HYD: ఆ నియోజకవర్గంలో.. గెలిస్తే.. మంత్రి పదవే
ABN , First Publish Date - 2023-10-22T09:19:56+05:30 IST
సనత్‌నగర్ నియోజకవర్గమంటే ప్రతీ అభ్యర్థికి సెంటిమెంట్. ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి దక్కడం ఆనవాయితీగా
- సెంటిమెంట్‌గా సనత్‌నగర్ నియోజకవర్గం
- ఎవరు గెలిచినా వరిస్తున్న అమాత్య పదవి
- ఏకంగా సీఎం అయిన మర్రి చెన్నారెడ్డి
- శ్రీపతి, మర్రి, తలసానికి మంత్రి పదవులు
- ఆరుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ విజయం
- గత ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ
- మూడోసారి బరిలోకి మంత్రి తలసాని శ్రీనివాస్
- కంచు‘కోట’ను కాపాడేలా నీలిమ ప్రయత్నం
మంత్రి పదవికి ఆ నియోజకవర్గం సెంటిమెంట్‌గా నిలుస్తోంది. అక్కడ గెలిచారంటే అమాత్యా అనిపించుకోవాల్సిందే. అంతలా ముద్రపడిన సనత్‌నగర్(Sanatnagar) నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన మర్రి చెన్నారెడ్డి(Marri Chennareddy) ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్‌రావు, మర్రి శశిధర్‌రెడ్డి, తలసాని మంత్రులయ్యారు. 1978లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి బీఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించాయి. 2014లో టీడీపీ తరఫున, 2018లో టీఆర్‌ఎస్ తరఫున గెలుపొందిన తలసాని ముచ్చటగా మూడోసారి గెలవాలని ఆరాటపడుతున్నారు. తలసాని జోరుకు అడ్డు పుల్ల వేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ చెమటోడుస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటను కాపాడతానని ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్, (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్ నియోజకవర్గమంటే ప్రతీ అభ్యర్థికి సెంటిమెంట్. ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 1978లో సనత్‌నగర్ నియోజకవర్గం ఆవిర్భవించింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున దివంగత నేత ఎస్. రాందాస్ ఘన విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య నువ్వా? నేనా? అన్నట్లు పోటీ ఉండేది. 1989లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మర్రి చెన్నారెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆ తర్వాత దివంగత శ్రీపతి రాజేశ్వరరావు, మర్రి శశిధర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు మంత్రి పదవులు లభించాయి. ఇప్పటివరకు ఇక్కడి నుంచి ఆరు సార్లు కాంగ్రెస్, టీడీపీ నాలుగు సార్లు, టీఆర్‌ఎస్ ఒకసారి విజయం సాధించాయి.
బరిలో మూడోసారి తలసాని
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా కోట నీలిమా ఇప్పటికే బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పేరు దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు ఆశావహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,44,946 మంది ఓటర్లు ఉన్నారు. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ మూడోసారి గెలుపొందాలని తహతహలాడుతున్నారు. 2014లో టీడీపీ తరఫున గెలిచిన ఆయన ఆ తర్వాత టీఆర్‌ఎ్‌సలో చేరా రు. 2018 ఎన్నికలో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి రెండోసారి విజయబావుటా ఎగురేశారు. 2009 వరకు కాంగ్రె్‌సకు కంచుకోట ఉన్న ఈ నియోజకవర్గంలో తలసాని పాగా వేశారు.
మహిళ అభ్యర్థితో కాంగ్రెస్
ఒకప్పుడు కాంగ్రె్‌సకు కంచుకోటైన ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచేందుకు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి మహిళ అభ్యర్థి కోటా నీలిమను బరిలోకి దించింది. 1983లో కాట్రాగడ్డ ప్రసూన పోటీ చేయగా, ఆ తర్వాత ప్రధాన పార్టీలు మహిళ అభ్యర్థులకు టికెట్ ఇవ్వలేదు. తాజాగా కాంగ్రెస్ మహిళ అభ్యర్థికి టికెట్ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టికెట్ ప్రకటన రాగానే ఆమె ప్రచార భేరి మోగించారు. ఇంటింటికీ తిరుగుతూ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్నారు.
మర్రికే బీజేపీ టికెట్ ఖరారు?
సనత్‌నగర్ బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరారు. మరోసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుండగా ఆయనకే టికెట్ కేటాయిస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మహిళా మోర్చా మాజీ అధ్యక్షరాలు ఆకుల విజయ, బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యామ్‌సుందర్‌గౌడ్, రాంగోపాల్‌పేట కార్పొరేటర్ చీర సుచిత్ర భర్త చీర శ్రీకాంత్ టికెట్ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురే కాకుండా ఇంకా 20 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అభివృద్ధి కలిసొస్తుందా?
నియోజకవర్గంలో రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట, బేగంపేట, అమీర్‌పేట , సనత్‌నగర్, మోండా మార్కెట్ (పాక్షికం) డివిజన్లలో కోట్లాది రూపాయలతో మంత్రి తలసాని పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా బన్సీలాల్‌పేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం నిర్మించారు. అటు అభివృద్ధి, ఇటు పార్టీ బలోపేతానికి సమాన ప్రాధాన్యతనిస్తూ తాజా ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు శ్రమిస్తున్నారు.
గట్టి సవాలు తప్పదా?
మారుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, బీజేపీల నుంచి తలసానికి గట్టి సవాలు ఎదురవచ్చని భావిస్తున్నారు. కాంగ్రె్‌సకు పెద్ద దిక్కుగా ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి కొద్దినెలల క్రితం హస్తం పార్టీకి చెయ్యిచ్చి కాషాయ కండువా కప్పుకున్నారు. మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ మార్పుతో కాంగ్రెస్ కొంత బలహీనపడగా, కాషాయ పార్టీ బలోపేతమైంది. ఇప్పటికే సనత్‌నగర్ నియోజకవర్గంలో రాంగోపాల్‌పేట, అమీర్‌పేట, మోండా మార్కెట్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లు అధికంగా ఉండడం, విద్యావంతులు, యువత ఎక్కువ సంఖ్యలో ఉండడం.. బీజేపీ పట్ల వారు ఆకర్షితులవుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓటమి తర్వాత తలసాని మరింత దూకుడుగా వ్యవహరిస్తూ అన్ని కాలనీలు, బస్తీల్లో అభివృద్ధిపై దృష్టి సారించారు.