Khammam NTR Statue: జూనియర్ ఎన్టీఆర్‌తో ఆవిష్కరించాలనుకున్నారు.. కానీ ఇంతలోనే..

ABN , First Publish Date - 2023-05-18T18:36:11+05:30 IST

తెలంగాణలోని ఖమ్మంలో ఆవిష్కరించదలచిన శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే (నిలుపుదల ఉత్తర్వులు) విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు..

Khammam NTR Statue: జూనియర్ ఎన్టీఆర్‌తో ఆవిష్కరించాలనుకున్నారు.. కానీ ఇంతలోనే..

ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మంలో (Khammam) ఆవిష్కరించదలచిన శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై (Khammam NTR Statue) తెలంగాణ హైకోర్టు స్టే (నిలుపుదల ఉత్తర్వులు) విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విగ్రహావిష్కరణ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. లకారం చెరువు మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా, హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా శ్రీకృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని శ్రీకృష్ణ జాక్, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. ఈ అంశంపై హైకోర్టులో 14 రిట్ పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు ఈ అంశంపై విచారించింది.

హైకోర్టు ఆదేశాలతో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 28న జరగాల్సిన కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నిలిచిపోనుంది. ఈ విగ్రహ ఏర్పాటుకు ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూనుకోవడం గమనార్హం. ఈ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్‌ను మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానించారు.

మే 28న ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్‌తో విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని పువ్వాడ నిర్ణయించుకున్నారు. ఈ విగ్రహావిష్కరణకు విశిష్ట అతిథిగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించేందుకు పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా జూనియర్‌ను కలిశారు. మంత్రి స్వయంగా వెళ్లి పిలవడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా విగ్రహావిష్కరణకు మే 28న ఖమ్మం పట్టణానికి వెళతారని ప్రచారం కూడా జరిగింది. తీగల వంతెన, మ్యూజికల్ ఫౌంటేన్‌తో పాటు బోటు షికారు సౌకర్యంతో ఖమ్మం వాసులను ఆకర్షిస్తున్న లకారం ట్యాంక్‌బండ్‌కు ఎన్టీఆర్ విగ్రహం అదనపు ఆకర్షణగా నిలిస్తోందని స్థానికంగా చర్చ జరిగింది. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరించతలపెట్టిన దివంగత మహా నటుడు ఎన్టీఆర్ విగ్రహం ఎత్తు 100 అడుగులు కావడం గమనార్హం. తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ విగ్రహావిష్కరణకు బ్రేక్ పడింది.

Updated Date - 2023-05-18T19:06:48+05:30 IST