Share News

Allahabad High Court: అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:41 AM

బాలిక ఛాతీపై చేయి వేసి, పైజామా తాడును లాగడాన్ని రేప్‌ కిందికి రాదంటూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు దీనిపై సుమోటోగా విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ చర్య తీసుకుంది.

 Allahabad High Court: అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ

బాలిక పైజామా తాడు లాగడం, ఛాతీపై చేయివేయడం రేప్‌ కాదన్న నిర్ణయంపై అభ్యంతరాలు

న్యూఢిల్లీ, మార్చి 25: బాలిక ఛాతీపై చేయి వేసి వక్షోజాలను లాగడం, ఆమె ధరించిన పైజామా తాడును లాగి తెంపివేయడం రేప్‌ కిందికి రాదంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై సుమోటోగా విచారణ జరపనున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఇలాంటి చర్యలు అత్యాచారం కిందికి రావని, కానీ అత్యాచారయత్నంగా పరిగణించవచ్చని పేర్కొంటూ హైకోర్టు ఈ నెల 17న తీర్పు ఇచ్చింది. బలప్రయోగం చేసి వస్త్రాలను లాగడం, నగ్నంగా ఉండాలంటూ బెదిరించడం అన్న నేరాల కిందకు వస్తుందని తెలిపింది. అందువల్ల ఐపీసీలోని సెక్షన్‌ 354(బీ) కింద కేసు నమోదు చేస్తే సరిపోతుందని, రేప్‌కు వర్తించే సెక్షన్లు అవసరం లేదని తెలిపింది. ఈ తీర్పుపై విమర్శలు రావడంతో సుమోటోగా విచారణ జరపాలని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఆగస్టైన్‌ జార్జి మాసిహ్‌ ధర్మాసనం నిర్ణయించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా దాన్ని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ ప్రసన్న బి వరాలే ధర్మాసనం తిరస్కరించడం గమనార్హం. 2021 జనవరి పదో తేదీన పవన్‌, ఆకాశ్‌ 14ఏళ్ల బాలికను ఓ కల్వర్టు కిందకు లాకెళ్లారు. పవన్‌ ఆమె ఛాతీభాగంపై చేయివేయగా, ఆకాశ్‌ ఆమె పైజామా తాడును లాగాడు. అప్పుడే ఎవరో రావడం చూసి వారు పారిపోయారు. ఈ కేసులో పోలీసులు నిందితులపై సెక్షన్‌ 376 (రేప్‌), పోక్సో చట్టంలోని సెక్షన్‌ 18 కింద కేసు పెట్టారు. అయితే, తాము చేసిన నేరాన్ని బట్టి చూస్తే ఇవి కఠిన శిక్షలు పడే సెక్షన్లు కావడంతో వాటిని తగ్గించాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్‌ రామ్‌ వాని వాదనతో ఏకీభవించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:41 AM