కాంగ్రెస్ ప్రభుత్వం, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే సంగారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుంది
ABN , First Publish Date - 2023-11-28T23:19:07+05:30 IST
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాగా పనిచేసిన కారణంగానే సంగారెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి పేర్కొన్నారు.

జగ్గారెడ్డితోనే సంగారెడ్డికి గుర్తింపు
కొట్లాడి మెడికల్ కాలేజీ తెచ్చారు
జగ్గారెడ్డికి మరోసారి ఓటేయాల్సిన సమయం వచ్చింది
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,
సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి
ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి, నవంబరు 28: నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాగా పనిచేసిన కారణంగానే సంగారెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహంవద్ద జరిగిన సమావేశంలో జయారెడ్డి మాట్లాడుతూ జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి.. సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి అనే పేరెలా వచ్చిందో కూడా మీకందరికీ తెలుసన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ కోసం కొట్లాడి తీసుకువచ్చింది జగ్గారెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఐఐటీహెచ్, కలెక్టరేట్, కోర్టు, పాలిటెక్నిక్ కాలేజ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది కూడా జగ్గారెడ్డి వల్లనే అని గుర్తుచేశారు. తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేసిందో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు జగ్గారెడ్డి ఎలా పనిచేశారో మీరంతా చూశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని, తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులు మారుతాయని అనుకుంటే ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు జగ్గారెడ్డికి ఓటేసి గెలిపించారని, ఇప్పుడు మరోసారి జగ్గారెడ్డికి ఓటువేసే సమయం వచ్చిందని జయారెడ్డి చెప్పారు. ఈ నెల 30వ తేదీన ఈవీఎం 3వ నంబర్లో చేయిగుర్తుపై ఓటువేసి జగ్గారెడ్డిని గెలిపించాలని కోరారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే సంగారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. సహాయం కోసం వచ్చేవారి వెన్నంటి ఉండే జగ్గారెడ్డిని ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదించాలని కోరారు.