కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

ABN , First Publish Date - 2023-04-25T00:07:35+05:30 IST

తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనమైందని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం
హసన్‌పర్తి మండలం బావుపేట వద్ద పాదయాత్రలో భాగంగా అభివాదం చేస్తున్న భట్టి

అప్పుల ఊబిలోకి నెట్టేశారు

లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం

సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క

నగరంలోకి ప్రవేశించిన ‘పీపుల్స్‌మార్చ్‌’ పాదయాత్ర

హనుమకొండ సిటీ, ఏప్రిల్‌ 24 : తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనమైందని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. తెలంగాణతో తమ బతుకులు బాగుపడతాయని భావించిన ప్రజల ఆశలను కేసీఆర్‌ ఆడియాసలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్‌ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపుని చ్చారు. ‘పీపుల్స్‌మార్చ్‌’ పేరిట భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సోమవారం హనుమకొండ జిల్లాలో జరిగింది. ఈ క్రమంలో హసన్‌పర్తి బస్టాండ్‌ జంక్షన్‌లో కార్నర్‌ మీటింగ్‌లో భట్టి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై విరచుకుపడ్డారు. యావత్‌ తెలంగాణ సమాజ కలలను కేసీఆర్‌ కల్లలు చేశాడన్నారు. దుర్మార్గపు పాలనతో ప్రజలు వంచనకు గురయ్యారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల బతుకుల్లో వెలుగులు నిండుతాయనే భావన ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్ర సంపదంతా కేసీఆర్‌ కుటుంబమే దోచుకుం టోందని ఆరోపించారు. దోపిడే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన సాగుతుందన్నారు. కేసీఆర్‌ దోపిడీ వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోకి దిగిందన్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చును భరిస్తామంటూ కేసీఆర్‌ వ్యాఖ్యలు చేయడమే ఆయన దోపిడీకి నిదర్శనమన్నారు. ఎన్నికల వ్యయాన్ని భరించే డబ్బు కేసీఆర్‌కు ఎక్కడిదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజలు దీనిని గుర్తించాలన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన పంటను యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసి రైతులను నష్టపరిహారం చెల్లించాలన్నారు.

కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే ధరణిని ప్రవేశపెట్టారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ పేరిట భూములను దొరలకు కట్టబె ట్టే పన్నాగం పన్నారన్నారు. కాంగ్రెస్‌ హ యంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను కేసీఆర్‌ సర్కారు వెనక్కి తీసుకోవడం శోఛనీయమన్నారు. మూడెకరాలు పంపిణీ చేస్తామన్న కేసీఆర్‌ గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లాక్కో వడం సిగ్గుచేటన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీలతో విద్యార్థుల జీ వితాలతో కేసీఆర్‌ చెలగాటమడుతున్నారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

గెలిపిస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యమే..

కేసీఆర్‌ దోపిడీ పాలన అంతం కావాలంటే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని భట్టి విక్రమార్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500లకే అందచేస్తామన్నారు. నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని, నిరుద్యోగ భృతి అందచేస్తామనే తదితర హామీలను విక్రమార్క ప్రకటించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికా రం లోకి రాగానే అదానీ, కేసీఆర్‌ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. ఆ సంపదనంతా ప్రజలకు చెందెలా చర్యలు చేపడ తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంచార్జి శోభారాణి, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నమిండ్ల శ్రీనివాస్‌, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, సీనియర్‌ నాయకుడు వరద రాజేశ్వరరావు పాల్గొన్నారు.

పలకరిస్తూ.. పరామర్శిస్తూ..

ఉత్సాహంగా భట్టి రెండో రోజు పాదయాత్ర

హనుమకొండ సిటీ, ఏప్రిల్‌ 24 : సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్‌మార్చ్‌పేరుతో చేపట్టిన పాదయాత్ర హనుమకొండ జిల్లాలో సోమవారం రెండవ రోజు ప్రశాంతంగా సాగింది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భట్టి వెంట పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క కమలాపూర్‌లో ఉదయం 9.30 గంటలకు తన పాదయాత్రను మొదలు పెట్టారు. పాదయాత్ర సందర్భంగా విక్రమార్క మార్గమధ్యలో పలు చోట్ల ఆగారు. రైతులను పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వివిధ రకాల వృత్తులవారిని సైతం పలకరించారు. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, సమస్యలన్నీ తీరుతాయని వారికి భరో సా ఇచ్చారు. పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భట్టి విక్రమార్క ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు కలిసి నడిచారు. సోమవారం ఎండ తీవ్రత లేకపోవడంతో పెద్దగా ఇబ్బంది కలుగలేదు.

కమలాపూర్‌ మండలంలో కానిపర్తి, శంభునిపల్లి గ్రామాల మధ్య రైతులను కలుసుకున్నారు. రెండు రోజుల క్రితం అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఎంత నష్టం జరిగిందని అడిగారు. శంభునిపల్లికి చెందిన కటుకూరి తిరుపతి రెడ్డికి చెందిన ధాన్యాన్ని కుప్పనూర్పారు. కానిపర్తి దగ్గర గీతకార్మికుడు స్వామిగౌడ్‌ భట్టి విక్రమార్కకు తాటి ముంజలను ఇచ్చారు. ఇందుకు ప్రతిగా విక్రమార్క ఆయనను శాలువకప్పి సత్కరించారు. కానిపర్తి, శంభునిపల్లి మీదుగా ఎల్కతుర్తి మండలంలోని గుంటూరుపల్లికి చేరుకున్నారు. అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

అనంతరం అక్కడి నుంచి ఆరెపెల్లి, బావుపేటకు చేరుకున్నారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 5.20 గంటలకు తిరిగి తన పాదయాత్రను మొదలు పెట్టారు. బావుపేట నుంచి హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌కు చేరుకోగానే అక్కడ కాంగ్రెస్‌ నేతలు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్‌ నాయకులు వరద రాజేశ్వర్‌ రావు, నమిండ్ల శ్రీనివాస్‌ తదితరులు స్వాగతం పలికారు. క్రేన్‌ సహాయంతో భారీ గజమాలను వేసి ఘనంగా సత్కరించారు. మహిళలు నృత్యాలు చేస్తుండగా డప్పు చప్పుళ్లు, బాణా సంచ పేలుళ్ల మధ్య భట్టి తన పాదయాత్రను కొనసాగించారు.

భట్టి ఎల్లాపూర్‌ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎల్లాపూర్‌ బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో పాదయాత్రకు దారిచ్చేందుకు పోలీసులు వాహనాలను దూరంగా నిలిపివేశారు. పాదయాత్ర బ్రిడ్జి దాటే వరకు సుమారు 45 నిముషాలు ట్రాఫిక్‌ స్తంభించింది. ఎల్లాపూర్‌ నుంచి హసన్‌పర్తి మండలంలోని హసన్‌పర్తి గ్రామ బస్టాండ్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ ప్రజలను ఉద్దేశించి కొద్ది సేపు మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలను సంధించారు. అనంతరం భీమారం చేరుకొని అక్కడ కాంగ్రెస్‌ నాయకుడు పెద్ది వెంకటయ్య ఇంట్లో రాత్రి బస చేశారు.

Updated Date - 2023-04-25T00:07:35+05:30 IST