Share News

పరీక్షలకు వెళ్తే పీల్చిపిప్పి..!

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:22 PM

జిల్లాలో వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో వ్యాపారం జరుగుతోంది. సాధారణ జ్వరం బారిన పడి ఏ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లినా, అస్వస్థతకు గురై డాక్టర్‌ను సంప్రదించినా ముందుగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు (డయోగ్నోస్టిక్‌ సెంటర్‌లు) పంపించడం ఆనవాయితీగా మారింది. దీనిని ఆసరా చేసుకుని ఆయా సెంటర్ల నిర్వాహకులు దండిగా సొమ్ము చేసుకుంటున్నారు.

పరీక్షలకు వెళ్తే పీల్చిపిప్పి..!

వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో నిలువు దోపిడీ

అడ్డగోలుగా ఫీజులు

వైద్యం కన్నా వీటికే ఎక్కువ ఖర్చు

పూర్తిస్థాయి రక్తపరీక్షలకు రూ.25వేలు చెల్లించాల్సిందే!

బెంబేలెత్తిపోతున్న రోగులు

జిల్లాలోని వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వైద్య పరీక్షలకు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులంతా సిండికేట్‌గా మారి మేమింతే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వైద్యులు, పీఎంపీలు, ఆర్‌ఎంపీలకు భారీ మొత్తంలో కమీషన్‌లు ఆశ చూపడంతో వారు అవసరం లేని పరీక్షలు కూడా చేయించుకోవాలని రోగులకు సూచించి సదరు ల్యాబ్‌లకు పంపుతున్నారు. అక్కడికి వెళ్లిన వారిని నిర్వాహకులు పిండేస్తున్నారు. ఇక కార్పొరేట్‌ వైద్యశాలల్లో అయితే సరేసరి. దీంతో రోగం బారిన పడిన వారు వ్యాధి నిర్ధారణ పరీక్షల భారం తలుచుకుని భయపడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఒంగోలు కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో వ్యాపారం జరుగుతోంది. సాధారణ జ్వరం బారిన పడి ఏ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లినా, అస్వస్థతకు గురై డాక్టర్‌ను సంప్రదించినా ముందుగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు (డయోగ్నోస్టిక్‌ సెంటర్‌లు) పంపించడం ఆనవాయితీగా మారింది. దీనిని ఆసరా చేసుకుని ఆయా సెంటర్ల నిర్వాహకులు దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వీరి దోపిడీ మరింత ఎక్కువైంది.

కొన్నింటికే అనుమతి..

రక్తపరీక్షల ల్యాబ్‌లు, సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌.. ఇలా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలు (డయోగ్నోస్టిక్‌ సెంటర్‌లు) జిల్లాలో 300కుపైగా ఉన్నాయి. అందులో ఒంగోలులోనే 150కి పైన నడుస్తున్నాయి. మొత్తం సెంటర్‌లలో కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. వాటితోపాటు ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో దానికి అనుసంధానంగా ల్యాబ్‌ ఉంది. బయట డయోగ్నస్నిక్‌ సెంటర్‌ల నిర్వాహకులంతా సిండికేట్‌గా మారి ఒకేరకమైన ఫీజులు వసూలు చేస్తుండగా ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న ల్యాబ్‌లలో మాత్రం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. వారు చెప్పిందే ఫీజు, వారి ఇచ్చిందే రిపోర్టు అవుతోంది. దీంతో ప్రజలు తనకు వచ్చిన రోగం కంటే అక్కడ పరీక్షలకు అయ్యే ఖర్చులను తలుచుకుని మరింత ఆందోళన చెందుతున్నారు.


అమలు కాని నిబంధనలు

జిల్లాలోని అనేక ల్యాబ్‌లలో ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్నపాటి ల్యాబ్‌ ఏర్పాటు చేయాలన్నా కనీసం ఎంబీబీఎస్‌ అర్హత గల వైద్యుడి పర్యవేక్షణ ఉండాలి. పెద్దపెద్దస్థాయి వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో అయితే పెథాలజిస్ట్‌, రేడియాలజిస్ట్‌, మైక్రో బయాలాజిస్ట్‌ తదితర అర్హత కలిగిన వారు ఉండాలి. వీరికి సహాయకులుగా ల్యాబ్‌ టెక్నీషియన్‌లు వ్యవహరిస్తారు. డిప్లమో, డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారిని సిబ్బందిగా నియమించాలి. కానీ అనేక డయోగ్నస్టిక్‌ సెంటర్‌లలో ఈ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ల్యాబ్‌లలో అయితే అక్కడి వైద్యుడి పేరుతో ఇతర వ్యక్తులు నడుపుతున్నారు. ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తులు ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

వైద్యులకు భారీగా కమీషన్లు

జిల్లాలో పలువురు వైద్యులు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో వ్యాధి నిర్ధారణ కేంద్రాల నిర్వాహకులు లోపయికారీ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. భారీ మొత్తంలో కమీషన్‌లు ఆశ చూపుతున్నారు. కొందరు పరీక్షలకు వసూలు చేస్తున్న మొత్తంలో 50శాతం నుంచి 60శాతం వరకూ కమీషన్‌ చెల్లిస్తున్నారు. దీంతో వైద్యులు రోగులకు అవసరం లేని పరీక్షలు కూడా రాస్తున్నారు. ల్యాబ్‌ల నిర్వాహకులు భారీ మొత్తంలో గుంజుతున్నారు. మరోవైపు కొన్ని డయోగ్నస్టిక్‌ సెంటర్‌ల నిర్వాహకులు ప్యాకేజీల పేరుతో రోగులను మభ్యపెట్టి సాధారణ రక్తపరీక్షలకు కూడా వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారికి కూడా మామూళ్లు ముడుతుండటంతో మొక్కుబడి తనిఖీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 06 , 2025 | 11:22 PM