Share News

APSRTC: ప్రగతి రథ చక్రానికి ప్రయాసలు

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:14 AM

ఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు, చిన్న పొరపాట్లకే కఠిన శిక్షలు ఎదుర్కొంటున్నారు. బోర్డు సభ్యులు ఆరు నెలలైనా సమావేశం కాని పరిస్థితి పట్ల అసంతృప్తితో ఉన్నారు

APSRTC: ప్రగతి రథ చక్రానికి  ప్రయాసలు

  • ఏపీఎస్‌ ఆర్టీసీలో ఎవరి గోల వారిదే

  • పనిష్మెంట్లపై డ్రైవర్లు, సిబ్బంది పదోన్నతుల సమస్యపై అధికారులు

  • ఆర్నెల్లయినా మీటింగ్‌ లేదని బోర్డు సభ్యులు

  • ఒకరికొకరు చెప్పుకొంటున్న వైనం

ప్రగతి రథ చక్రానికి ప్రయాసల పంక్చర్లు పడుతున్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీలో సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు చివరకు బోర్డు సభ్యులు కూడా ‘ఎవరి గోల వారిదే’ అన్నట్టుగా ఉన్నారు. చిన్న పొరపాట్లకూ భారీ పనిష్మెంట్లకు గురవుతున్నామని సిబ్బంది, పదోన్నతులు లేకుండానే రిటైరైపోతామేమోనన్న ఆవేదనలో ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు. ఇక, బోర్డు ఏర్పడి ఆరు మాసాలైనా ఒక్కసారీ భేటీ కాలేదని.. ఈ మాత్రానికి తామెందుకని బోర్డు సభ్యులు తలపట్టుకుంటున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రజారవాణా సంస్థ ఏపీఎస్‌ ఆర్టీసీ... అంతర్గత సమస్యలతో అల్లాడుతోంది. సంస్థలో పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు, ఆఖరుకు బోర్డు సభ్యుల దాకా సమస్యల్లో చిక్కుకున్నారు. దీంతో ఒకరికొకరు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. సిబ్బంది వెళ్లి.. తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు చెబుతుంటే.. వారి నుంచి ఊరట లభించకపోగా ఎదురు.. వారి సమస్యలను సిబ్బందికి చెప్పుకొంటున్నారు. అదేవిధంగా ఉన్నతాధికారుల ముందు బోర్డు సభ్యులు సైతం తమ ఆవేదనను వ్యక్తం పరుస్తున్నారు. దీంతో ఎవరిని కదిలించినా.. ఒకరికొకరు తమ తమ సమస్యలు చెప్పుకొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

సిబ్బంది వేదన ఇదీ..

‘‘చిన్న చిన్న పొరపాట్లు, చిన్నపాటి తప్పులకు కూడా గట్టిగానే పనిష్మెంట్‌ ఇస్తున్నారు సర్‌. ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ అయినా, యాక్సిడెంట్‌ చేసినా ఒక విధంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎండీ సురేంద్ర బాబు హయాంలో ఇచ్చిన 1/2019 సర్క్యులర్‌ అమలయ్యేలా చూడండి’’ అని డ్రైవర్లు ఇతర సిబ్బంది ఆర్టీసీ అధికారులకు విన్నవించుకుంటున్నారు.

అధికారుల ఆవేదన ఇదీ..

‘‘మా ప్రమోషన్లు అన్యాయంగా ఆపేశారు సర్‌. ఏసీఆర్‌(ప్రభుత్వ విధానం) స్థానంలో ఎంఎంఆర్‌(కార్పొరేషన్‌ ప్రకారం) పెట్టామంటూ 90 మంది ప్రమోషన్లకు బ్రేకులేశారు. బోర్డులో తీర్మానం చేసి న్యాయం చేయండి’’ అని బోర్డు సభ్యులకు అధికారులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.


బోర్డు బాధ బోర్డుది!

అటు సిబ్బంది, ఇటు అధికారులు క్యూకట్టి మరీ తమకు సమస్యలు విన్నవిస్తుంటే.. వాటిని పరిష్కరించాల్సిన బోర్డు సభ్యులు.. ‘‘మీ సమస్యలు మాకు చెబుతున్నారు. మా బాధ ఎవరికి చెప్పాలి’’ అని నిట్టూరుస్తున్నారు. విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో ప్రతి నోటా ఈ విషయాలే వినిపిస్తున్నాయి. సిబ్బందిని పర్యవేక్షించే అధికారులు, వారిని నడిపించి, తీర్మానాలు చేసే పాలకమండలి సభ్యుల వరకు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు.

బోర్డు మాట ఏంటంటే

ఆయా సమస్యను పలువురు సిబ్బంది ఇటీవల బోర్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మీ పనిష్మెంట్ల సంగతి చూడాలంటే మా బోర్డు మీటింగ్‌ జరగాలి కదా?. ఆర్నెల్లయినా ఒక్క సమావేశం జరగలేదు. కనీసం మాకు ఆర్టీసీ హౌస్‌లో కూర్చోవడానికి కూడా చోటు లేదు’’ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీలో డిపో మేనేజర్‌ నుంచి ఈడీ వరకు 90 మంది ప్రమోషన్లు ఆగిపోయాయి. ఏడాది నుంచి ప్రయత్నించి చివరికి మార్చి చివరి వారంలో డీపీసీ జరగ్గా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్‌) ఉండాలని డీపీసీ తిరస్కరించింది. అయితే కార్పొరేషన్‌లో ఉండే మెరిట్‌ రేటింగ్‌ రిపోర్ట్‌(ఎంఆర్‌ఆర్‌) జత చేశామని చెప్పినా వినలేదు. పైగా ‘‘ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కదా.. అదే విధానం పాటించాలి’’ అంటూ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అభ్యంతరం చెప్పారు. ఈ పదోన్నతుల విషయమై ఆర్టీసీ పాలకమండలి సభ్యుల్ని కలిసి ఈ ఒక్కసారికి ఎంఆర్‌ఆర్‌ అనుమతించేలా బోర్డులో తీర్మానం చేసి పంపాలని సంబంధిత అధికారులు విన్నవించారు. ‘‘మీకు ప్రమోషన్లు ఆగడం బాధగానే ఉండొచ్చు.. మాకు ఆర్నెల్లుగా జీతాలు కూడా రావట్లేదు. మేం ఎవరికి చెప్పాలి. మీ కన్నా ఎక్కువ బాధలు మాకున్నాయ్‌. మా చైర్మన్‌కు చెబుదామంటే ఆయనకు కూడా కేబినెట్‌ హోదా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్‌కు కేబినెట్‌ హోదా ఉండేది’’ అని బోర్డు మెంబర్‌ ఒకరు చేసిన వ్యాఖ్యలతో అధికారుల నోట మాటరాలేదు.


సర్క్యులర్‌ ఏం చెబుతోంది?

ఆర్టీసీ సిబ్బంది తప్పు చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై 2019లో అప్పటి ఎండీ సురేంద్ర బాబు అధికారులు, కార్మిక సంఘాలతో సుదీర్ఘంగా చర్చించి 1/2019 సర్క్యులర్‌ తీసుకొచ్చారు. ఎవరైనా కండక్టర్‌ ప్రయాణ చార్జీ వసూలు చేసి టికెట్‌ ఇవ్వకపోతే ఉద్యోగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. డ్రైవర్‌ మద్యం తాగి బస్‌ నడిపి ప్రమాదానికి కారణమైతే ఉద్యోగం నుంచి తీసేయాలని, అలా కాకుండా ఎదుటి వాహనం వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొడితే పోలీసు కేసు పెట్టి ఎదుటి వాహనం నుంచి బీమా పరిహారం పొందాలని సూచించారు. పనిష్మెంట్ల విషయమై అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాలు అమల్లోకి తెచ్చారు. అయితే, 2020లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఆ సర్క్యులర్‌ను అధికారులు పక్కన పెట్టారు. ఇష్టారాజ్యంగా సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. వీటిపై ఎన్‌ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌, కార్మిక పరిషత్‌ తదితర సంఘాలు ఎండీ, మంత్రి, ప్రభుత్వ పెద్దలకు వినతులు ఇచ్చి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Apr 02 , 2025 | 05:15 AM