TRS MLAs Poaching Case: వాదనల సమయంలో శరీరం సహకరించడం లేదన్న దవే
ABN , First Publish Date - 2023-01-10T17:46:03+05:30 IST
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ తరపు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే జ్వరంతో బాధపడుతున్నందున వాదనలు కొనసాగించేందుకు శరీరం సహకరించడం లేదన్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు(TRS MLAs poaching case) మరోసారి వాయిదా పడింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ తరపు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే జ్వరంతో బాధపడుతున్నందున వాదనలు కొనసాగించేందుకు శరీరం సహకరించడం లేదన్నారు. జ్వరం రేపటి(బుధవారం)కల్లా తగ్గకపోతే పండగ సెలవుల తర్వాత సమయం ఇవ్వాలని దవే కోరారు. దీంతో ఆయన తన వాదనలు వినిపించేందుకు హైకోర్టు ధర్మాసనం బుధవారానికి గడువిచ్చింది. ప్రభుత్వ తరపు న్యాయవాది దవే మినహా మిగిలిన ప్రతివాదుల వాదనలు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 లోపు వాదనలు పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
అంతకు ముందు వాదించిన దవే నిందితులకు పోలీసులపై నమ్మకం లేదంటున్నారని, మరి సీబీఐపై ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేంద్ర పరిధి కాబట్టి నిందితులకు సీబీఐ(CBI) మీద నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. అక్టోబర్‌న 26 క్రైమ్ జరిగిందని, నవంబర్ 3న సీఎం ప్రెస్ మీట్ జరిగిందని దవే గుర్తు చేశారు. సీఎం ప్రెస్ మీట్‌కు ముందే ఫార్మ్ హౌస్ కేస్ (Farm House Case) ఎఫ్‌ఐఆర్ నమోదైందన్నారు. సీఎం ప్రెస్‌మీట్‌కు ముందే కేస్ దర్యాప్తు ప్రాసెస్‌లో ఉందని చెప్పారు. దర్యాప్తును సీఎం ప్రెస్ మీట్ ప్రభావితం చేయలేదని దవే చెప్పారు. ట్రాప్ జరిగిన తర్వాత సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. కేసు నమోదైన రోజు నుంచి నేటి వరకు అన్ని ఆటంకాలే ఎదురువుతున్నాయన్నారు. మొదట ట్రయల్ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్‌కు నిరాకరించిందని, 41 సి.ఆర్.పి.సి జారీతో నిందితులు కోర్టుకు వచ్చారని దవే చెప్పారు. సింగిల్ బెంచ్ కేవలం రెండు జడ్జిమెంట్‌లను పరిగణలోకి తీసుకుని తీర్పు ఇవ్వడం కరెక్ట్ కాదని దవే వాదించారు. విచారణ అధికారిపై అనుమానాలు ఉంటే సరిపోదని, దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలన్నారు. వాటితో కోర్టును ఒప్పించే విధంగా ఉండాలని చెప్పారు. అంతే తప్ప విచారణ అధికారి మొరాలిటీ దెబ్బతీసే విధంగా ఉండొద్దని దవే వాదించారు. కేవలం రెండు జడ్జ్ మెంట్‌లను పరిగణలోకి తీసుకుని పోలీసుల దర్యాప్తు ను తప్పుబట్టారని దవే వాదించారు.
ఫిర్యాదుదారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (Rohith Reddy) తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావ్ తన వాదనలు వినిపిస్తూ సీఎం ప్రెస్ మీట్‌లో రోహిత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రికి సీడీలు రోహిత్ రెడ్డియే ఇచ్చారని, ఆ విషయాలనే సీఎం పబ్లిక్‌లో చెప్పారని వాదించారు. లీకేజీ విషయంపై బీజేపీ కోర్ట్ దృష్టికి తెచ్చిందని, కానీ ఈ విషయంపై కోర్ట్ నుంచి ఎలాంటి నోటీస్ సర్వ్ కాలేదని వాదించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదని, కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చి ఉంటే, ముఖ్యమంత్రికి ఆడియో సీడీలు ఎలా వెళ్లాయో చెప్పేవాళ్ళమన్నారు. అయితే సింగిల్ జడ్జ్ తమకు ఆ అవకాశం ఇవ్వలేదని గండ్ర మోహన్ రావ్ వాదించారు. సీబీఐ కేంద్ర ఆధీనంలో పని చేస్తుందని, నిందితులకు దర్యాప్తు సంస్థను ఎంచుకునే అధికారం ఉందా అని ప్రశ్నించారు. సీబీఐకి ఇస్తే ఫిర్యాదుదారుడిని వేధించరని గ్యారెంటీ ఏంటని, నిందితులకు ఎలా హక్కులు ఉన్నాయో, ఫిర్యాదు దారుడికి కూడా హక్కులు ఉన్నాయని గండ్ర మోహన్ రావ్ వాదించారు.
ఈ కేసులో ఇటీవలే హైకోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది. 26 కేసుల జడ్జిమెంట్లను కోట్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కేసు సీబీఐకి (CBI) ఇవ్వడానికి 45 అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) ప్రెస్‌మీట్‌ను కూడా హైకోర్టు ఆర్డర్‌లో చేర్చింది. సిట్ ఉనికిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేశారని హైకోర్టు మండిపడింది. కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం కేసీఆర్‌కు చేరవేతపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ దర్యాప్తు సక్రమంగా జరిగినట్లు అనిపించట్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సిట్ చేసిన దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం ఎఫ్‌ఐఆర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేసింది.
మరోవైపు ఈ కేసులో బీఎల్ సంతోష్ (BL Santhosh), తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజక్ట్ చేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. సిట్ రివిజన్ పిటిషన్‌ను కొట్టేయడంతో ఈ కేసులో కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చినట్లైంది.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో తమను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక) ఇటీవల ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీంతో ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా సిట్ ఏర్పాటైంది. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్ సభ్యులుగా ఎంపిక చేశారు.