PODU LANDS: పోడు రీ సర్వే!
ABN , First Publish Date - 2023-01-09T02:45:48+05:30 IST
రాష్ట్రంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడంలేదు.
చేయాల్సిందేనంటున్న ఆదివాసీ, గిరిజన సంఘాలు
పలు జిల్లాల్లో వేల దరఖాస్తుల తిరస్కరణ
సర్వేలో అటవీ శాఖదే పైచేయి
ప్రేక్షక పాత్రకే పరిమితమైన గిరిజన శాఖ
గిరిజనేతరుల నుంచి లక్షకుపైగా దరఖాస్తులు
రీ సర్వేకు సంఘాలు, వామపక్షాల డిమాండ్
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించడంలేదు. హక్కు పత్రాలు ఇచ్చేందుకుగాను అర్హులను గుర్తించేందుకు సర్కారు సర్వేను చేపట్టింది. కానీ, సర్వేలో అటవీ, గిరిజన శాఖలు వ్యవహరిస్తున్న తీరుతో వేల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో తిరస్కరణకు గురైన దరఖాస్తుదారుల భూముల్లో తిరిగి మరోసారి సర్వే చేయాలనే డిమాండ్ వస్తోంది. దీనిపై సంబంధిత మంత్రిని కలిసి రీసర్వేకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాలని సీపీఎంతోపాటు గిరిజన, ఆదివాసీ సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాలకు పోడు హక్కు పత్రాల కోసం 4.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే పోడు సర్వేలో అటవీ అధికారులదే అంతిమ నిర్ణయం కావడంతో చాలా చోట్ల గిరిజన, ఆదివాసీల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ అంశంలో గిరిజన శాఖ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. మంత్రి, అధికారులు మాత్రం స్పందించడం లేదు. తిరస్కరణకు కారణమేంటన్నది అధికారులు చెప్పడంలేదు. దీంతో ఎవరి దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయో కూడా దరఖాస్తుదారులకు తెలియడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 4.13 లక్షల దరఖాస్తుల్లో గిరిజనేతరుల అప్లికేషన్లు లక్షకుపైగా ఉంటాయని అంచనా. వీటిలోనూ అనర్హత కింద మరికొన్ని తిరస్కరణకు గురవుతున్నాయి. ప్రస్తుతం ఈ సమస్య జటిలంగా మారుతుండడంతో గిరిజనులు, గిరిజనేతరులందరికీ పోడు హక్కు పత్రాలు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. పోడు భూముల సర్వేలో భూమి పచ్చగా ఉండడమే గిరిజనుల పాలిట శాపంగా మారింది.
శాటిలైట్ సర్వే సమయంలో భూములు పచ్చగా ఉండడంతో ఆ భూమి మొత్తం అటవీ శాఖకు చెందినదిగా అధికారులు నమోదుచేశారు. ఇపుడు అదే భూమిలో పోడు సాగు ఉండడంతో వాటికి హక్కు పత్రాలు ఇచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. దీంతోపాటు పలు ఇతర కారణాలతోనూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇప్పటికీ దరఖాస్తులు సబ్ డివిజనల్ స్థాయి కమిటీలోనే ఉండడంతో ఇంకా ఎన్ని రిజెక్ట్ అవుతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అటవీ, గిరిజన శాఖ వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం 4.13 లక్షల దరఖాస్తుదారుల్లో కనీసం లక్ష మందికి కూడా పోడు హక్కు పత్రాలు వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆదివాసీ, గిరిజన సంఘాలు అంటున్నాయి. శాటిలైట్ సర్వే చేసినపుడు చెట్లతోనే పచ్చగా కనిపించిన భూమిలో పంటలున్నప్పుడు ఎందుకు పచ్చగా నమోదు కాలేదని ఆయా సంఘాలు అటవీ అధికారులను ప్రశ్నిస్తున్నాయి. అయితే అటవీ శాఖ తమ భూమిని వదులుకునేందుకు ససేమిరా అనడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమానికి పిలుపునిస్తామని ఆదివాసీ, గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.