మాస్టర్‌ప్లాన్ మార్పునకు మోక్షమెప్పుడో?
ABN , First Publish Date - 2023-01-01T22:36:37+05:30 IST
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అధికారుల నిర్లక్ష్యం సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి శాపంగా మారింది.

మంత్రుల ఆదేశాలు బేఖాతరు
సంగారెడ్డిలో ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకులు
మున్సిపల్, హెచ్‌ఎండీఏ ఆదాయానికి గండి
సంగారెడ్డి టౌన్, జనవరి 1 : హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అధికారుల నిర్లక్ష్యం సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి శాపంగా మారింది. తప్పులతడకగా ఉన్న హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ను మార్చాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులను ఆదేశించి ఐదేళ్లవుతున్నా అధికారులు స్పందించ లేదు. సంగారెడ్డిలో 2013లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ తప్పులతడకగా ఉందని ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో సర్వే చేసి ప్రణాళికను మార్చాలని 2017 డిసెంబరులో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అప్పటి హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికీ మొదలుకాకపోవడంతో పట్టణంలో ఇళ్ల నిర్మాణాల అనుమతులకు అడ్డంకిగా మారుతున్నది. ఫలితంగా మున్సిపల్, హెచ్‌ఎండీఏలు ప్రతి యేటా కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోతున్నాయి.
అభివృద్ధికి అడ్డంకి
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ గృహ ప్రణాళిక చట్టం-2013 మాస్టర్ ప్లాన్‌ను క్షేత్రస్థాయిలో సర్వేలు, తనిఖీలు చేయకుండానే తయారు చేశారనే ఆరోపణలున్నాయి. 2013లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను మార్చాలని 2017లో అప్పటి కలెక్టర్ మాణిక్కరాజ్ కన్నన్, మున్సిపల్ కౌన్సిల్ హెచ్‌ఎండీఏకు లేఖలు పంపారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు కూడా ఈమేరకు సిఫారుసు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు మాస్టర్‌ప్లాన్, అలైన్‌మెంట్‌ను మార్చేందుకు క్షేత్ర పరిశీలన కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.
60 ఫీట్ల రోడ్లు100 ఫీట్లుగా అలైన్‌మెంట్
పట్టణంలోని 60 ఫీట్ల రోడ్లను 100 ఫీట్ల రోడ్లుగా మాస్టర్‌ప్లాన్‌లో చూపుతూ అలైన్‌మెంట్ తయారు చేశారు. పట్టణంలో కల్వకుంట-చిమ్నాపూర్-ఐఐటీ వరకు ప్రస్తుతం ఉన్న 60 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా చూపారు. దీని అలైన్‌మెంట్ తప్పుగా చూపడం వల్ల కల్వకుంట రోడ్డులోని వందల సంఖ్యలో ఇళ్లను కూల్చి వేయాల్సి ఉంటుంది. అలాగే ఐటీఐ నుంచి గొల్లగూడెం-మంజీరా పైప్‌లైన్- పాత కంది మీదుగా ఐఐటీ వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డు వంద ఫీట్ల రోడ్డుగా చూపినప్పటికీ ఈ రూట్‌లో 100 ఫీట్ల రోడ్డు వేయడానికి ఏ మాత్రం అస్కారం లేదు. వీటన్నింటి గుర్తించిన మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సంగారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని కోరుతూ 2017లో హెచ్‌ఎండీఏకు మూడుసార్లు రాసిన లేఖలను హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేస్తున్నారన్న ఆరోపనలున్నాయి. మాస్టర్‌ప్లాన్‌లో కల్వకుంట నుంచి ఐఐటీ వరకు, ఐటీఐ నుంచి పాత కంది మీదుగా ఐఐటీ వరకు 100 ఫీట్ల రోడ్డుగా చూపడంతో ఈ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలను అనుమతులు దొరకడం లేదు. ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూడా తొలగిస్తారేమోనన్న భయాంధోళనతో కల్వకుంట, గొల్లగూడెం వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ రోడ్లను 60 ఫీట్ల రోడ్డుగానే మాస్టర్‌ప్లాన్‌లో చూపాలని కోరుతూ హెచ్‌ఎండీఏకు లేఖలు రాసినా స్పందన రావడం లేదని పట్టణవాసులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రులు చొరవ చూపి మాస్టర్‌ప్లాన్ మార్చేందుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.