Share News

Water Distribution: ఇతర బేసిన్‌లకు ఏపీ తరలించే నీరెంత?

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:47 AM

ఇతర బేసిన్‌లకు ఏపీ ఎంత నీరు తరలిస్తోందని కృష్ణా ట్రైబ్యునల్‌-2 చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ప్రశ్నించారు.

Water Distribution: ఇతర బేసిన్‌లకు ఏపీ తరలించే నీరెంత?

  • కృష్ణా ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ ప్రశ్న

  • 312 టీఎంసీలను తరలిస్తోందన్న తెలంగాణ

  • తదుపరి విచారణ ఏప్రిల్‌ 15కు వాయిదా

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఇతర బేసిన్‌లకు ఏపీ ఎంత నీరు తరలిస్తోందని కృష్ణా ట్రైబ్యునల్‌-2 చైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ప్రశ్నించారు. బుధవారం న్యూఢిల్లీలోని ట్రైబ్యునల్‌లో కృష్ణా జలాల పంపిణీపై స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌ (ఎస్‌వోసీ) ప్రకారం తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తుండగా...చైర్మన్‌ ఈమేరకు ఆరా తీశారు. ఏపీ 312 టీఎంసీల నీటిని ఇతర బేసిన్‌లకు తరలిస్తుండగా... 189 టీఎంసీలు మాత్రమే కృష్ణా బేసిన్‌ లో వినియోగిస్తున్నట్టు వైద్యనాథన్‌ వివరించారు. కృష్ణా డెల్టాకు పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని తరలిస్తున్నారని, దాంతో మిగిలే కృష్ణా జలాలను తెలంగాణకు కేటాయించాలని కోరారు. కృష్ణా డెల్టాకు ఇప్పటికే 43.2 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా... పోలవరం ద్వారా 80 టీఎంసీలను కృష్ణాడెల్టాకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని, 2015లో పట్టి సీమ ఎత్తిపోతల పథకం ద్వారా 100 టీఎంసీలను తరలించారని గుర్తు చేశారు. కృష్ణా బేసిన్‌లో 2023-24లో తీవ్ర లోటు ఉండగా 125 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించారని తెలిపారు.


నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు వీలుగా 150 టీఎంసీలతో శ్రీశైలం లెఫ్ట్‌బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) చేపట్టి, నీటి కేటాయింపులు చేయాలని బచావత్‌ ట్రైబ్యునల్‌(కృష్ణా ట్రైబ్యునల్‌-1)ను తెలంగాణ కోరిందని వివరించారు. బేసిన్‌ లోపలి ప్రాజెక్టులకుకాకుండా బేసిన్‌ వెలుపలి ప్రాజెక్టులకే నీటి కేటాయింపులను ఏపీ కోరుతోందన్నారు. బేసిన్‌ లోపలి ప్రాంతాలకు నీటిని అందించడానికి ఎస్‌ఎల్‌బీసీని ప్రతిపాదించగా...ఇతర బేసిన్‌లకు నీటిని తరలించేందుకు శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఆర్‌బీసీ)ను ఏపీ చేపట్టిందన్నారు. నికర జలాలను ఎస్‌ఆర్‌బీసీకి కే టాయించి, వరద జలాలను మాత్రం ఎస్‌ఎల్‌బీసీకి కేటాయించారని తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్‌-2 ముందు కూడా ఎస్‌ఆర్‌బీసీకి నికర జలాలను కోరకుండా... ఇతర బేసిన్‌లోని తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని కేటాయించాలని ఏపీ కోరిందని చెప్పారు. మరోవైపు ట్రైబ్యునల్‌లో తెలంగాణ తదుపరి వాదనలు ఏప్రిల్‌ 15 నుంచి 17వ తేదీ వరకు వినిపించనున్నారు.

Updated Date - Mar 27 , 2025 | 04:47 AM