Share News

Amaravathi: నేడు అమరావతికి చెన్నై ఐఐటీ నిపుణుల బృందం..

ABN , Publish Date - Aug 03 , 2024 | 09:30 AM

నేడు రాజధాని అమరావతిలో చెన్నై ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది. సచివాలయం హెచ్ఓడి టవర్ల ప్రాంతంలో రాఫ్ట్ ఫౌండేషన్‌ను అమరావతి బృందం పరిశీలించనుంది.

Amaravathi: నేడు అమరావతికి చెన్నై ఐఐటీ నిపుణుల బృందం..

అమరావతి: నేడు రాజధాని అమరావతిలో చెన్నై ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది. సచివాలయం హెచ్ఓడి టవర్ల ప్రాంతంలో రాఫ్ట్ ఫౌండేషన్‌ను అమరావతి బృందం పరిశీలించనుంది. మధ్యాహ్నం హైకోర్టు భవన నిర్మాణ ప్రాంతాన్ని చెన్నై ఐఐటి బృందం పరిశీలించనుంది. గడిచిన ఐదేళ్లుగా రాఫ్ట్ ఫౌండేషన్ నీళ్లలోనే నానుతోంది. ఆయా నిర్మాణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్మాణాల కొనసాగింపుపై నివేదికను చెన్నై ఐఐటి బృందం ఇవ్వనుంది. ఇప్పటికే రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను హైదరాబాద్ ఐఐటి బృందం పరిశీలించనుంది. అమరావతి నిర్మాణాలు అన్నీ కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని అనేదే లేకుండా చేశారు.


గతంలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్ధ్యతను ఇంజనీర్లు అధ్యయనం చేయనున్నారు. సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలన్నీ ఫౌండేషన్ దశలోనే నిలిచిపోయాయి. ఇప్పుడు వాటన్నింటినీ ఐఐటీ చెన్నై నిపుణులు పరిశీలించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలించనున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు కొన్ని ప్రారంభ దశలోనే ఉండగా.. కొన్ని ఫౌండేషన్ పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలకు సంబంధించి పునాదుల సామర్ధ్యాన్ని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఐఐటీ మద్రాస్‌కు అప్పగించారు.


ఇక ఐఏఎస్‌ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్‌ ఐఐటీకి అప్పగించింది. వీరు రెండు రోజుల పాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. మొత్తానికి నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చకచకా సాగేందుకు సర్వం సిద్ధమవుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రాజధాని పరిధిలో ‘నవ నగరాల’ నిర్మాణం జరగనుంది. సీఆర్డీయే పరిధిని యథాతథంగా కొనసాగించాలని కొత్త సర్కారు నిర్ణయించింది.

Updated Date - Aug 03 , 2024 | 09:30 AM