TSPSC Paper Leak: ఉద్యోగాల భర్తీపై చర్చకు మేం సిద్ధం.. బండి సంజయ్కి దమ్ముందా?
ABN , First Publish Date - 2023-03-25T16:29:51+05:30 IST
TSPSC ఘటన బయటపెట్టింది.. దొంగలను పట్టుకుంది మేము. దీనిపై ప్రతిపక్ష నేతలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: TSPSC ఘటన బయటపెట్టింది.. దొంగలను పట్టుకుంది మేము. దీనిపై ప్రతిపక్ష నేతలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. ఏదో జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద బురద జల్లేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని మంత్రి జగదీశ్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బండి సంజయ్ దీక్ష చేయానుకుంటే.. ఢిల్లీలో చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ దేశానికి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టాలని హితవు పలికారు. నిరాధార ఆరోపణలు చేస్తూ దీక్షలు చేపడుతూ తెలంగాణ యువతను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటూ మోదీ మోసం చేశారని.. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని దీక్ష చేయాలని హితవు పలికారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి బీజేపీ ఇచ్చిన ఉద్యోగాలు.. ఒక్క తెలంగాణలో ఇచ్చినన్ని ఉద్యోగాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల భర్తీపై చర్చకు మేం సిద్ధం.. బండి సంజయ్కి దమ్ముందా? అని సవాల్ విసిరారు. TSPSC స్వతంత్ర సంస్థ. దానికి కేటీఆర్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. దేశానికి మోదీ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేయాలి.. మీ మోసపు మాటలకు తెలంగాణ యువత మోసపోదు అని మంత్రి జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.