వెయ్యి కోట్లు తిన్నారు
ABN , First Publish Date - 2023-04-30T03:19:06+05:30 IST
ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం వెనుక దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఓఆర్‌ఆర్ లీజు దేశంలోనే అతిపెద్ద స్కామ్: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం వెనుక దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కనీసంగా రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే ఈ లీజును రూ.7,380 కోట్లకే ముంబై కంపెనీకి కట్ట బెట్టారన్నారు. ఈ వ్యవహారంలో రూ.వెయ్యి కోట్ల వరకూ చేతులు మారాయంటూ తీవ్ర ఆరోపణ చేశారు. గాంధీ భవన్‌లో శనివారం మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్ లీజుద్వారా రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని మొదట్లో చెప్పినవారు.. ఆ తర్వాత రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్లు వస్తాయన్నారని, చివరకు రూ.7,380 కోట్లకు ఖరారు చేసుకున్నార న్నారు. ఈ వ్యవహారంలో దాగున్న మతలబేంటని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ లీజుకు సంబంధించిన మొత్తం వ్యవహారం మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నుల్లో జరిగిందని, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ సంతకం పెట్టారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం దిగిపోవడానికి ఆరు నెలల ముందు తీసుకున్న ఏ నిర్ణయాలనైనా వచ్చే తమ ప్రభుత్వం సమీక్షిస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
ఈ అంశంలో యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేశ్ రంజన్ నిర్ణయాలన్నింటిని వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. 2018 నుంచి ఓఆర్‌ఆర్ టోల్‌ను ఏయే సంస్థలు వసూలు చేశాయి? వాటికి టెండర్ రూపంలో కట్టబెట్టారా? లేక నామినేషన్ రూపంలో కట్టబెట్టారా? అన్నది స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఓఆర్‌ఆర్ టోల్‌ను ఈగల్ ఇన్ర్ఫాకు కట్టబెట్టారన్న రేవంత్ రెడ్డి.. ఈ రోడ్డుపైన రోజుకు రూ.2 కోట్ల మేరకు టోల్ వసూలవుతున్నట్లు చెప్పారు. టెండర్ అవసరం లేకుండా ఏటా లీజు పొడిగించుకుంటూ పోతూ ఇందులో మంత్రి కేటీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ను ఆదాయ వనరుగా కేటీఆర్ మిత్రబృందం ఉపయోగించుకుంటోందన్నారు. ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయోగించుకునేందుకు కేటీఆర్ కుటుంబం ఆలోచించిందని, ఇందులో భాగంగా టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(టీఓటీ) విధానంలో 30 ఏళ్ల పాటు ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకుందన్నారు. రూ.వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్‌ఆర్‌ను ప్రయివేటుకు అమ్మేశారని ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను సీఎం కేసీఆర్ అమ్ముతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా రూ.6696 కోట్ల వ్యయం చేసి.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఓఆర్‌ఆర్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందన్నారు. ఓఆర్‌ఆర్ టెండర్ విధానాలపై ఈడీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ సహా విచారణ సంస్థలన్నింటికీఫిర్యాదు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు.
గ్రేటర్ ప్రజలూ.. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి!
విశ్వనగరంలో మ్యాన్ హోళ్లు, వీధి కుక్కలు చిన్న పిల్లల ప్రాణాలను మింగుతున్నాయంటూ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కళాసిగూడలో మౌనిక మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. రాజమహళ్లు, రాచరిక పోకడల ముందు సామాన్యుల ప్రాణాలు వెలవెల బోతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రభుత్వం పట్టించుకోదు. మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి’’ అంటూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారంనాడు రేవంత్ ట్వీట్ చేశారు.