు. తొలి బంతినే తను సిక్సర్‌గా మలిచాడు. అయితే 18వ ఓవర్‌లో ఊపు మీదున్న రజాను అవుట్‌ చేసిన బిష్ణోయ్‌ ఉత్కంఠ పెంచాడు. తర్వాతి ఓవర్‌లో షారుక్‌ సిక్సర్‌ బాదినా బ్రార్‌ (6) వికెట్‌ కోల్పోయింది. ఇక చివరి ఓవర్‌లో కావాల్సిన ఏడు పరుగులను షారుక్‌ 2,2,4తో మరో మూడు బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

నిదానంగా.. : టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు రాహుల్‌, మేయర్స్‌ తొలి వికెట్‌కు 53 రన్స్‌తో శుభారంభం అందించారు. కానీ మధ్య ఓవర్లలో పరుగులు నెమ్మదించాయి. డెత్‌ ఓవర్లలోనూ దూకుడు కనిపించకపోవడంతో ఎల్‌ఎస్‌జీ చివరి ఐదు ఓవర్లలో 48 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. అటు రాహుల్‌ దాదాపు చివరి వరకు నిలిచినా అతడి ఆటలో జోరు కనిపించలేదు. తొలి ఓవర్‌లోనే సిక్సర్‌ బాదిన మేయర్స్‌ మాత్రం క్రీజులో ఉన్నంత సేపు కాస్త వేగం చూపాడు. పవర్‌ప్లేలోపే తను మూడు సిక్సర్లు బాదడంతో జట్టు 49 రన్స్‌ సాధించింది. అయితే వరుస ఓవర్లలో మేయర్స్‌తో పాటు దీపక్‌ హుడా (2) వికెట్లను కోల్పోవడంతో లఖ్‌నవూ ఆత్మరక్షణలో పడిపోయింది. అలాగే స్టొయినిస్‌, పూరన్‌లకన్నా ముందే వచ్చిన క్రునాల్‌ (18) షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. దీనికి తోడు 15వ ఓవర్‌లో కేవలం 3 రన్స్‌ ఇచ్చిన రబాడ.. క్రునాల్‌, పూరన్‌ (0)ల వికెట్లు తీసి షాకిచ్చాడు. అటు ఓపిగ్గా ఆడిన రాహుల్‌ 40 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. స్టొయినిస్‌ (15) 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో కాస్త ఊపు తెచ్చినా.. తనూ ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. 18వ ఓవర్‌లో కర్రాన్‌ 5 పరుగులే ఇచ్చి స్టొయినిస్‌ను.. ఆఖరి ఓవర్‌లో ఏడు పరుగులే ఇచ్చి గౌతమ్‌ (1), యుధ్‌వీర్‌ (0)లను అవుట్‌ చేయడం లఖ్‌నవూ భారీ స్కోరుపై దెబ్బ పడింది. ఇక బ్యాట్‌ ఝుళిపించాల్సిన సమయంలో రాహుల్‌ను 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్‌ వెనక్కి పంపాడు.

అత్యంత వేగం (105 ఇన్నింగ్స్‌)గా ఐపీఎల్‌లో 4 వేల రన్స్‌ పూర్తి చేసిన బ్యాటర్‌గా రాహుల్‌.

రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌ల మధ్య అత్యధిక విరామం (3981 రోజులు) తీసుకున్న బ్యాటర్‌గా హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా (2012-2023). మాథ్యూ వేడ్‌ (3962) రికార్డును అధిగమించాడు.

స్కోరుబోర్డు

లఖ్‌నవూ: రాహుల్‌ (సి/సబ్‌) ఎలిస్‌ (బి) అర్ష్‌దీప్‌ 74, మేయర్స్‌ (సి) హర్‌ప్రీత్‌ సింగ్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 29, దీపక్‌ హుడా (ఎల్బీ) సికందర్‌ 2, క్రునాల్‌ (సి) షారుక్‌ (బి) రబాడ 18, పూరన్‌ (సి) షారుక్‌ (బి) రబాడ 0, స్టొయినిస్‌ (సి) జితేశ్‌ (సి) కర్రాన్‌ 15, బదోని (నాటౌట్‌) 5, క్రిష్ణప్ప గౌతమ్‌ (సి) సికందర్‌ (బి) కర్రాన్‌ 1, యుధ్‌వీర్‌ (సి) షారుక్‌ (బి) కర్రాన్‌ 0, బిష్ణోయ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 159/8; వికెట్ల పతనం: 1-53, 2-62, 3-110, 4-111, 5-142, 6-150, 7-154, 8-154; బౌలింగ్‌: షార్ట్‌ 2-0-10-0, అర్ష్‌దీప్‌ 3-0-22-1, రబాడ 4-0-34-2, కర్రాన్‌ 4-0-31-3, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2-0-10-1, రజా 2-0-19-1, రాహుల్‌ చాహర్‌ 3-0-28-0.

పంజాబ్‌: అథర్వ (సి) అవేశ్‌ (బి) యుధ్‌వీర్‌ 0, ప్రభ్‌సిమ్రన్‌ (బి) యుధ్‌వీర్‌ 4, షార్ట్‌ (సి) స్టొయినిస్‌ (బి) గౌతమ్‌ 34, హర్‌ప్రీత్‌ సింగ్‌ (సి/సబ్‌) మన్కడ్‌ (బి) పాండ్యా 22, రజా (సి) స్టొయినిస్‌ (బి) బిష్ణోయ్‌ 57, కర్రాన్‌ (సి) పాండ్యా (బి) రవి బిష్ణోయ్‌ 6, జితేశ్‌ (సి) రాహుల్‌ (బి) ఉడ్‌ 2, షారుక్‌ (నాటౌట్‌) 23, హర్‌ప్రీత్‌ బ్రార్‌ (సి) పూరన్‌ (బి) ఉడ్‌ 6, రబాడ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.3 ఓవర్లలో 161/8; వికెట్ల పతనం: 1-0, 2-17, 3-45, 4-75, 5-112, 6-122, 7-139, 8-153; బౌలింగ్‌: యుధ్‌వీర్‌ 3-0-19-2, అవేశ్‌ 3-0-24-0, ఉడ్‌ 4-0-35-2, క్రిష్ణప్ప గౌతమ్‌ 4-0-31-1, క్రునాల్‌ 3-0-32-1, బిష్ణోయ్‌ 2.3-0-18-2

Updated Date - 2023-04-16T03:46:29+05:30 IST