CPM, CPI: కామ్రేడ్స్‌ ఎటు?

ABN , First Publish Date - 2023-06-27T02:35:03+05:30 IST

రాష్ట్రంలో వామపక్షాలు వచ్చే శాసనసభ ఎన్నికల కోసం అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో కలసి ప్రయాణించే విషయంలో పునరాలోచనలో పడ్డాయి.

CPM, CPI: కామ్రేడ్స్‌ ఎటు?

నిన్నటిదాకా బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సై

చెరో రెండు సీట్లిస్తే చాలని సంకేతాలు

కర్ణాటక ఎన్నికలతో మారిన పార్టీల స్వరం

కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగిందని అంచనా

కొత్త ఆప్షన్‌ దొరికిందన్న నారాయణ

బీజేపీని బీఆర్‌ఎస్‌ అడ్డుకోవట్లేదని వ్యాఖ్య

బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య

బంధం ఉందన్న సీపీఐ నేత కూనంనేని

అధిక సీట్ల కోసం ప్రయత్నించే అవకాశం

కాదంటే కాంగ్రెస్‌ పిలుస్తుందన్న భరోసా

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వామపక్షాలు వచ్చే శాసనసభ ఎన్నికల కోసం అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో కలసి ప్రయాణించే విషయంలో పునరాలోచనలో పడ్డాయి. మారిన రాజకీయ పరిస్థితులను సీపీఎం, సీపీఐ జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో హస్తంతో దోస్తీ దిశగా కూడా ఆలోచన చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీని ఓడించేందుకు టీఆర్‌ఎ్‌సకు మద్దతు పలికిన వామపక్షాలు, ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం కూడా చేశాయి. 8 నెలల క్రితం ఉప ఎన్నికల సాయంతో మొదలైన వారి స్నేహం అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై చర్చల వరకు వచ్చింది. అయితే, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి మారింది. రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనే విషయంలో నీరసించి పోయిన కాంగ్రెస్‌ను నమ్ముకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎ్‌స/బీఆర్‌ఎ్‌సతో అంటకాగిన వామపక్షాలకు కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో మహాయోధుడు కనిపిస్తున్నాడు.

కాంగ్రెస్‌లో అవలక్షణాలెన్ని ఉన్నా కర్ణాటకలో మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిములు ఆ పార్టీకి ఓటేసిన తీరు వామపక్షాలను పునరాలోచనలో పడేసింది. తెలంగాణలో కూడా ముస్లిములు గంపగుత్తగా కాంగ్రెస్‌ వైపు మళ్లితే? అనే చర్చ ఇప్పటికే రాష్ట్రంలో సాగుతోంది. ఇప్పటిదాకా అజేయంగా కనిపించిన అధికారపక్షం బీఆర్‌ఎ్‌సలో తాజా పరిణామాల తర్వాత ఆత్మవిశ్వాసం క్షీణించింది. కాంగ్రెస్‌ ఉనికిని కూడా గమనించనట్లుగా వ్యవహరిస్తూ, బీజేపీపైనే సర్వశక్తులు కేంద్రీకరించి దాడులు చేసినకేసీఆర్‌, కేటీఆర్‌లు ఇప్పుడు కాంగ్రెస్‌ పైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఒక పార్టీకి ఆదరణ తగ్గడం మొదలైతే అదే కొనసాగుతుందని, అలాగే ఒక పార్టీకి గ్రాఫ్‌ పెరగడం మొదలైతే అది అలాగే పెరుగుతుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ గ్రాఫ్‌ తిరుగుముఖం పట్టింది. ఎన్నికలు దగ్గయ్యే కొద్దీ అది వేగం పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్‌ పదేళ్ల పాలన చూశామన్న భావన ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. మరో పార్టీకి ఒక్కసారి అవకాశమివ్వాలన్న భావన మొగ్గ తొడిగింది. ఈ పరిణామాలన్నీ వామపక్షాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. మునుగోడు ఎన్నికల నుంచి వామపక్షాలు బీఆర్‌ఎ్‌సతో కలిసి నడవాలని అనుకున్నాయి.

బీజేపీని ఎదిరించగల సత్తా కేసీఆర్‌కే ఉందని వాదించాయి. అయితే, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ పరిణామాలకు తోడు, తాజాగా పట్నాలో బీజేపీకి వ్యతిరేకంగా 15 విపక్ష పార్టీలు సమావేశమైనపుడు ఆ దిశగా కేసీఆర్‌ ఆసక్తి చూపకపోవడం కొత్త అనుమానాలకు తావిచ్చాయి. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా మరో కూటమి అంటూ కాంగ్రెస్‌కు మిత్రపక్షాలు లేకుండా చేసేందుకు వ్యూహం పన్నిన కేసీఆర్‌కు పట్నా సమావేశం తలుపులు మూసేసింది. జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో ఆయనకు చోటు లేకుండా చేసింది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యులను కలిసి వచ్చారు. ఈ పరిణామాలన్నీ నెల రోజులుగా చూస్తున్న సీపీఐ ముఖ్యనేతలు నారాయణ, సాంబశివరావు గొంతు సవరించుకున్నారు. బీజేపీని నిలువరించడంలో బీఆర్‌ఎస్‌ వెనుకబడిందని, పొత్తులకు తమకు కొత్త ఆప్షన్‌ దొరికిందని, బీజేపీని ఓడించేందుకు ఏ సెక్యులర్‌ పార్టీతోనైనా జట్టు కట్టడానికి సిద్ధమని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో అధికారానికి పోటీపడే ప్రధాన పక్షం కాంగ్రెసేనని రెండు వారాల క్రితం చెప్పడం ద్వారా నారాయణ తమ ఉద్దేశం ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య బంధం ఉందని మాట్లాడారు. ఇదంతా పొత్తుల బేరసారాల్లో ఒత్తిడి ఎత్తుగడల్లో భాగమనే అభిప్రాయమూ ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో వామపక్షాలు కలసి ప్రయాణించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. పట్నాలో 15 పార్టీల సమావేశానికి సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత రాజా వచ్చారు. వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో నడిచేట్లయితే రాష్ట్ర స్థాయిలో బీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకోవడం కొంత ఇబ్బందికరమే.

డిమాండ్‌ చేద్దాం

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని వామపక్షాలు బీఆర్‌ఎస్‌ను డిమాండ్‌ చేయనున్నాయి. బీఆర్‌ఎస్‌ బలం తగ్గుతుండటం, సిట్టింగ్స్‌లపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, పదేళ్ల పాలన చాలన్న అభిప్రాయం ప్రజల్లో ఉండటంతో తమ అవసరం అధికార పార్టీకి పెరిగిందన్న భావన లెఫ్ట్‌పార్టీలో నెలకొంది. అందుకే తమకిచ్చే సీట్ల సంఖ్యను పెంచాలని కేసీఆర్‌ను కోరబోతున్నాయి. త్వరలోనే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలసి సీట్ల విషయంపై స్పష్టత కోరనున్నాయి.

Updated Date - 2023-06-27T02:35:03+05:30 IST