Share News

ప్రాణం తీసిన భూ తగాదా

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:17 PM

భూ తగాదాల కారణంగా అన్నపై తమ్ముడు కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అన్న చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పెదబయలు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రాణం తీసిన భూ తగాదా
కిల్లో సూరిబాబు మృతదేహం

అన్నను కర్రతో బలంగా కొట్టిన తమ్ముడు

చికిత్స పొందుతూ మృతి

ఆలస్యంగా వెలుగులోకి..

నిందితుడి అరెస్టు

పెదబయలు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): భూ తగాదాల కారణంగా అన్నపై తమ్ముడు కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అన్న చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పెదబయలు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ కె.రమణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పెదబయలు మండలం అరడకోట పంచాయతీ పురుగుడుపుట్టు గ్రామానికి చెందిన కిల్లో సూరిబాబు(46), కిల్లో గణపతి(35) అన్నదమ్ములు. వీరి మధ్య గత ఎనిమిదేళ్లుగా భూమి విషయమై గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం స్వగ్రామంలోనే ఇద్దరూ దీనిపై చర్చించుకున్నారు. మాటామాటా పెరగడంతో తమ్ముడు గణపతి బలమైన కర్ర తీసుకొని సూరిబాబును బలంగా కొట్టాడు. ఇది గమనించిన గ్రామస్థులు అడ్డుకున్నారు. అయితే సూరిబాబుకు ఆ రోజు రాత్రి కడుపునొప్పి రావడంతో శుక్రవారం ఉదయం పెదబయలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం గ్రామానికి చేరుకున్న అతను శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లోనే నొప్పి అధికమై మృతి చెందాడు. దీనిపై మృతుడి కుమారుడు కిల్లో లోకేశ్‌ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం నిందితుడు గణపతిని అరెస్టు చేశారు. మృతదేహాన్ని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Apr 06 , 2025 | 11:17 PM