Share News

ఓట్ల పండక్కి 43 లక్షల మంది దూరం!

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:55 AM

ఓటు హక్కు లేకుంటే జనాభా లెక్కల్లో లేనట్లేనని భావిస్తారు. ఓటు.. మనిషి అస్తిత్వానికి ప్రతీక. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికీ చదువు, ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ఓటు హక్కు కల్పించింది.

ఓట్ల పండక్కి 43 లక్షల మంది దూరం!

రాష్ట్రవ్యాప్తంగా ఓటు లేని అభాగ్యులు

గుంటూరు జిల్లాలోనే 3.5 లక్షల మంది

వారిలో సంచారజాతులు, నిరాశ్రయులు

వలస కార్మికులు, భిక్షాటన చేసేవారు

ఆధార్‌ కార్డు కూడా లేని పరిస్థితి

ఇంతవరకూ ఓటేయలేదు

నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటు వేయలేకపోయా. ప్రకాశం జిల్లా నుంచి 40 సంవత్సరాల క్రితం గుంటూరు నగరానికి వచ్చాను. ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఓటు కోసం కొంతమంది అధికారులను కలిసినా ఆధార్‌ కార్డు లేకపోవడంతో ఓటు హక్కు కల్పించడం వీలుకాదని చెప్పారు. దీంతో ఓటు వేయాలనే కోరిక కలగానే మిగిలిపోయింది. - దానాపాల్‌

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

ఓటు హక్కు లేకుంటే జనాభా లెక్కల్లో లేనట్లేనని భావిస్తారు. ఓటు.. మనిషి అస్తిత్వానికి ప్రతీక. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికీ చదువు, ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ఓటు హక్కు కల్పించింది. ఐదేళ్లకోసారి నేతల తలరాతను మార్చేది ఓటే. అలాంటిది.. రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మందికి ఓటు హక్కు లేదట! వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే! 2021-22 గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఓటు హక్కు లేనివారి సంఖ్య 43 లక్షలుగా ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. సంచార జాతులవారు, వలస కార్మికులు, భిక్షాటన చేసేవారు, నిరాశ్రయులు ఓట్ల పండుగకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఓ చోట స్థానికంగా నివాసం ఉండకపోవడం, వెనుకబాటుతనం, చైతన్యవంతుల్ని చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం చూపడం.. కారణం ఏదైనా ఓటు హక్కుకు నోచుకోని అభాగ్యులు ఇప్పటికీ లక్షలాది మంది ఉండటం ఎంతో విచారకరం. రాష్ట్రంలో రానున్న ఎన్నికల రోజును ఓటర్లంతా ఓట్ల పండుగగా జరుపుకోవాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ప్రజలను చైతన్య పరిచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు చేస్తున్న కృషి ఈ అభాగ్యులదాకా వెళ్లడం లేదు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఎన్నికలకు దూరంగానే ఉంటున్నారు.


గుంటూరు జిల్లాలో 3.50 లక్షలు

2022-23 వలస కార్మికుల గణాంకాల ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్షా 50 వేల మంది వరకు వలస వచ్చారు. వారి పిల్లలు దాదాపు 15,000 మంది బడికి వెళ్తుండగా, మరో 40,000 మంది బడికి దూరంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వీరుకాకుండా సంచార జాతులవారు, బిక్షాటన చేసేవారు, నిరాశ్రయులు మరో 2 లక్షల మంది వరకు జిల్లాలో ఉన్నారు. వారికి ఆధార్‌ కార్డులు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. ఆధార్‌ అనుసంధానం అయిన తరువాత వారంతా ఓటు హక్కుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గుంటూరు నగరంతో పాటు మాచర్ల, మేడికొండూరు, గురజాలలో సంచార జాతుల ప్రజలు నివసిస్తుంటారు. సంఘం నాయకుల ద్వారా ఆధార్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జారీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపడంతో వారు ఓట్లకు దూరమయ్యారు. మరికొందరికి సరైన వివరాలు, ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేకపోవటంతో ఆధార్‌ కార్డు కూడా పొందలేకపోయారు.


ఒకసారి ఓటు వేసినట్టు గుర్తు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో పుట్టాను. 27 ఏళ్లు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత పనిపై మాచర్ల, గురజాల ప్రాంతంలో కొంతకాలం నివాసం ఉన్నాను. ఇప్పుడు గుంటూరులోనే ఉంటున్నాను. ఊరు వదిలే ముందు ఒకసారి ఓటు వేసినట్టు గుర్తు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఓటును వినియోగించుకోలేకపోయాను. ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

- గుడిపాటి సుబ్బారావు


ఓటు లేదని డబ్బులు ఇవ్వలేదు

మాది గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కాటూరి గ్రామం. 30 ఏళ్ల కిందటే గుంటూరు వచ్చాను. ఆధార్‌ కార్డు రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఓటు వేశాను. అయితే ఈ మధ్య ఆధార్‌ కార్డులో తేడా వచ్చిందని.. ఓటరు కార్డు ఇవ్వలేదు. మా గ్రామానికి చెందిన కొంతమంది ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఓటుకు డబ్బు ఇవ్వబోయి.. ఓటు లేదని తెలుసుకొని డబ్బులు ఇవ్వలేదు.

- కాటూరి గోవిందమ్మ


మందుబాబులకు ఎన్నికష్టాలో

అసలే ఎన్నికల రోజులు. ప్రచారానికి వెళ్లే జనం జేబుల్లో కాసిని డబ్బులు కనిపించే కాలం. అలాంటి రోజుల్లో చుక్క గొంతులో పడకపోతే ఎట్లా? ఇప్పుడు రాష్ట్రంలోని మందుబాబులకు ఈ సమస్యే వచ్చిపడింది. మద్యం షాపులకు కోటాను నిర్ధేశించడంతో ఒకరికి ఒక్క సీసానే అమ్ముతున్నారు. ఆ సీసా కోసం భారీ క్యూలు ఉంటున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మూడు మద్యం షాపుల వద్ద బుధవారం మందుబాబులు బారులుతీరారు. దీనికితోడు వైసీపీ అభ్యర్థి మేకపాటి నామినేషన్‌ వేస్తుండటంతో మందుబాబులు దుకాణాల వద్ద.. రోడ్డుపై వరకూ క్యూ కట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపే మూడు షాపులను మూసివేశారు. దీంతో మందుబాబులు నిరాశతో వెనుతిరిగారు.

- ఉదయగిరి రూరల్‌

Updated Date - Apr 25 , 2024 | 05:55 AM