Share News

జగన్‌ రక్షణకు 986 మంది!

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:54 AM

గత ఐదేళ్ల పాలనలో సీఎం హోదాలో జగన్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏవీ లేవు. మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు ఏదీ లేదు.

జగన్‌ రక్షణకు 986 మంది!

సీఎం హోదాలో అసాధారణ భద్రత

దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని వైనం

తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరీ ఏర్పాట్లు

భూమి, నీరు, ఆకాశంలో పోరాడేలా శిక్షణ

ఎన్‌ఎ్‌సజీ తరహాలో యూనిఫామ్‌

అత్యాధునిక ఆయుధాలు, భద్రత ఏర్పాట్లు

తాడేపల్లి ప్యాలె్‌సకు సుశిక్షితులతో రక్షణ

మాజీ అయినా ఇంకా అదే భద్రత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ఐదేళ్ల పాలనలో సీఎం హోదాలో జగన్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏవీ లేవు. మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు ఏదీ లేదు. అయినా సరే... జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం 986 మంది పోలీసులను మోహరించారు. చంద్రబాబుకు ‘ఎన్‌ఎ్‌సజీ’ భద్రత ఉండటంతో... ఆయనకు పోటీగా జగన్‌ ఎస్‌ఎ్‌సజీ (స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ )ను ఏర్పాటు చేసుకున్నారు. సముద్ర జలాలు, ఆకాశం, భూమిపై పోరాడేలా శిక్షణ ఇప్పించారు. ఇజ్రాయెల్‌ ఆయుధాలు తెప్పించారు. జగన్‌ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడేలా 379 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్‌ఎ్‌సజీ తరహాలో యూనిఫామ్‌ (డార్క్‌ బ్లూ, బ్లాక్‌) ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో పోలీసు శాఖలో నవ్వులపాలైంది. శత్రుదేశాలు, ఉగ్రవాదులతో ముప్పు ఉండేప్రధాన మంత్రికి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) రక్షణ కల్పిస్తుంది. మావోయిస్టులు, సంఘ విద్రోహశక్తుల జాబితాలో ఉండే యోగి ఆదిత్యనాథ్‌ లాంటి ముఖ్యమంత్రులు, రాజ్‌నాథ్‌, అమిత్‌ షా లాంటి కేంద్ర మంత్రులు, ఇతర వీఐపీలకు ఎన్‌ఎ్‌సజీ, సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పిస్తున్నాయి. దేశంలో అతికొద్ది మంది రాజకీయ ప్రముఖులకే సాయుధ కమెండోలైన ఎన్‌ఎ్‌సజీతో కేంద్ర హోంశాఖ రక్షణ కల్పిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుపై అలిపిరి (తిరుపతి) వద్ద నక్సలైట్లు దాడి చేశారు.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఎన్‌ఎ్‌సజీ కమెండోలతో సెక్యూరిటీ కల్పించింది. అయితే వారి భద్రతకు మించి జగన్‌ అసాధారణ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పోలీసులు ఆయన సెక్యూరిటీపై సమీక్షించి 300 మంది ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులతో జడ్‌ ప్లస్‌ రక్షణ ఏర్పాట్లు చేశారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. దీంతో ఎన్‌ఎ్‌సజీ ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. తనకూ అటువంటి సెక్యూరిటీ గార్డులు కావాలని జగన్‌ పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో కేంద్రానికి రాష్ట్ర హోంశాఖ లేఖ రాసినా అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే తనకన్నా చంద్రబాబు సెక్యూరిటీ ఎక్కువగా కనిపించడానికి వీల్లేదని జగన్‌ చెప్పడంతో మరో మార్గంలేక రాష్ట్ర పోలీసులు ఎన్‌ఎ్‌సజీ తరహాలో ఎస్‌ఎస్‌జీ ఏర్పాటు చేశారు. ఎన్‌ఎ్‌సజీ తరహాలో యూనిఫామ్‌ సిద్ధం చేసి, కమాండ్‌ హబ్‌, జాగిలాల శిక్షణా కేంద్రం, మొబైల్‌ ఫోర్స్‌, ఎస్‌కే9 లాంటివన్నీ ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది.


ప్యాలె్‌సలతో పాటు దేశ, విదేశాల్లోనూ...

తాడేపల్లితో పాటు హైదరాబాద్‌, బెంగళూరులో కళ్లు చెదిరే ప్యాలె్‌సలు నిర్మించుకున్న జగన్‌ దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనంత సెక్యూరిటీ నియమించుకున్నారు. తనతో పాటు తన ప్యాలె్‌సలకు, తన కుటుంబ సభ్యులకు, విదేశాల్లోని కుమార్తెలకు సైతం భద్రత ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 986 మందితో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ వద్ద అత్యధికంగా 379 మందిని షిఫ్టుల వారీగా విధుల్లో నియమించుకున్నారు. జగన్‌ జిల్లాల పర్యటనకు వెళ్లినపుడు భారీగా భద్రతా సిబ్బంది వెంట ఉండేవారు. ఇతర విభాగాల నుంచి 439 మంది, అలైడ్‌ డ్యూటీల కోసం 116 మంది సిబ్బంది ఉన్నారు. పులివెందులలోని నివాసం, ఇడుపులపాయలోని ప్యాలెస్‌, హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ భవంతికి 52 మంది పోలీసులను కాపలాగా పెట్టారు. తాడేపల్లి ప్యాలె్‌సకు అసాధారణ రీతిలో 48 చోట్ల చెక్‌పోస్టులు, బ్యారికేడ్లు, అవుట్‌ పోస్టులు, పోలీసు పికెట్లు, బూమ్‌ బారియర్లు, టైర్‌ కిల్లర్స్‌, బొల్లార్డ్స్‌, రిట్రాక్టబుల్‌ గేట్లతో పాటు 30 అడుగుల ఎత్తున పటిష్ఠ ఇనుప గోడ నిర్మించుకున్నారు. కౌంటింగ్‌కు ముందు కుటుంబంతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు కేవలం సెక్యూరిటీ ఖర్చుగా ప్రభుత్వం ఖజానా నుంచి కోటిన్నర విడుదల చేశారు.

మాజీ సీఎం అయినా భద్రత తగ్గదా?

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ ఆర్నెల్ల క్రితం ఏర్పాటు చేసుకున్న భద్రత చూసి కింది స్థాయి పోలీసులే నవ్వుకున్నారు. ‘గతంలో చంద్రబాబు హయాంలో శేషాచలం కొండల్లో ఎర్ర చందనం స్మగ్లర్లను.. విశాఖ మన్యంలో మావోయిస్టులను పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్‌ చేశారు. అయినా ఆయనకు 108 మందితోనే సెక్యూరిటీ ఉండేది. జగన్‌ హయాంలో కనీసం ఒక రౌడీషీటర్‌పై కూడా చర్యలు తీసుకున్నది లేదు. కానీ అసాధారణ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అది కేవలం ఇగో కోసమే’ అనే వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో వినిపించాయి.

జగన్‌ సేవలో... ప్రాక్సిమిటీ సెక్యూరిటీ

అనధికార వ్యక్తులు, వాహనాలు సమీప ప్రాంతానికి రాకుండా అడ్డుకునే సుశిక్షితులైన సాయుధ సిబ్బంది ఇందులో ఉంటారు. దాడులు, ఉల్లంఘనలు, అతిక్రమణలను అడ్డుకుంటారు. ప్రపంచ, జాతీయ స్థాయిలో పేరున్న వీవీఐపీలకు మాత్రమే ఇటువంటి భద్రత ఉంటుంది. యాక్సెస్‌ నియంత్రణ వ్యవస్థలు, ఫెన్సింగ్‌తో కూడిన గేట్లు, బొల్లార్డ్స్‌తో కెమెరాలు, అలారం వ్యవస్థలు, మోషన్‌ డిటెక్టర్లు, పీఐడీఎస్‌, సురక్షిత తలుపులు, పటిష్ఠమైన ప్రవేశ ద్వారాలు, గార్డ్‌ పెట్రోలింగ్‌ వంటివి ఉంటాయి. ఒక ప్రాంతాన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని శత్రుదుర్భేద్యంగా మార్చే వ్యవస్థ ఇది.

బూమ్‌ బారియర్స్‌

టోల్‌ గేట్ల వద్ద వాహనాలను ఆటోమేటిక్‌గా ఆపి స్కాన్‌ అవగానే పైకి లేచే గేట్లనే బూమ్‌ బారియర్లు అంటారు. బటన్‌ సిస్టమ్‌తో పాటు రిమోట్‌ కంట్రోల్‌ పద్ధతిలో పనిచేస్తాయి. అటువంటి వాటినే జగన్‌ ప్యా లె్‌సకు వెళ్లే మార్గాల్లో పోలీసులు ఏర్పాటు చేశారు.

టైర్‌ కిల్లర్స్‌

సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, పార్లమెంటు లాంటి చోట్ల వీటిని వాడతారు. అనధికార వాహనాలు అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకొస్తే నిరోధించే క్రమంలో టైర్‌ కిల్లర్స్‌ను ఏర్పాటు చేస్తారు. జగన్‌ ప్యాలె స్‌కు వెళ్లే దారిలో ఇవి అమర్చారు.

Updated Date - Jun 25 , 2024 | 03:59 AM