Share News

CM Chandrababu Naidu: ఏం చేసారు.. ఏం చేస్తారు?

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:50 AM

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అధికారులను కఠినంగా ప్రశ్నించారు. సిద్ధాంతాలకన్నా, ఆచరణలో ఫలితాలపై దృష్టి పెట్టాలని, విజ్ఞాన ప్రదర్శనలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu: ఏం చేసారు.. ఏం చేస్తారు?
CM Chandrababu Naidu

మీ కథలు, మీ భావాలతో పనిలేదు

40 ఏళ్లపాటు ఉపన్యాసాలు విన్నాను. నేను కూడా ప్రసంగాలు చేస్తాను. కోనసీమను సినిమాల్లో చాలా సార్లు చూశాను. కానీ, కోనసీమ జిల్లా ఈ రోజున చాలా వెనుకబడి ఉంది. భవిష్యత్తులో అల్లూరి జిల్లా కంటే వెనక్కు వెళ్లేలా ఉంది. అధికారులకు రోషం రావాలి. అది మీకు రావడం లేదు. మీ దగ్గర 12 శాతం వృద్ధి ఉంటే, అల్లూరి జిల్లాలో అది 21 శాతం. కలెక్టర్ల ఆలోచన, కార్యాచరణ వినూత్నంగా ఉండాలి.

- సీఎం చంద్రబాబు

మెదడుకు పదును పెట్టండి

విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు

40 ఏళ్లుగా ఉపన్యాసాలు వింటున్నా

కోనసీమ అందాలు సినిమాలో చూస్తున్నాం

కానీ... తలసరి ఆదాయంలో ఎక్కడుంది?

శ్రీకాకుళంలో మంత్రులు ఉన్నారు

కానీ, అభివృద్ధిలో జిల్లా అడుగున ఉంది

నేతలు, అధికారులు కలిసి పనిచేయాలి

కలెక్టర్ల సదస్సులో సీఎం దిశా నిర్దేశం

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ‘’మీరు కలెక్టర్ల సదస్సు కోసం సిద్ధం కాకుండా గౌరవ పౌరుల్లా వస్తున్నారు. కానీ, బాధ్యతగల పౌరులుగా అన్ని విషయాలు తెలుసుకుని రావాలి. ఐఏఎస్‌ కోసం ఎంత ప్రిపేర్‌ అయ్యారో అంతకంటే మెరుగ్గా మీ సంసిద్ధత ఉండాలి.’’ అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కాగితాలు చదవడానికి కలెక్టర్లు వస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఐపీఎ్‌సల్లో కొందరు చాలా కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారని, కొత్త యాప్స్‌ తీసుకొస్తున్నారన్నారు. కానీ, ఐఏఎ్‌సలు అలా ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం ఏశారు. ‘‘మీరు అడ్మినిస్ర్టేషన్‌ సర్వీ్‌సలో ఉన్నారు. కానీ, మెరుగ్గా పనిచేయడం లేదు. మీ నాలెడ్జ్‌ ఇక్కడ చూపిస్తున్నారు. నాకు కావాల్సింది అది కాదు. మీరు ఏమి చేశారో చెప్పండి. ఇక్కడ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. ఏం చేయబోతున్నారో చెప్పండి’’ అంటూ కలెక్టర్లకు చంద్రబాబు క్లాసు తీసుకున్నారు. కలెక్టర్ల సదస్సు చివరి రోజు బుధవారం జిల్లాల వారీగా సీఎం సమీక్షలు నిర్వహించారు. ‘‘ఏప్రిల్‌ నుంచి గ్రామాలకు సీనియర్‌ అధికారులు వెళ్లి ప్రజల జీవన ప్రమాణాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. అసలు గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సదస్సు ఉద్దేశం.’’ అని చంద్రబాబు వివరించారు.

gf.gif

సిద్ధాంతాలు చెప్పొద్దు.. ఏం చేశారో చెప్పండి

వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో డ్రోన్ల వినియోగంపై కర్నూల్‌ కలెక్టర్‌ రంజిత్‌ భాషా చెప్తుండగా, ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. ఇక్కడ సిద్ధాంతాలు చెప్పొద్దు. ప్రాక్టికల్‌గా ఏం చేశారో చెప్పండి అని సూటిగా అడిగారు. ‘‘డ్రోన్ల వినియోగం గురించి చెప్పి ఏడాది కావొస్తోంది. ఒక్కరు కూడా చెప్పింది చేయకపోతే ఎలా ? మీరు రాజకీయనాయకుల కంటే మెరుగైన ఐఏఎస్‌ అనే స్థాయిలో ఉన్నారు. మీరు చెప్పింది చేయకపోతే ఎలా? మీ మెదడుకు పదును పెట్టండి. నాకు కథలు, మీ భావాలు వద్దు. రొటీన్‌ మీటింగులు వద్దు. నన్ను ఇంప్రెస్‌ చేయడానికి మాట్లాడుతున్నారు తప్ప ఫలితాలు సాధించేలా మాత్రం పని చేయడం లేదు.’’ అని చంద్రబాబు అన్నారు.


జిల్లా తలసరి ఆదాయం ఎంతో తెలుసా?

‘‘మీరు ఏం చేశారో చెప్పవద్దు. మీ బెస్ట్‌ ప్రాక్టీస్‌ ఉంటే చెప్పండి. ఉపన్యాసాలు వద్దు. మీ జిల్లా తలసరి ఆదాయం ఎంత.’’ అని ఉమ్మడి గోదావరి జిల్లాల కలెక్టర్లను చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘మీ తలసరి ఆదాయం తగ్గుతోంది. మీ ఐదు జల్లాల్లో ఏలూరు బెస్ట్‌, నన్ను కన్విన్స్‌ చేయవద్దు. నా లెక్కలు నాకు ఉన్నాయి. మీ ఆలోచనలు, విధానం మారాలి. ప్రజల్లో సంతృప్తి రావాలి. మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు.? ఇక్కడకి వచ్చిన తర్వాత నేర్చుకుని వెళ్లాలి. సమస్య వాళ్లు చెబితే మంత్రులు పరిష్కారం చూపించాలి. బయో వేస్ట్‌పై ఒక్క కలెక్టర్‌ మాట్లాడలేదు.’’

ఆ అధికారికి ఇంతకుమించిన పనేముంది?

అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్‌ అధికారి గిరీష సమావేశానికి రాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇంతకంటే ముఖ్యమైన మీటింగులు ఏమున్నాయి ఆయనకు. సీఎస్‌ గారు ఆయన్ను పిలిచి మాట్లాడండి’ అని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు పనిచేసే చోట నివాసం ఉండాలని, దీన్నొక పాలసీగా తీసుకురావాలని కోరారు.

gtkh.gif

ఇష్టానుసారం విభజనతోనే జిల్లాల్లో సమస్యలు..

కొత్త జిల్లాల్లో అనేక సమస్యలు ఉన్నాయని ఉత్తరాంధ్ర జోనల్‌ ఇన్‌చార్జ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజశేఖర్‌ తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ...జిల్లాలను గతంలో ఇష్టానుసారంగా విభజించడం వల్లే సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ‘‘అన్ని జిల్లాల్లో, శాఖల్లో క్రమబద్ధీకరణ చేపట్టాలి. ఉద్యోగ ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి పాత జిల్లా హెడ్‌క్వార్టర్‌కు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఏ జిల్లా నిర్ణయాలు ఆ జిల్లాలోనే తీసుకోవాలి. పెద్ద పోస్టులు ఖాళీగా ఉంటే తర్వాతి అధికారికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పజెప్పండి.’’ అని చంద్రబాబు సూచించారు. కలెక్టర్లు వేసవిని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలపై శ్రద్ధ పెట్టాలన్నారు.


ఆరోగ్యం, ఆదాయంపై దృష్టి పెట్టండి..

‘‘మీ ధ్యాస ప్రజల ఆదాయం, ఆరోగ్యంపై నిలపండి’’ అని చంద్రబాబు నిర్దేశించారు. చిత్తూరులో 3.50 లక్షల మంది రైతులుంటే, 15 వేల మంది ఆవులు లేనివారున్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. జోనల్‌ వారీగా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణలు ఇస్తున్నామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ దగ్గర నుంచి ఉద్యోగం వరకూ 175 జాబ్‌ మేళాలు పెట్టాలని, మూడు నెలలకు ఒకసారి జాబ్‌ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. కాగా, ఫ్రూట్‌ కవర్‌ ఇవ్వడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, ఒక హెక్టార్‌కు 10 వేల కవర్లు ఇస్తున్నాని అన్నమయ్య కలెక్టరు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. రాయలసీమలో ఏఏ పంటల్లో ఇది అవసరం..ఖర్చు ఎంత అని ఆసక్తిగా ఆరా తీశారు.

ఇలా అయితే ఎలా?

నాలుగైదు జిల్లాల్లో ఉద్యానవన, పశుసంవర్ధక విభాగాలు ప్రైవేటు సంస్థలతో కలవడం, మార్కెట్‌కు అనుసంధానం చేయాల్సి ఉండగా, ఆ పనిలో పురోగతి లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఉద్యానవన శాఖ కమిషనర్‌ ఏం చేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు. అరటికి సరిగ్గా మార్కెటింగ్‌ చేయట్లేదు. ఇలా అయితే ఎలా? మీరు వేగంగా ముందుకు వెళ్లడం లేదు. అందుకే రేట్లు పడిపోతున్నాయి. స్థిరత్వం తీసుకురాలేకపోతున్నారు. కలెక్టర్లు కూడా అక్కడే విఫలమవుతున్నాయి. మార్కెట్‌ వాళ్లతో కలెక్టర్లు మాట్లాడాలి. కోల్డ్‌చైన్‌ లింక్‌ ఎంత ఉంది ? మీ దగ్గర ఏమైనా డేటా ఉందా ? రైతులు పంపిస్తున్నారు, అమ్ముతున్నారు అంతేనా ? ఉద్యానవన విభాగం ప్రొయాక్టివ్‌ కావాలి. ఉద్యానవన రంగంలో మనమే నెంబర్‌ 1. దీనిపై ప్రత్యేక హోం వర్క్‌ చేయాలి. రాష్ట్రంలో ఆక్వా రైతులకు రిజిస్ర్టేషన్‌ తప్పనిసరిగా చేయించాలి. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఆక్వాసాగుకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తాం.’’ అని చంద్రబాబు నిర్దేశించారు.

gtkh.gif

సత్యసాయి బాబా వందేళ్ల సంబరాలు చేస్తాం

సత్యసాయి, అనంతపురం, కడప, నంద్యాల, కర్నూలు జోన్‌ గురంచి సీఎం మాట్లాడుతూ..బెంగళూరు విమానాశ్రయం వల్ల సత్యసాయి, అనంతజిల్లాకు ఉపయోగకరంగా ఉందని, కియా వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని అన్నారు. ‘‘ఈ జోన్‌ లో సత్యసాయి జిల్లానే మెరుగ్గా ఉంది. రెండోస్థానంలో అనంతపురం ఉంది. సత్యసాయి, నంద్యాల మినహా మిగిలిన జిల్లాల్లో వృద్ధి బాగోలేదు. ఉద్యానవన పంటలే ఈ జిల్లాల బలం. వృద్ధికి అదే కారణం. ఈ జోన్‌లో చాలా మంచి అవకాశాలున్నాయి. సత్యసాయి బాబా 100 ఏళ్ల సంబరాలు (నూరో జయంతి) చేస్తాం. హంద్రీనీవా గేమ్‌చేంజర్‌ అవుతుంది. నంద్యాల మెడికల్‌ కాలేజీకి ఫండ్‌ టైఅప్‌ లేదు. ఆ పని పూర్తిచేసి వెంటనే ఆ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించండి. కడప ఉక్కుకర్మాగారం పనులు జిందాల్‌ కంపెనీ పూర్తి చేస్తుంది. కలెక్టర్‌ చొరవ తీసుకోవాలి.’’ అని సీఎం కోరారు.


మంత్రులు ఉన్నా ఉపయోగం లేదు..

ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో తలసరి ఆదాయంలో విశాఖ టాప్‌లో ఉన్నదని సీఎం అన్నారు. ఆరోస్థానంలో శ్రీకాకుళం ఉందని తెలిపారు.‘‘ శ్రీకాకుళంలో మంత్రులు ఉన్నా ఉపయోగం లేదు. జిల్లా అభివృద్ధి కావడం లేదు. గిరిజన ప్రాంతాల కంటే కూడా దిగువన ఉంది. అక్కడ రాజకీయనాయకులు, అధికారులు కలిసి పనిచేయాలి. ఇరిగేషన్‌లో ఉత్తరాంధ్రపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలి. విశాఖలో రతన్‌ టాటా ఇన్నొవేషన్‌ హబ్‌ ఈ నెల్లోనే ప్రారంభిస్తాం. అక్కడ ఒక పోర్టు ప్రారంభిస్తున్నాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

కుంకీ ఏనుగులు ఏవీ?

కుంకీ ఏనుగులు ఇంకా ఎందుకు రాలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటికీ ఏనుగుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. మా సొంత గ్రామంలో ఏనుగులు ఒక మనిషిని చంపేశాయి. ఎట్టిపరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం కావాలి.’’ అని స్పష్టం చేశారు. తిరుపతిలో మరికొన్ని పంచాయతీలను కలిపి మరో హబ్‌గా మార్చుతున్నామని, అనంత - హిందూపూర్‌ - కర్నూలు అభివృద్ధి చేసి అనంతపురం హబ్‌గా చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాకు ఏం చేయాలో ఆలోచించాలని కలెక్టర్లను కోరారు. ‘‘కలెక్టర్లు ఎక్కడ కూడా టవర్ల అనుమతులకు ఆలస్యం చేయకూడదు. గతంలో టవర్స్‌ పెట్టాలంటే ప్రభుత్వ భవనాలు ఇచ్చాం. టవర్స్‌ను ప్రమోట్‌ చేయాలి. ఇది అందరికీ క్లియర్‌గా చెప్తున్నాం. ’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, వాకింగ్‌ కూలర్స్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేసి రైతు బజార్‌లో పెడుతున్నామని ఉత్తరాంధ్ర జోనల్‌ ఇన్‌చార్జ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజశేఖర్‌ సీఎంకు వివరించారు.

హోటళ్లు పెంచండి..

తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిపాదించిన ముఖ్యమైన సెంటర్లల్లో ఐదు వేల రూములు, మిగిలిన నగరాల్లో 2500 హోటల్‌ రూములు ఉండాలని ఆదేశించారు. రాజమండ్రి పుష్కరాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలనీ, ఇప్పటి నుంచే ఏర్పాట్లు పర్యవేక్షణ, ప్లానింగ్‌ చేయాలని కోరారు. సీఎం ఆదేశాల మేరకు సీఎంవో అధికారులు.. ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయరామరాజులను పుష్కరాల ప్రత్యేక అధికారులుగా నియమించారు.


పొదుప సొమ్ము టచ్‌ చేయొద్దు!

సహకార శాఖ కార్యదర్శిగా ఉన్న అహ్మద్‌బాబు ఆ రంగంలోని బ్యాంకులను కంప్యూటరైజ్‌ చేశారని, అద్భుతమైన వర్క్‌ చేశారని సీనియర్‌ ఐఏఎస్‌ రాజశేఖర్‌ పొగడ్తలు కురిపించారు. ప్రైవేటు, కమర్షియల్‌ బ్యాంకుల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల పొదుపు సొమ్ము రూ.24వేల కోట్లను సహకార బ్యాంకులకు మార్చాలని, అలాగైతే బ్యాంకులు స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తాయని ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు ఇందులో ఏదో అంతరార్థం ఉన్నట్లు భావించినట్లున్నారు. అప్పటికప్పుడు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ‘‘పొదుపు సొమ్ము 30 ఏళ్ల కష్టం. దీనిని సహకార బ్యాంకుల్లో పెట్టాలన్న ఆలోచనలు మంచివికావు. పొదుపు సొమ్మును టచ్‌ చేయవద్దు. తిరుమలలో వేల కోట్లు ఉన్నాయని, వాటిని రాష్ట్ర అభివృద్ధికి వాడుకోవచ్చని కూడా కొందరు చెబుతారు. ఆ అప్పు తర్వాత తీర్చాలి కదా. ఆ డబ్బును వాడుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. పొదుపు సొమ్మును టచ్‌చేయడానికి వీల్లేదు’’ అని సీఎం స్పష్టంగా చెప్పారు.

హామీలు వద్దు... చేతలు కావాలి!

విజయనగరం జిల్లాలో ఆర్ధికాభివృద్ధిని పెంచుతామని, జిల్లా నుంచి ఆదాయాన్ని తీసుకొస్తామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. సీఎం స్పందిస్తూ... ‘‘మీ హామీలు నాకు వద్దు తల్లీ. నాకు ముడిపదార్థంలాంటి మెటీరియల్‌ ఇస్తున్నారు. అందులో ఫలితాలు కనిపించడం లేదు. ఇప్పటికే 9 నెలల సమయం గడిచి పోయింది. మీ ప్రోగ్రెస్‌ లెక్కలు ఇక్కడున్నాయి. ఏదైనా చేతల్లో చూపించండి’’ అని సూటిగా, స్పష్టంగా చెప్పారు.

కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నా అంతేనా?

విశాఖలో పంచ గ్రామాల సమస్యను పరిష్కరిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నా ఇంకా అమల్లోకి ఎందుకు రాలేదని విశాఖ కలెక్టర్‌ను సీఎం ప్రశ్నించారు. సంబంధిత ఫైలు న్యాయశాఖ, ఏజీ పరిశీలనలో ఉందని బదులిచ్చారు. దీనిపై న్యాయశాఖ కార్యదర్శిని సీఎం ప్రశ్నించారు. ‘‘ఒకసారి మంత్రివర్గం నిర్ణయం తీసుకుందంటే దాని అమలుకు అన్ని శాఖలు చకచకా పనిచేయాలి. పెండింగ్‌ ఎందుకు పెట్టారు? ప్రతీదశలో మేం ఫోన్‌చేసి ఫలానా ఫైలు ఏమైందని అడగాలా? పైల్‌ కిందకు పైకి తిరిగితే పనైనట్లా? ఇలాంటివి సత్వరమే అమల్లోకి వచ్చేలా సీఎస్‌ విధాన నిర్ణయం తీసుకురావాలి. ఈ విషయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఏం చేస్తున్నారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 07:44 AM