Mukarram Jah ; వేల కోట్ల స్థిరాస్తులున్నప్పటికీ.. పేదవాడిగా జీవితం..

ABN , First Publish Date - 2023-01-17T10:42:00+05:30 IST

హైదరాబాద్ 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముఖరం జా బహదూర్ టర్కీ ఇస్తాంబుల్ లోని తన నివాసంలో 90 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు

Mukarram Jah ; వేల కోట్ల స్థిరాస్తులున్నప్పటికీ.. పేదవాడిగా జీవితం..

Mukarram Jah : హైదరాబాద్ 8వ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముఖరం జా బహదూర్ టర్కీ ఇస్తాంబుల్ లోని తన నివాసంలో 90 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఫ్రాన్స్‌లో జన్మించి, టర్కీలో మరణించిన ఈ యువరాజు ముఖరం జా పార్దీవ దేహానికి హైదరాబాద్‌లోని మక్కా మసీదులోని ఆసిఫ్ జాహీ టూంబ్స్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన పార్దీవ దేహాన్ని హైదరాబాద్ ప్రజల సందర్శనార్థం చౌమల్ల ప్యాలెస్‌లో ఉంచనున్నారు. మక్కా మసీద్‌లోనే రెండవ నిజాం నుంచి ఆరవ నిజాం వరకు నిజాం రాజవంశీయుల సమాధులున్నాయి. చివరి నిజాం మరణవార్త హైదరాబాదీలను విషాదంలో ముంచెత్తింది.

విశేషమేమిటంటే..

టర్కీ చివరి పాలకుడు ఖలీఫా అయిన అబ్దుల్ మజీద్ -2 వ కుమార్తె టర్కీ యువరాణి యువరాణి దుర్రుషెహ్వార్, ముకర్రం జాలకు ముకర్రం జా జన్మించాడు. ఇక్కడ విశేషమేమంటే.. టర్కిష్, దక్కనీ రాజ కుటుంబాల వారసుడైన ముకర్రం జా తండ్రి, అతని తల్లి వరుసగా వారి దేశాలకు చివరి పాలకులుగా ఉన్నారు.

ఫిబ్రవరి 1967లో ఏడవ నిజాం మరణించిన తరువాత, ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసుడైన ముకర్రం జాకు భారత ప్రభుత్వం 6 ఏప్రిల్ 1967న చౌమహల్లా ప్యాలెస్‌లో పట్టాభిషేక వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా ముకర్రం జాను హైదరాబాద్ ఎనిమిదవ నిజాంగా అధికారికంగా ప్రకటించారు.

సొంత కొడుకు ఉన్నప్పటికీ..

తన తండ్రి తరఫు తాత అయిన ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు ముకర్రం జా ఎంతగానో ప్రియమైనవాడు కాబట్టి ఏడవ నిజాం తన సొంత కొడుకు ఆజం జాకు బదులుగా అతని మనవడు ముకర్రం జాను తన వారసుడిగా పేర్కొన్నాడు. అక్టోబరు 6, 1933లో జన్మించిన ముకర్రం జా ఆసిఫ్ జాహీ రాజవంశానికి చెందిన ఎనిమిదవ చివరి నిజాం. ఎనిమిదవ నిజాంగా పట్టాభిషక్తుడయ్యె నాటికి ముకర్రం జా ఆస్తి రూ. 25 వేల కోట్లు.

మదర్సా-ఏ -అలియా, జాగీర్దార్ కాలేజ్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ), డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్, లండన్‌లోని ఎటన్ కాలేజ్, లండన్‌లోని శాండ్‌హర్స్ట్ మిలిటరీ కాలేజ్‌లలో విద్యాభ్యాసం చేసిన ముకర్రం జాకు జోర్డాన్ రాజు హుస్సేన్ తదితర ప్రముఖులెందరో ఆయన సహవిద్యార్థులుగా ఉన్నారు.

ఆరు రాజభవనాలను విరాళంగా..

ముకర్రం జాకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్, హెవీ మిషనరీ రంగాలంటే అంటే అత్యంత ఇష్టం. అందుకే భారీ ఆటోమొబైల్స్‌, భారీ యంత్రాలపై పనిచేస్తూ తన జీవితంలో అధిక భాగాన్ని గడిపారు. సమాజంలో విద్యను అభివృద్ధి చేయాలనే అభీష్టం ఉన్నవాడైన చివరి నిజాం తన స్వంత మసరత్ మహల్ అని పిలిచే ఆరు రాజభవనాలను ముకర్రం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ (MJTEL)కి విరాళంగా ఇచ్చాki. ఈ ప్రాంగణంలో ఇప్పుడు ముకర్రం జా పాఠశాల కూడా ఉంది. ప్రిన్స్ ముకర్రం జా అప్పుడప్పుడు ముకర్రం జా పాఠశాలను సందర్శించి, విద్యా కార్యకలాపాలపై గొప్ప ఆసక్తిని కనపరుస్తారని పేర్కొన్నారు.

అత్యంత ధనవంతులలో ఒకరైనప్పటికీ, అతను సామాన్య జీవితం గడిపాడు. చాలా భక్తిపరుడు. సూఫీ సాధువులను గౌరవించేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా హజ్రత్ ఖాజా బందే నవాజ్ దర్గా సందర్శించేవారు. ఔరంగాబాద్, మహారాష్ట్రలో విద్య కోసం అనేక ఆస్తులను విరాళంగా ఇచ్చాడు. క్రమం తప్పకుండా అర్థరాత్రి ప్రార్థనలు (నమాజ్-ఎ-తహజ్జుద్) చేసేవాడు. కాగా, ఆయన సన్నిహితులైన కొందరు స్వార్థపరులు ఆయనపై తప్పుడు ప్రచారం చేశారు. అతని సంపద, పురాతన వస్తువులు, ఆభరణాలను దోచుకున్న అతని నమ్మకమైన వ్యక్తులే ముకర్రం జాకు సాధారణ ప్రజల మధ్య దూరాన్ని సృష్టించారు.

టర్కీలో నివసించినప్పటికీ..

1970 లో హైదారాబాద్ వదలి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ముకర్రం జా అక్కడ తీవ్ర నష్టాలకు గురై టర్కీ లో స్థిరపడ్డాడు. ముకర్రం-జా కారోనేషన్ ఉత్సవం 2017 లో జరిగింది. ఈ సందర్భంగా చౌమల్లా ప్యాలెస్ నుంచి కింగ్ కోఠి ప్యాలెస్ వరకు ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణించిన ముకర్రం జాను దారి పొడుగునా వేలాది మంది హైదరాబాదీయులు శుభాకాంక్షలు అందచేశారు. ఇదే ఆయన హైదరాబాద్ చివరి పర్యటన.

తన జీవితంలో ఎక్కువ భాగం ఆస్ట్రియా, టర్కీలో నివసించినప్పటికీ, హైదరాబాద్‌తో సెంటిమెంట్, భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సాధ్యమైనప్పుడల్లా నగరాన్ని సందర్శించాడు. రాజకీయాలపై ఆసక్తి చూపించని ప్రిన్స్‌కు జవహర్‌లాల్ నెహ్రూ అంటే ఇష్టం. యువరాజు ముఖరం జాను ముస్లిం దేశానికి రాయబారిగా నెహ్రూ నియమించాలనుకున్నారు. కానీ దానిని సున్నితంగా తిరస్కరించారు. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు ముకర్రం జా అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు కానీ ఈ సంబంధాలను ఎప్పుడూ ఉపయోగించుకోలేదు.

ఎస్రా విడాకులు ఇవ్వడంతో..

వేల కోట్ల స్థిరాస్తులున్నప్పటికీ లిక్విడ్ క్యాష్ లేని బీద వాడిగా గడిపారు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా చితికిపోయింది. ఎస్రా అతనికి విడాకులు ఇవ్వడంతో ఆయన పెర్త్‌కు చెందిన స్థానిక అమ్మాయి హెలెన్ సిమన్స్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును అయేషాగా మార్చుకుంది. గాసిప్ కాలమిస్ట్‌లకు పుష్కలంగా మేత అందించిన హెలెన్‌కు.. ఒక ద్విలింగ వ్యక్తితో సంబంధం తర్వాత 1987లో హెలెన్‌కు ఎయిడ్స్ సోకి మరణించిందని వార్తలొచ్చాయి. ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడని ముఖరం జాపై జరిగిన ప్రచారానికి భిన్నంగా, ప్రిన్స్‌కు ఒక్కరే భార్య.

Updated Date - 2023-01-17T10:42:51+05:30 IST