Share News

హెచ్‌సీఏ వవహారంపై కొనసాగుతున్న విచారణ

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:13 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య వివాదం సమసిపోయిందని ఇరు వర్గాలు ప్రకటించినా విజిలెన్స్‌ అధికారులు మాత్రం తమ విచారణను ఆపలేదు.

హెచ్‌సీఏ వవహారంపై కొనసాగుతున్న విచారణ

  • రెండో రోజు సోదాలు నిర్వహించిన విజిలెన్స్‌

  • జగన్మోహన్‌రావు అక్రమాలపై ఆరా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య వివాదం సమసిపోయిందని ఇరు వర్గాలు ప్రకటించినా విజిలెన్స్‌ అధికారులు మాత్రం తమ విచారణను ఆపలేదు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజిలెన్స్‌ అధికారులు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో పలు ఫైళ్లు పరిశీలించారు. ముఖ్యంగా బీసీసీఐ, హెచ్‌సీఏ, సన్‌ రైజర్స్‌ మధ్య జరిగిన ఒప్పందం వివరాలు, ఆ తర్వాత స్టేడియంలో జరిగిన అభివృద్ధి పనులు, అంతర్జాతీయ మ్యాచుల సమయంలో ఆహారం, రవాణాకు సంబంధించి ఇచ్చిన కాంట్రాక్టుల వివరాలను విజిలెన్స్‌ అధికారులు పరిశీలించారని తెలుస్తోంది.


హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చేపట్టిన పనులు, ఖర్చులను అధికారులు పరిశీలించారని సమాచారం. హైదరాబాద్‌ రూరల్‌ విభాగానికి చెందిన విజిలెన్స్‌ బృందం సభ్యులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. హెచ్‌సీఏ సిబ్బందిని విచారించి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జగన్మోహన్‌ రావు హయాంలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదులోని అంశాలను విజిలెన్స్‌ అధికారులు పరిశీలించారని తెలుస్తోంది.

Updated Date - Apr 03 , 2025 | 04:13 AM