ఉత్తరాఖండ్‌కు హుస్నాబాద్‌ మామిడి

ABN , First Publish Date - 2023-04-18T00:08:03+05:30 IST

హుస్నాబాద్‌ పది రోజుల క్రితం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏజెంట్‌ మామిడికాయల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వివిధ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌కు హుస్నాబాద్‌ మామిడి
హుస్నాబాద్‌ మార్కెట్‌యార్డు కొనుగోలు కేంద్రంలోని మామిడికాయలు

పట్టణంలోని మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు

తామెర పురుగు తెగులుతో తగ్గిన దిగుబడి

సగానికి పడిపోయిన ధరలు

హుస్నాబాద్‌, ఏప్రిల్‌ 17 : హుస్నాబాద్‌ ప్రాంత మామిడికాయలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి రవాణా అవుతున్నాయి. పది రోజుల క్రితం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏజెంట్‌ మామిడికాయల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వివిధ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. దశాబ్దాలుగా రైతులు వరంగల్‌, కరీంనగర్‌ వంటి పట్టణాలకు వెళ్లి విక్రయించేవారు. హుస్నాబాద్‌లో మూడేళ్లుగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు వినియోగించుకుంటున్నారు.

1600 ఎకరాలకు పైగా మామిడి తోటలు

డివిజన్‌లో దాదాపు 1600 ఎకరాలకుపైగా మామిడి తోటలు ఉన్నాయి. బంగినిపల్లి, దశేరి, కోతమామిడి రకాల తోటలు ఉండగా ఈ పండ్లకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. అయితే ఈసారి మామిడి తోటల రైతులు కుదేలు అయ్యారు. దిగుబడి తగ్గడానికి తోడు ధర అమాంతం పడిపోవడంతో నష్టాలు బారిన పడ్డారు. పూత బాగానే వచ్చినప్పటికీ తామెరపురుగు కాయ రాకుండా పూతను తినేసిందని రైతులు పేర్కొన్నారు. మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.

వివిధ రాష్ట్రాలకు ఎగుమతి

హుస్నాబాద్‌ ప్రాంతంలో కొనుగోలు చేసిన మామిడికాయలను ఇక్కడి నుంచి ప్యాక్‌ చేసి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌, రాష్ట్రానికి రవాణా చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రకు ఎగుమతి అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కూడా మామిడికాయలకు ధర లేదని, అందుకే ఇక్కడ తగ్గిందని కమీషన్‌ ఏజెంట్‌ పేర్కొంటున్నారు.

ధర రూ. 35వేలకు మించడం లేదు

మేలు రకంగా ఉన్న బంగినిపల్లి మామిడికాయలను టన్నుకు రూ.35 వేలకు కొనుగోలు చేస్తున్నారు. నాసిరకంగా ఉన్న వాటికి రూ.20 నుంచి 30 వేల వరకే ధర పలుకుతున్నది. గత సంవత్సరం టన్నుకు రూ.70వేల వరకు కొనుగోలు చేశారు. దాదాపు టన్నుకు రూ.40 వేల వరకు నష్టం వాటిల్లింది. దశేరి రకాన్ని మాత్రం రూ.40వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం హుస్నాబాద్‌ కేంద్రంలో 400 టన్నుల వరకు కొనుగోలు చేశారు. కానీ ఈసారి దిగుబడి తగ్గడంతో ఆ పరిస్థితి లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు పేర్కొంటున్నారు.

తామెరపురుగుతో కాయ రాలేదు

నాకు 4 ఎకరాల మామిడితోట ఉంది. ఈసారి పూత బాగా వచ్చింది. కానీ తామెర పురుగు పూతను తినేసింది. ఎన్ని మందులు కొట్టిన ఫలితం లేకుండాపోయింది. మొదట పూతను చూసి ఈ నాలుగు ఎకరాలకు గుత్తేదారు రూ.2లక్షలు ఇస్తానన్నాడు. ఇప్పుడు కాత లేకపోవడంతో అంత డబ్బు ఇవ్వలేని పరిస్థితి. ఏ మార్కెట్‌లోనూ మామిడికి ధర పలకడం లేదు.

- అయిలేని శంకర్‌రెడ్డి, మామిడి రైతు, హుస్నాబాద్‌

గతేడాది 400 టన్నులు కొనుగోలు చేశాను

హుస్నాబాద్‌లో గత సంవత్సరం రైతుల నుంచి 400 టన్నులు కొనుగోలు చేశాను. ఈసారి అంత వచ్చే పరిస్థితి లేదు. బయట రాష్ట్రాల్లోనూ ధర లేదు. నాణ్యతగా ఉన్న బంగినిపల్లి మామిడి టన్నుకు రూ.35వేలపైన ధర ఇస్తున్నారు. ఇక వేరే వాటికి రూ.20 వేల నుంచి 30వేల వరకు ఇస్తున్నాం. పోయిన సంవత్సరం రూ.70వేల వరకు ధర ఉన్నది.

- గుర్రాల సందీప్‌, కమీషన్‌ ఏజెంట్‌

Updated Date - 2023-04-18T00:08:03+05:30 IST