Collectors Conference: మారిపోయారు సార్..
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:32 AM
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు మొహమాటాలను పక్కనబెట్టి, స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తూ, అసంబద్ధ ప్రతిపాదనలను తిరస్కరించి, కేవలం మాటలతో మభ్యపెట్టలేరని అధికారులకు స్పష్టం చేశారు.

చంద్రబాబు తీరుపై కలెక్టర్లు, అధికారులు షాక్
వారి పనితీరుపై సూటిగా.. ఘాటుగా సీఎం వ్యాఖ్యలు
తనను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం
పనికిమాలిన ప్రజెంటేషన్లు వద్దని హెచ్చరిక
వారి పెర్ఫార్మెన్స్, ఫలితాలు ముఖ్యమని స్పష్టీకరణ
గతంలో లేని విధంగా వాడీవేడిగా కలెక్టర్ల సదస్సు
ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో గతానికి భిన్నంగా సూటిగా, స్పష్టంగా వ్యవహరించారు. మొహమాటాలకు పోకుండా... నిష్కర్షగా తాను చెప్పాలనుకున్నది చెప్పారు. అధికారులు చేసిన కొన్ని అసంబద్ధ ప్రతిపాదనలను అప్పటికప్పుడే తోసిపుచ్చారు. అందుకు కారణాలనూ వివరించారు. ‘ఫలితం’ ముఖ్యమని... మాటలు వద్దని నేరుగా హోంమంత్రి అనితకు కూడా చెప్పారు. విజ్ఞాన ప్రదర్శన చేయొద్దని కొందరు అధికారులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. పని చేయకుండా, ఫలితాలు సాధించకుండా... కేవలం మెచ్చుకోలు మాటలతో మభ్యపెట్టలేరని సంకేతాలు పంపారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సీఎం చంద్రబాబు అంటే అధికారులకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన వారెవరినీ పల్లెత్తు మాటనరు. ఎన్ని తప్పులు చేసినా గట్టిగా మందలించరు. దీంతో ఆయన్ను ఆకట్టుకుంటే చాలు.. ఇంకెవరికీ భయపడాల్సిన పనిలేదని కొందరు అధికారులు భావిస్తుంటారు. ఆయన దృష్టిలో పడి మార్కులు కొట్టేయాలని తెగ ఆరాటపడుతుంటారు. కొందరు సీనియర్ అధికారులైతే.. ఆయనకు మేమెంత చెబితే అంతే. మా మాటను కాదనరన్న ధీమా ఉంటుంది. అయితే మంగళ, బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల సదస్సు.. అదంతా గతమని తేల్చేసింది. ఈ రెండ్రోజుల్లో చంద్రబాబు తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. పనిచేయని.. ఫలితాలు చూపని అధికారులపై మాటల తూటాలు పేల్చారు. తన సహజ వైఖరికి భిన్నంగా.. తన మార్కు సుదీర్ఘ ప్రసంగాలు, చర్చలను పక్కనపెట్టి సుత్తిలేకుండా సూటిగా, కటువుగా వ్యవహరించారు. అధికారులతో పాటు మంత్రులకూ షాకులిచ్చారు. ఈయన మన చంద్రబాబేనా..? ఇలా మందలిస్తున్నారేంటి..? ఇన్ని ప్రశ్నలు వేసి నిలదీస్తున్నారేంటి.. ఇంత కటువుగా మాట్లాడుతున్నారేంటని అధికారులు విస్మయానికి లోనయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రలో ఐదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు.. ఏనాడూ ఆయన ఒక్క అధికారిని కూడా ఇబ్బందిపెట్టేలా మాట్లాడలేదు. వారితో కొన్ని వేల సమావేశాలు నిర్వహించి ఉంటారు. ఎప్పుడూ సుతిమెత్తగానైనా మందలించేవారు కాదు.
మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు వచ్చినా ఆగ్రహించేవారు కాదు. అయితే ఇప్పుడాయన ‘రివర్స్’ అయ్యారు. కలెక్టర్ల సదస్సులో సీనియర్ అధికారులు, కలెక్టర్లు ఏం చెబుతున్నారో.. ఎలాంటి ప్రతిపాదనలు తన ముందు పెట్టి చర్చించదలిచారో.. శాఖలు, జిల్లాల ప్రజెంటేషన్లలో పేర్కొన్న అంశాలపై ఆయన ముందుగానే లోతైన అధ్యయనం చేశారు. గతంలో సీనియర్ అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చినా వెంటనే నమ్మి.. దానినే ఆచరించాలని మిగతా వారికి చెప్పేవారు. దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. తామేది చెప్పినా చంద్రబాబు వింటారని.. ఏమాత్రం ఆలోచించకుండా ఆచరణలోకి తీసుకొస్తారన్న ధీమా వారిలో కలిగేలా ఆయన వ్యవహార శైలి ఉండేది. ఇప్పుడు ఇలాంటి వాటికి ఆయన స్వస్తిపలికారని అధికారులే చెబుతున్నారు. జిల్లాల్లో అమలు చేయకుండా తనకు ఊరకే సోది చెబితే అంగీకరించేది లేదని ఆయన కలెక్టర్లకు తేల్చిచెప్పారు. ‘ఏం చేశారో అది మాత్రమే ప్రజెంటేషన్ లో ఉండాలి. నాకు థియరీ క్లాసులు ఇస్తున్నారా’ అని మందలించారు.
అయినా కొందరు ఆయన మాటల్లోని తీవ్రతను, ఆలోచనను అర్థం చేసుకోకుండా.. వెంట తెచ్చుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను అక్షరం పొల్లుపోకుండా చదవడం మొదలుపెట్టడంతో ఆయన మరింత అసహనానికి గురై స్వరం పెంచారు. ‘ఇప్పటిదాకా జిల్లాల్లో ఏం చేశారో.. ఏం చేయబోతున్నారో వివరించండి. అంతేతప్ప కథలు, కహానీలు చెప్పొద్దు. నా వద్ద విజ్ఞాన ప్రదర్శనలు వద్దు’ అని గట్టిగానే హెచ్చరించారు. అధికారులు ప్రజల నుంచి నేర్చుకుంటేనే నిజమైన ఫలితాలు సాధించగలరని చెప్పారు. ఇందుకోసం ఏప్రిల్ నుంచి అధికారులు విధిగా గ్రామాలకు తరలివెళ్లాలని, ఒకరోజు అక్కడే మకాం వేసి అధ్యయనం చేయాలని ఆదేశించారు. మంత్రులను కూడా ఆయన వదల్లేదు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై చర్చ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివా్‌సకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. శ్రీకాకుళం అభివృద్ధి, సమస్యల గురించి మంత్రి ప్రస్తావించారు. కొన్ని సమస్యలను ఏకరువుపెట్టారు. అంతే.. సీఎం సీరియ్‌సగా స్పందించారు. జిల్లా స్థాయిలో చర్చించి అక్కడే నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సిన అంశాలను ఇంతకాలం ఎందుకు చర్చచేయలేదు.. ఇక్కడిదాకా ఎందుకు తీసుకొచ్చారని ఆయన్ను ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..