India vs Australia 3rd ODI : ఒత్తిడికి చిత్తు.. చేజారిన కప్పు

ABN , First Publish Date - 2023-03-23T00:32:17+05:30 IST

బ్యాటింగ్‌ వైఫల్యంతోపాటు ప్రత్యర్థి లోయరార్డర్‌ను వేగంగా పడగొట్టలేని బలహీనత టీమిండియాకు వన్డే సిరీస్‌ను దూరం చేసింది. బుధవారం జరిగిన మూడో, ఆఖరి వన్డేలో..

 India vs Australia 3rd ODI : ఒత్తిడికి చిత్తు..  చేజారిన కప్పు

తిప్పేసిన జంపా

21 పరుగులతో ఆసీస్‌ గెలుపు

2-1తో సిరీస్‌ కైవసం

చెన్నై: బ్యాటింగ్‌ వైఫల్యంతోపాటు ప్రత్యర్థి లోయరార్డర్‌ను వేగంగా పడగొట్టలేని బలహీనత టీమిండియాకు వన్డే సిరీస్‌ను దూరం చేసింది. బుధవారం జరిగిన మూడో, ఆఖరి వన్డేలో భారత్‌ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో చేజార్చుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (47 బంతుల్లో 47), అలెక్స్‌ క్యారీ (38) ఫర్వాలేదని పించినా.. టెయిలెండర్లు 66 పరుగులు జోడించడంతో కంగారూలు సవాల్‌ విసిరే స్కోరు చేయగలిగారు. హార్దిక్‌ పాండ్యా, కుల్దీ్‌పకు చెరో 3, సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 49.1 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది. కోహ్లీ (72 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 54), పాండ్యా (40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40) పోరాడారు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జంపా.. టీమిండియా వెన్ను విరిచాడు. ఏగర్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. మార్ష్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ దక్కింది.

శుభారంభం దక్కినా..: ఛేదనలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (30), శుభ్‌మన్‌ గిల్‌ (37) టీమిండియాకు నిలకడైన ఆరంభాన్నిచ్చినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో ఓటమి తప్పలేదు. 10వ ఓవర్‌ తొలి బంతికి రోహిత్‌ను ఎబాట్‌ క్యాచవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. క్రీజులో నిలదొక్కుకొన్న గిల్‌ను జంపా ఎల్బీగా వెనక్కిపంపాడు. దీంతో కోహ్లీ, రాహుల్‌ (32) జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. మధ్య ఓవర్లలో ఎక్కువగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించిన వీరిద్దరూ.. మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే, స్కోరు బోర్డు ఊపందుకొంటున్న సమయంలో రాహుల్‌ను జంపా అవుట్‌ చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన అక్షర్‌ (2) విరాట్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పాండ్యా.. కోహ్లీకి సహకారం అందించాడు. సింగిల్‌తో కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. హార్దిక్‌ 6, 4తో బ్యాట్‌కు పని చెప్పాడు. సాఫీగా సాగుతున్న సమయంలో 36వ ఓవర్‌లో తొలుత కోహ్లీని, ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్‌ను ఏగర్‌ అవుట్‌ చేసి భారత శిబిరంలో గుబులు రేపాడు. సూర్య గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడం సిరీ్‌సలో ఇది మూడోసారి. దీంతో జట్టును గెలిపించాల్సిన బాధ్యత హార్దిక్‌, జడేజా (18)లపై పడింది. చివరి 10 ఓవర్లలో 66 పరుగులు అవసరమవగా.. ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగి పోయింది. పాండ్యా, జడేజాలు ఏడో వికెట్‌కు 33 రన్స్‌ భాగస్వామ్యంతో పరిస్థితిని చేయిదాటకుండా చూశారు. అయితే, మరోసారి బౌలింగ్‌కు దిగిన జంపా.. వీరిద్దరినీ అవుట్‌ చేసి భారత ఆశలపై నీళ్లు కుమ్మరించాడు.

తోకతో కొట్టారు: పాండ్యా, కుల్దీప్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడిలో పడిన ఆస్ట్రేలియా.. లోయరార్డర్‌ పుణ్యమాని పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఆసీ్‌సకు ఓపెనర్లు హెడ్‌ (33), మార్ష్‌ దూకుడైన ఆరంభాన్నే ఇచ్చారు. అయితే, 11వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన పాండ్యా.. తన వరుస మూడు ఓవర్లలో హెడ్‌, స్మిత్‌, మార్ష్‌ను అవుట్‌ చేసి ఆసీ్‌సకు పగ్గాలేశాడు. హార్దిక్‌ బౌలింగ్‌లో గిల్‌ క్యాచ్‌ను చేజార్చడంతో బతికి పోయిన హెడ్‌.. అదే ఓవర్‌లో మరో షాట్‌ ఆడే క్రమంలో కుల్దీప్‌కు దొరికిపోయాడు. దీంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్‌ స్మిత్‌ (0)ను క్యాచ్‌ అవుట్‌ చేసిన పాండ్యా.. మార్ష్‌ను బౌల్డ్‌ చేశాడు. మధ్య ఓవర్లలో మన స్పిన్నర్ల ధాటికి స్కోరు వేగం నెమ్మదించింది. నాలుగో వికెట్‌కు 40 రన్స్‌ జోడించిన వార్నర్‌ (23), లబుషేన్‌ (28)ను కుల్దీప్‌ వెనక్కిపంపాడు. 138/5తో ఇబ్బందుల్లోపడ్డ కంగారూలను క్యారీ, స్టొయినిస్‌ (25) ఆరో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, స్టొయిని్‌సను అక్షర్‌ అవుట్‌ చేయగా.. 203 స్కోరు వద్ద క్యారీని కుల్దీప్‌ బౌల్డ్‌ చేశాడు. సెటిల్డ్‌ బ్యాటర్లు ఇద్దరూ స్వల్పతేడాతో అవుటవడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఎంతోసేపు సాగదనిపించింది. కానీ, టెయిలెండర్లు ఎబాట్‌ (26), ఏగర్‌ (17), స్టార్క్‌ (10), జంపా (10నాటౌట్‌) టీమ్‌ స్కోరును 270కి చేరువ చేశారు.

కుల్దీప్‌పై రోహిత్‌ అసహనం

39వ ఓవర్‌లో చివరి బంతికి కుల్దీప్‌ వేసిన గూగ్లీ.. ఆస్టన్‌ ఏగర్‌ బ్యాట్‌ను బీట్‌ చేస్తూ ప్యాడ్‌కు తగిలింది. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా.. రివ్యూకు వెళ్లాల్సిందిగా కెప్టెన్‌ రోహిత్‌ను కుల్దీప్‌ బలవంతంగా ఒప్పించాడు. అయితే, ఆఫ్‌ స్టంప్‌కు ఆవల ప్యాడ్‌ను తాకడంతో రివ్యూ కోల్పోవాల్సి ఉంది. దీంతో రోహిత్‌ అసహనం వ్యక్తం చేయగా.. కుల్దీప్‌ చిన్నబుచ్చుకున్నాడు.

ఆస్ట్రేలియా: హెడ్‌ (సి) కుల్దీప్‌ (బి) హార్దిక్‌ 33, మార్ష్‌ (బి) హార్దిక్‌ 47, స్మిత్‌ (సి) రాహుల్‌ (బి) హార్దిక్‌ 0, వార్నర్‌ (సి) హార్దిక్‌ (బి) కుల్దీప్‌ 23, లబుషేన్‌ (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 28, క్యారీ (బి) కుల్దీప్‌ 38, స్టొయినిస్‌ (సి) గిల్‌ (బి) అక్షర్‌ 25, ఎబాట్‌ (బి) అక్షర్‌ 26, ఏగర్‌ (సి) అక్షర్‌ (బి) సిరాజ్‌ 17, స్టార్క్‌ (సి) జడేజా (బి) సిరాజ్‌ 10, జంపా (నాటౌ ట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 49 ఓవర్లలో 269 ఆలౌట్‌; వికెట్లపతనం: 1-68, 2-74, 3-85, 4-125, 5-138, 6-196, 7-203, 8-245, 9-247; బౌలింగ్‌: షమి 6-0-37-0, సిరా జ్‌ 7-1-37-2, అక్షర్‌ 8-0-57-2, హార్దిక్‌ 8-0-44- 3, జడేజా 10-0-34-0, కుల్దీప్‌ 10-1-56-3.

భారత్‌: రోహిత్‌ (సి) స్టార్క్‌ (బి) ఎబాట్‌ 30, గిల్‌ (ఎల్బీ) జంపా 37, కోహ్లీ (సి) వార్నర్‌ (బి) ఏగర్‌ 54, రాహుల్‌ (సి) ఎబాట్‌ (బి) జంపా 32, అక్షర్‌ (రనౌట్‌) 2, హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) జంపా 40, సూర్యకుమార్‌ (బి) ఏగర్‌ 0, జడేజా (సి) స్టొయినిస్‌ (బి) జంపా 18, కుల్దీప్‌ (రనౌట్‌) 6, షమి (బి) స్టొయినిస్‌ 14, సిరాజ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 49.1 ఓవర్లలో 248 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-65, 2-77, 3-146, 4-151, 5-185, 6-185, 7-218, 8-225, 9-243; బౌలింగ్‌: స్టార్క్‌ 10-0-67-0, స్టొయినిస్‌ 9.1-0-43-1, ఎబాట్‌ 10-0-50-1, జంపా 10-0-45-4, ఏగర్‌ 10-0-41-2.

Updated Date - 2023-03-23T07:30:13+05:30 IST