పెళ్లైన 2 వారాలకే దారుణం.. ప్రియుడి కోసం భర్త దారుణ హత్య
ABN , Publish Date - Mar 25 , 2025 | 09:55 AM
తల్లిదండ్రుల బలవంతం మీద ప్రేమించిన వాడిని కాదని మరో వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ.. వివాహం అయిన రెండు వారాలకే భర్తను హత్య చేయించింది.

ఉత్తరప్రదేశ్: సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీస్తున్నారు. ఇక ప్రేమ పేరిట జరుగుతున్న దారుణాలకైతే లెక్కే లేదు. విచిత్రంగా పెళ్లైన వారు సైతం.. ప్రేమించిన వారి కోసం కట్టుకున్న వారిని, కన్న వారిని ఆఖరికి కడుపున పుట్టిన వారి కూడా కడదేరుస్తున్నారు. ఆడవారు సైతం ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. తాజాగా ఈ కోవకు చెందిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల బలవంతం మీద ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ మహిళ.. ప్రేమికుడితో కలిసి ఉండటం కోసం కట్టుకున్న వాడిని హత్య చేయించింది. అది కూడా పెళ్లైన రెండు వారాలకే. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, ఔరయ్య జిల్లాకు చెందిన ప్రగతి యాదవ్ (22) అనే మహిళ.. అదే ప్రాంతానికి చెందిన అనురాగ యాదవ్‌ని ప్రేమించిది. గత నాలుగేళ్లుగా వీరు రిలేషన్‌లో ఉన్నారు. అయితే ప్రగతి తల్లిదండ్రులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలియడంతో.. 20 రోజుల క్రితం అనగా మార్చి 5, 2025న దిలిప్ అనే వ్యక్తికి ఇచ్చి బలవంతంగా ఆమెకు వివాహం జరిపించారు.
పెళ్లైన రెండు వారాల తర్వాత అనగా మార్చి 19న దిలిప్ బులెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అతడిని స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే దిలిప్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. ముందుగా సైఫై ఆస్పత్రికి తరలించి.. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కి తీసుకెళ్లారు. అతడి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. తిరిగి ఔరయ్య జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. మార్చి 20న దిలిప్ చనిపోయాడు.
ఈ క్రమంలో దిలిప్ సోదరుడు.. సహార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిలిప్‌తో పెళ్లైన తర్వాత.. ప్రగతి యాదవ్, తన ప్రియుడు అనురాగ్‌ని కలుసుకుంది. తామిద్దరూ కలిసి బతకాలంటే దిలిప్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. దాంతో కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరీ అనే వ్యక్తిని కలిసి.. దిలిప్‌ను చంపాల్సిందిగా కోరారు. ఇందుకోసం అతడికి 2 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. కాంట్రాక్ట్ తీసుకున్న రామాజీ, మరి కొందరితో కలిసి మార్చి 19న దిలిప్‌ను మాటల్లో పెట్టి పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడిపై కాల్పులు జరిపారు. వెంటనే రామాజీ, అతడితో పాటు వెళ్లిన వారు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి.. వారిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల దగ్గర నుంచి రెండు పిస్తోల్లు, ఒక బైక్, ఫోన్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రగతి యాదవ్, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
అది కోబ్రా అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. ఎలా పట్టుకున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..
బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ