విషం చిమ్ముతున్న గవర్నర్‌

ABN , First Publish Date - 2023-03-22T00:12:08+05:30 IST

కేంద్రం ఏజెన్సీలుగా రాజ్‌భవన్‌, గవర్నర్‌ వ్యవస్థ పని చేస్తున్నాయని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ధ్వజమెత్తారు. హనుమకొండలోని హరిత హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

విషం చిమ్ముతున్న గవర్నర్‌
మాట్లాడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

మంత్రి సత్యవతి రాథోడ్‌

హనుమకొండ మార్చి 21: కేంద్రం ఏజెన్సీలుగా రాజ్‌భవన్‌, గవర్నర్‌ వ్యవస్థ పని చేస్తున్నాయని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ధ్వజమెత్తారు. హనుమకొండలోని హరిత హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

రాజ్‌భవన్‌లో సోమవారం జరిగిన ఉగాది ఉత్సవాల్లో యువకుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో యువత అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని గవర్నర్‌ తమిళసై వాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష ఉద్యోగాల హామీని దాటి రెండు లక్షల 30వేల ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీమేరకు ఎనిమిదేళ్లలో 16కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, 16 ఉద్యోగాలు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. కేంద్రం నిర్ణయాలతో రాష్ట్రంలోని యువతకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను పొగుడుతున్న గవర్నర్‌ తమిళసై.. మరో వైపు విషయం చిమ్ముతోందని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. తెలంగాణ ప్రతినిధిగా విభజన హామీ ఎందుకు నెరవేర్చడం లేదని కేంద్రాన్ని గవర్నర్‌ ఎందుకు అడగడం లేదని ఆమె ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,గిరిజన యూనివర్సిటీ, కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మోసం చేసింది కేంద్రం కాదా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే.. గవర్నర్‌ ఎందుకు స్పందించడం లేదన్నారు.

గవర్నర్‌ వ్యవస్థకు కళంకం తెచ్చే విధంగా తమిళిసై వ్యవహరిస్తున్నారని ఆమె దుయ్యపట్టారు. కేంద్రప్రభుత్వ వైఖరితో నష్టపోతున్న యువత పక్షాన నిలబడాలని, కేంద్రప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలని కోరుతూ మంత్రి సత్యవతి రాథోడ్‌ గవర్నర్‌కు ఈ సందర్భంగా లేఖ రాశారు. కేంద్రాన్ని ప్రశ్నించే రాజకీయ పార్టీలపై ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేవలం అభియోగాలపై బీఆర్‌ఎస్‌ నేత ఎమ్మెల్సీ కవితను విచారించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కుడా మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-22T00:12:08+05:30 IST