Share News

AP EX CM Jagan : అబద్ధాల్లో తగ్గేదేలే

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:14 AM

విద్యార్థులకు ఫీజుల చెల్లింపు విషయంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ ఎలాంటి అబద్ధాలు చెప్పారో, ఇప్పుడు కూడా అచ్చం అవే చెబుతున్నారు. తన హయాంలో ఫీజులు పెండింగ్‌ పెట్టిన విషయాన్ని అంగీకరించకుండా మొత్తం ఇచ్చేసినట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారు.

AP EX CM Jagan : అబద్ధాల్లో తగ్గేదేలే

  • ఫీజులపై జగన్‌ పచ్చి అబద్ధాలు

  • 2023-24లో మూడు క్వార్టర్లు పెండింగ్‌

  • ఒక్క క్వార్టరే బకాయి అని అసత్యాలు

  • క్వార్టర్‌ ముగిసిన వెంటనే విడుదల చేశారట

  • అలాగైతే తల్లిదండ్రులు ఎందుకు కట్టారు?

  • ఒక్కసారీ సకాలంలో విడుదలకాని ఫీజులు

  • బకాయిల కారణంగానే సర్టిఫికెట్ల నిలిపివేత

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఫీజుల చెల్లింపు విషయంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ ఎలాంటి అబద్ధాలు చెప్పారో, ఇప్పుడు కూడా అచ్చం అవే చెబుతున్నారు. తన హయాంలో ఫీజులు పెండింగ్‌ పెట్టిన విషయాన్ని అంగీకరించకుండా మొత్తం ఇచ్చేసినట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విద్యాసంవత్సరంలో క్వార్టర్‌ ముగియగానే విద్యార్థులకు ఫీజులు విడుదల చేశానని చెప్పుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో ఓ ట్వీట్‌ చేశారు. గత ప్రభుత్వంలో ఫీజులు విడుదల కాక సొంత డబ్బులు కట్టామని విద్యార్థులు, తల్లిదండ్రులు గగ్గోలు పెడుతుంటే జగన్‌ మాత్రం తాను ఒక్క రూపాయి పెండింగ్‌ పెట్టలేదని, ఉన్న మొత్తం బకాయిలు కూటమి ప్రభుత్వానివేనని చెప్పుకొచ్చారు. అయితే, ఇక్కడే జగన్‌ అడ్డంగా దొరికిపోయారు. ఇంకా 6 నెలలు కూడా పూర్తికాని కూటమి ప్రభుత్వంలో రూ.2,800 కోట్ల మేర ఫీజుల బకాయిలు ఎలా ఏర్పడతాయనే విషయాన్ని మరిచి ఆయన వితండ వాదనకు దిగారు. ఫీజులు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు జగన్‌ వాదన విని అవాక్కవుతున్నారు. నిజంగా సకాలంలో ఫీజులు విడుదల చేసి ఉంటే సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ ఎందుకు తిరుగుతామని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి జగన్‌ హయాంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ప్రత్యక్ష నరకం చూశారు. ప్రభుత్వం- కాలేజీల మధ్య ఉండాల్సిన ఫీజుల అంశాన్ని, విద్యార్థులు-కాలేజీల మధ్యకు మార్చి కాలేజీ యాజమాన్యాలు వారికి నచ్చినట్లుగా ఫీజులు వసూలు చేసుకునే పరిస్థితి కల్పించారు. ఫీజుల విడుదల అంశం కాలేజీకి సంబంధం లేకపోవడంతో యాజమాన్యాలు కోర్సులో చేరే సమయంలోనే సగం ఫీజులు కట్టించుకున్నాయి.


పోనీ క్వార్టర్‌ పూర్తవగానే ప్రభుత్వం ఫీజులు విడుదల చేసిందా? అంటే అదీ లేదు. ప్రతి సంవత్సరం కనీసం రెండు, మూడు క్వార్టర్ల ఫీజులు పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. ఒక్క సంవత్సరం కూడా విద్యార్థులు కోర్సు పూర్తిచేసుకుని బయటకు వెళ్లే సమయానికి వారి ఫీజులు వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయలేదు. దీంతో చివరి ఏడాది ఫీజులు కట్టలేదనే కారణంతో గత మూడు నాలుగేళ్లుగా విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ వివాదంగా మారింది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు మీరు తీసుకుని.. మాకు మాత్రం ముందు ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాలని కాలేజీల యాజయాన్యాలు తెగేసి చెప్పాయి. దీంతో వేరే దారిలేక అప్పులు చేసి సొంతంగా తల్లిదండ్రులు ఫీజులు కట్టారు. ఆ పరిస్థితి లేనివారు ప్రభుత్వంపై భారంవేసి ఫీజులు విడుదలయ్యే వరకు సర్టిఫికెట్లను కాలేజీల్లోనే ఉంచారు. నిజంగా జగన్‌ చెప్పినట్లు 2023-24 విద్యా సంవత్సరం ఫీజులు సకాలంలో విడుదలచేసి ఉంటే గతేడాది కోర్సులు పూర్తిచేసిన వారు ఇప్పటికీ సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది కాదు.


  • లాజిక్‌ లేని లెక్క

వైసీపీ హయాంలో 13 విడతల్లో ఫీజులు విడుదల చేసినట్లు జగన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికి నాలుగు విడతలుగా ఫీజులు విడుదల చేయాలి. అంటే ఐదేళ్లలో 20 విడతలు ఇవ్వాలి. తొలి విడత ఒకేసారి రూ.4,208 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. వాటిలో అంతకుముందు ప్రభుత్వం పెట్టిన బకాయిలున్నాయని జగనే అప్పట్లో ప్రచారం చేసుకున్నారు. పోనీ వాటిలో బకాయిలు పోగా 17 విడతలే విడుదల చేసినట్లు అవుతుంది. ఇంకా 3 విడతల ఫీజులు పెండింగ్‌ అని ఇక్కడే అర్థమవుతుంది. ఒక విడతకు సగటున రూ.700 కోట్లు చెల్లించాలి. అంటే 20 విడతలకు రూ.14వేల కోట్లు విడుదల చేయాలి. కానీ, వైసీపీ హయాంలో రూ.12,609 కోట్లు విడుదల చేసినట్లు జగనే చెబుతున్నారు. ఈ కోణంలో చూసినా దాదాపు 3 క్వార్టర్ల ఫీజులు పెండింగ్‌ పెట్టారని అర్థమవుతోంది. అలాగే ఇప్పటి వరకు రూ.2,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో క్వార్టర్‌కు సగటున రూ.700 కోట్లు చొప్పున అనుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు రూ.1,400 కోట్లు బకాయిలు ఉండాలి. మరి దానికి రెట్టింపు స్థాయిలో రూ.2800 కోట్లు ఎలా ఏర్పడతాయి? అనే లాజిక్‌ను మర్చిపోయి జగన్‌ లెక్కలు చెప్పారు.


  • ఎన్నికల స్టంట్‌

ఎన్నికల సమయంలో ఓ క్వార్టర్‌ నిధులు ఇవ్వకుండా కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయని, అది తప్ప మొత్తం ఇచ్చేసినట్లుగా జగన్‌ ఎక్స్‌లో చెప్పుకొచ్చారు. నిజంగా కూటమి పార్టీల కారణంగానే ఫీజులు ఆగిపోయాయి అనుకుంటే పోలింగ్‌ అనంతరం మొత్తం బకాయిలు విడుదల చేసి ఉండాల్సింది. కానీ, పోలింగ్‌ పూర్తవగానే దాని గురించి కనీసం పట్టించుకోలేదు. కాగా, ఎన్నికల కోడ్‌ రాకముందు 2023-24లో మొదటి క్వార్టర్‌ ఫీజుల విడుదలకు ఈ ఏడాది మార్చి 1న సీఎం బటన్‌ నొక్కారు. కానీ, మే నెల వచ్చినా వాటిని తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేయలేదు. అప్పట్లో జగన్‌ బటన్‌ నొక్కడమే ఆలస్యం అనుకుంటే, బటన్‌ నొక్కినా ఆ తర్వాత చాలాకాలం వరకు డబ్బులు ఖాతాల్లో పడలేదు.


  • పీజీకి రద్దు ప్రస్తావనేది?

తన హయాంలో ఫీజుల విడుదలపై వ్యాఖ్యానించిన జగన్‌ పీజీ కోర్సులకు ఫీజులు రద్దుచేసిన విషయాన్ని ప్రస్తావించలేదు. వైసీపీ అధికారంలోకి రాకముందు అన్ని రకాల ఉన్నత విద్య కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండేది. 2020లో జగన్‌ ప్రభుత్వం పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా రద్దుచేసింది. ప్రైవే టు కాలేజీలు పీజీ విద్య పేరుతో అక్రమాలు చేస్తున్నాయని అప్పట్లో విచారణ కూడా చేపట్టింది. కానీ ఆ విచారణను ఎటూ తేల్చకుండానే పీజీ కోర్సులకు ఈ పథకాన్ని రద్దుచేసింది. విచారణ అనంతరం పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినా.. చేయలేదు. ఫలితంగా వేల మంది పేద విద్యార్థులు పీజీకి దూరమయ్యారు. పైగా అంతకముందు అక్రమాల పేరుతో కాలేజీలకు ఇవ్వాల్సిన రూ.450 కోట్ల ఫీజులను నిలిపివేశారు.

Updated Date - Nov 25 , 2024 | 03:14 AM