Share News

పోలవరానికి 12,157 కోట్లివ్వండి

ABN , Publish Date - Jul 23 , 2024 | 02:52 AM

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను రాష్ట్ర జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అభ్యర్థించారు.

పోలవరానికి 12,157 కోట్లివ్వండి

కేంద్రానికి మంత్రి నిమ్మల వినతి.. జలశక్తి మంత్రి పాటిల్‌తో ఢిల్లీలో భేటీ

కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి కొత్త టెండరుకు వెళ్లాలా..?

పాత ఏజెన్సీతోనే కట్టించాలా?.. స్పష్టత కోరిన జలవనరుల మంత్రి

పోలవరం సందర్శించాలని పాటిల్‌కు ఆహ్వానం.. నిమ్మల వెంట రామ్మోహన్‌, వర్మ

అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను రాష్ట్ర జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అభ్యర్థించారు. సోమవారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావులతో పాటు పాటిల్‌ను కలిశారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం నిర్ణయించినందున.. గతంలో వాల్‌ను నిర్మించిన కాంట్రాక్టు ఏజెన్సీతో దానిని నిర్మించాలా.. లేక మళ్లీ టెండర్లు పిలిచి కొత్త ఏజెన్సీకి బాధ్యత అప్పగించాలా అనే విషయంలో వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన భూసేకరణ కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటగా రూ.12,157.53 కోట్లు మంజూరు చేస్తే అందులో రూ.8 వేల కోట్లను తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాసం అందజేస్తామని తెలిపారు. ఈ జాతీయ ప్రాజెక్టును కేంద్రం తరఫున రాష్ట్రం నిర్మిస్తోందని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూ నిర్వాసితులు కూడా ప్రధానమని.. వరదలు వచ్చిన ప్రతిసారీ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఈ ముంపు సమస్యను పరిష్కరించాలంటే నిర్వాసితులకు పరిహారం చెల్లించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు మున్ముందు కూడా సహకరించాలని కోరారు. పోలవరం సందర్శనకు రావాలని పాటిల్‌ను రామానాయుడు ఆహ్వానించారు.

ఐదేళ్లలో 63 వేల కోట్లిచ్చాం

కేంద్ర సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.63 వేల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన స్పందిస్తూ.. కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిధులను విడుదల చేస్తుందని, అయితే మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆయా పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు నిధులను కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులను వినియోగించినట్లు యూసీలు పంపాకే తదుపరి వాయిదా నిధులు అందుతాయని చెప్పారు. జగన్‌ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి.. నిర్దిష్ట సమాచారం అందితే కేంద్రం పరిశీలిస్తుందన్నారు.

పోలవరానికి నిధులు విడుదల చేయండి

లోక్‌సభలో కేంద్రానికి ఎంపీ కేశినేని చిన్ని వినతి

న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): లక్షలాది మంది రైతులకు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని)విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్‌కు ప్రాణాధారమన్నారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు మిషన్‌ మోడ్‌ కింద పోలవరాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో రూల్‌ 377 కింద ఈ ప్రాజెక్టుపై మాట్లాడారు. పోలవరం నిర్మాణం పూర్తయితే ఆరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని.. గత ఐదేళ్లలో సివిల్‌ పనులు 3.84 శాతం, భూసేకరణ పనులు 3.89 శాతమే జరిగాయని తెలిపారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయంలో ఈ ప్రాజెక్టు సివిల్‌ పనులు 71.93 శాతం, భూసేకరణ, సహాయ పునరావాసం 18.66 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవరం డే గా ప్రకటించి.. సమీక్ష చేస్తున్నారని వివరించారు.

Updated Date - Jul 23 , 2024 | 02:53 AM