Hyderabad: వీఎస్టీలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా
ABN , First Publish Date - 2023-02-02T11:04:46+05:30 IST
హైదరాబాద్: చిక్కడపల్లి, వీఎస్టీ (VST)లోని అన్నపూర్ణ బార్ సమీపంలోనీ ఓ గోదాంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆరా తీశారు.
హైదరాబాద్: చిక్కడపల్లి, వీఎస్టీ (VST)లోని అన్నపూర్ణ బార్ సమీపంలోనీ ఓ గోదాంలో జరిగిన అగ్నిప్రమాద (Fire Accident) ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. వ్యాపారుల్లో మార్పు రావట్లేదన్నారు. ఇకపై చెప్పేది ఉండదని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరి కారణంగా ఇతరులకు నష్టం జరుగుతుంటే.. ఎవరూ ఆ నష్టాన్ని భరించే పరిస్థితిలో లేరని.. ఇప్పటికైనా వ్యాపారస్తుల్లో మార్పు రావాలన్నారు. ఇప్పటికే అగ్నిప్రమాదాలపై కమిటీ ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో వేలాది గోడౌన్‌లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్నారు. వేసవిలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. సుమారు కోటి రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తామని, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అక్రమ గోడౌన్‌లు గుర్తించి నోటీసులు ఇస్తామన్నారు. ఇక నుంచి అన్ని వ్యాపార సంస్థలు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని డీసీపీ స్పష్టం చేశారు.
కాగా చిక్కడపల్లిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. వీఎస్టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గోదాంలో ఓ కంపెనీకి చెందిన కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ మెటీరియల్ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.