వీవోఏల వెట్టి చాకిరి

ABN , First Publish Date - 2023-05-13T01:08:31+05:30 IST

గ్రామాల్లో మహిళలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఆర్థిక బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్న ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లో గ్రామైక్య సంఘాల సహాయకు(వీవోఏ)లు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలీచాలనీ వేతనాలతో 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తూ మహిళల ఆర్థిక ఎదుగు దలకు కృషి చేస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీవోఏ)లు మాత్రం ఆర్థికంగా చితికిపోతున్నారు.

వీవోఏల వెట్టి చాకిరి
మహబూబాబాద్‌ సమ్మెలో ఒంటికాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న వీవోఏలు

మహిళా సంఘాల అభివృద్ధిలో కీలకం

ఉద్యోగ భద్రత కోసం నిరవధిక సమ్మె

14,694 మహిళా సంఘాలకు.. 682 మంది వీవోఏలు

జిల్లా వ్యాప్తంగా 26 రోజులుగా ఆందోళనలు

మహబూబాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో మహిళలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఆర్థిక బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్న ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)లో గ్రామైక్య సంఘాల సహాయకు(వీవోఏ)లు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలీచాలనీ వేతనాలతో 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తూ మహిళల ఆర్థిక ఎదుగు దలకు కృషి చేస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీవోఏ)లు మాత్రం ఆర్థికంగా చితికిపోతున్నారు. 2004లో గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యుల తీర్మానంతో వీవోఏలుగా ఎంపిక చేయబడి విధులు నిర్వర్తిస్తున్నారు. పల్లెల్లో 10 నుంచి 15 మంది సభ్యులతో ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇలా ఒక్కొక్క గ్రామంలో 20 నుంచి 30 మహిళా సంఘాలకు ఒక వీవోఏ ఉంటారు.

జిల్లాలో 14694 సంఘాలు.. 682 మంది వీవోఏలు..

జిల్లా పరిధిలో 461 జీపీల్లో 14,694 మహిళా సంఘాలు ఉండగా అందులో 1.52 లక్షల మంది మహిళ సభ్యులు ఉన్నారు. ఆయా గ్రూపుల నిర్వహణ, సభ్యుల ఆర్థిక బలోపేతానికి జిల్లాలో 682 మంది వీవోఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నెలకు వీరికి గౌరవ వేతనం కింద రూ.3900 చెల్లిస్తున్నారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రెగ్యులరైజ్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌తో గత ఏప్రిల్‌ 17న విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ ఆఫీసుల ఎదుట వినూత్న రీతిలో గత 26 రోజులుగా ఆందోళనలు చేస్తూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. అయినప్పటికి పరిష్కారానికి నోచుకోకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నారు. తాజాగా శుక్రవారం పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా సీఎం కేసీఆర్‌కు తమ సమస్యలను పరిష్కరించా లని ఉత్తరాలను పంపించారు. తమ న్యాయమైన డిమాండ్లను తెలంగాణ సర్కార్‌ నెరవేర్చేంత వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

వీవోఏల విధులు ఇవే...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీవోఏలు కీలకపాత్ర పోషిస్తున్నారు. బతుకమ్మ చీరెల పంపిణీ, ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రజలకు అవగాహాన కల్పిస్తూ తడి.. పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు అవగాహన, హరితహారం కార్యక్రమంలో పాల్గొంటూనే మరోవైపు గ్రామాల్లో ఓటుహక్కు నమోదు, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం, దివ్యాంగులను గుర్తించి సదరం క్యాంపులకు పంపించడం, రైతు, దివ్యాంగులు, పశుమిత్ర సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క గ్రామాల్లోని నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం, ప్రతి నెల మహిళా సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం, కొత్త రుణాలను మంజూరు చేయించడం లాంటి పనులు నిర్వహిస్తూ గ్రామాల్లో ముఖ్యభూమికను పోషిస్తున్నారు.

డిమాండ్‌లు ఇవే...

ఐకేపీ వీవోఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెను కొనసాగిస్తున్నారు. వీవోఏల జీవితాలకు భద్రతనిచ్చేందుకు సాధారణ బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. సెర్ప్‌ నుంచి గుర్తింపు కార్డులు ఇస్తూ గ్రామసంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెల వేతనాలను తమ బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీవోఏలతో ఆన్‌లైన్‌ పనులు చేయించవద్దని, మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణం, అభయహస్తం డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. స్వయం సహాయ సంఘాలు, గ్రామైక్య సంఘాల ప్రత్యక్ష ప్రసార సమావేశాలను రద్దు చేయాలని, అర్హులైన వీవోఏలను వెలుగు సీసీలుగా పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి : నీలం కృష్ణవేణి, సంఘం మండల అధ్యక్షురాలు, కంబాలపల్లి

ఐకేపీ వీవోఏలుగా 20 ఏళ్లు గా విధులు నిర్వర్తిస్తున్నాం. నేటి వరకు ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు. గ్రామాల్లో మహిళ సంఘాలను ఏర్పాటుచేసి వారి ఆర్థికాభివృద్ధి కోసం పాటుపడుతున్న తమకు ప్ర భుత్వం స్పందించి రెగ్యులరైజ్‌ చేసి తమ కుటుం బాలను ఆదుకోవాలి. పెరిగిన ధరలకనుగుణంగా నెలకు రూ.26 వేల వేతనాన్ని అందించాలి.

సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలి : పురుషోత్తం, వీవోఏల జిల్లా కో కన్వీనర్‌, గూడూరు

గ్రామీణా పేదరిక నిర్మూలన సంస్థలో వీవోఏలుగా విధులు ని ర్వర్తిస్తున్న తమను సెర్ప్‌ ఉద్యో గులుగా గుర్తించాలి. వీవోఏలపై పనిభారం తగ్గించడంతో పాటు ఆన్‌లైన్‌ జూమ్‌ మీటింగ్‌లను రద్దు చేయాలి. ప్రతి వీవోఏలకు ఉ ద్యోగ భద్రత కల్పించాలి.

Updated Date - 2023-05-13T01:08:31+05:30 IST