Share News

AP : ఏపీకి ‘అష్ట’కష్టాలు!

ABN , Publish Date - May 23 , 2024 | 03:53 AM

ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు కావస్తోంది. ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది.

AP : ఏపీకి ‘అష్ట’కష్టాలు!

రాష్ట్రానికి శాపంగా 8 నిబంధనలు

విభజన చట్టంలోని నిబంధనలతో కుదేలు

వాటిని సవరిస్తే ఆర్థికంగా వెసులుబాటు

అప్పులన్నీ జనాభా ప్రాతిపదికన విభజన

ఆస్తులు మాత్రం భౌగోళికంగా అప్పగింత

రూ.వేల కోట్ల భారంతో గాడితప్పిన రాష్ట్రం

ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ

కేంద్రానికి అనేకసార్లు చంద్రబాబు లేఖలు

ఒక్క నిబంధననూ సవరించని కేంద్రం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు కావస్తోంది. ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఏపీకి రావాల్సింది కొండంత ఉంటే.... వాస్తవంగా వచ్చింది గోరంత మాత్రమే. ఆదుకుంటామన్న కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడమే తప్ప ఆచరణలో దక్కింది శూన్యం. రాష్ట్రాన్ని ఆదుకుంటామని కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదు. మరోవైపు ఈ చట్టంలో పేర్కొన్న ఎనిమిది నిబంధనలతో రాష్ట్రానికి రూ.వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ నిబంధనలు సవరించి ఏపీకి న్యాయం చేయాలని, జనాభా ప్రాతిపదికన ఆదాయం, అప్పుల కేటాయింపులు జరపాలని నాటి సీఎం చంద్రబాబు కేంద్రానికి పలుమార్లు విన్నవించారు. లేఖలు కూడా రాశారు. కానీ ఇంతవరకూ ఏ ఒక్క నిబంధన ను కూడా సవరించలేదు. వాటిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ప్రస్తుత సీఎం జగన్‌ తెస్తున్న రూ.లక్షల కోట్ల అప్పులతో గాడితప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంతమేర కోలుకొనే అవకాశం ఉంటుంది. రాష్ట్ర జనాభా 58.42 శాతం అయితే విభజన చట్టంలో 14వ ఆర్థిక సంఘం కేవలం 46శాతం ఆదాయాన్నే కేటాయించింది.

దీనివల్ల నిధుల కొరత ఏర్పడటమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. 2020-21 నుంచి 15వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చింది. 14వ ఆర్థిక సంఘంలో జరిగిన అన్యాయాన్ని జగన్‌ సర్కారు ప్రశ్నించకపోగా, 15వ ఆర్థిక సంఘం నిధులను ఇష్టారీతిగా వాడేశారు. కేంద్రం ప్రతినెలా రాష్ట్రానికి ఇచ్చే రెవెన్యూ లోటు గ్రాంటు నిధుల కింద 15వ ఆర్థిక సంఘం రూ.30,500 కోట్లు కేటాయించింది. వీటిని ఐదేళ్లపాటు సమానంగా వాడుకోవాలి. అంటే ఏడాదికి రూ.6,100 కోట్లు చొప్పున వాడాలి. కానీ, జగన్‌ మొదటి ఏడాది రూ.17,000 కోట్లు, రెండో ఏడాది రూ.11,000 కోట్లు, మూడు, నాలుగో ఏడాదుల్లో రూ.2,500 కోట్లు వాడారు. ఇవి చాలకపోవడంతో నాలుగో ఏడాది విభజన హామీ కింద రావాల్సిన రెవెన్యూ లోటు రూ.10,000 కోట్లు తెచ్చి వాడేశారు. విభజన నాటి రెవెన్యూ లోటు కింద ఏపీకి ఇంకా రూ.11,000 కోట్లు రావాల్సి ఉంది. విభజన నాటికి ఉమ్మడి ఏపీ సాధించిన రూ.9,15,852 కోట్ల జీడీపీలో ఏపీకి రూ.4,64,272 కోట్లు అంటే 50.69 శాతం మాత్రమే కేటాయించారు. జనాభా ప్రాతిపదికన కేటాయించి ఉంటే మరో 8శాతం అదనంగా లభించి ఉండేది. దీంతో రాష్ట్ర తలసరి ఆదాయం బాగా తగ్గిపోయింది. విభజన అనంతరం 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,12,162 కాగా ఏపీకి రూ.82,870గా ఉంది. రెండు రాష్ట్రాల మధ్య రూ.30,292 తేడా ఉంది. ఈ లోటును పూడ్చటానికి ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు.

1. అశాస్త్రీయంగా ఆదాయం కేటాయింపు

ఏపీలో 58.42 శాతం జనాభా ఉన్నప్పటికీ.. 14వ ఆర్థిక సంఘం 46శాతం ఆదాయాన్నే రాష్ట్రానికి కేటాయించింది. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి సంక్షేమ ఖర్చులు, ఇతర ఖర్చులు అధికంగానే ఉంటాయి కానీ, ఆదాయం మాత్రం తక్కువగా కేటాయించారు.

2. భౌగోళిక ప్రాతిపదికన ఆస్తుల విభజన

ఈ నిబంధన ప్రకారం తెలంగాణలో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లు, కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులన్నీ ఆ రాష్ట్రానికే సొంతమవుతాయి. వీటన్నింటి నిర్మాణంలో ఏళ్ల తరబడి భాగస్వామ్యం ఉన్న ఏపీకి ఎలాంటి వాటా లభించదు. పైగా ఆదాయం అధికంగా వచ్చే హైదరాబాద్‌ తెలంగాణకే దక్కింది. ఎంసీహెచ్‌ఆర్డీ అనేది పెద్ద వ్యవస్థ. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే హైదరాబాద్‌లో అనేక ఎకరాల్లో దీన్ని నిర్మించారు. కానీ, ఇందులో ఏపీకి వాటా లేదు. కనీసం దాని విలువ కూడా కట్టివ్వలేదు. దీంతో బాపట్లలోని పాత భవనంలో ఏపీకి చెందిన ఎంసీహెచ్‌ఆర్డీని కొనసాగిస్తున్నారు. అలాగే, ఉమ్మడి రాష్ట్రం సచివాలయంలోని కొన్ని బ్లాకులను 2019లో జగన్‌ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. దీనికి సంబంధించి ఎలాంటి విలవ కట్టలేదు. ఏపీకి రూపాయి కూడా ఇవ్వలేదు.

3. జనాభా ప్రాతిపదికన అప్పులు పంచడం

ఏపీలో జనాభా ఎక్కువ. కాబట్టి రాష్ట్రం వాటా కింద అప్పులు ఎక్కువ వచ్చాయి. లోన్లు, గ్యారంటీలు, ఇతర అప్పులను జనాభా ప్రాతిపదికన విభజించడంతో ఏపీకి తీరని ఆర్థిక నష్టం వాటిల్లింది.


4. వినియోగం ప్రాతిపదికన విద్యుత్తు వాటాలు

తెలంగాణ, ఏపీల్లో విద్యుత్తును ఎక్కడ ఎక్కువ వినియోగిస్తున్నారనే ప్రాతిపదికన విద్యుదుత్పత్తి కేంద్రాల్లో వాటాలు పంచారు. హైదరాబాద్‌ ఉన్న తెలంగాణలోనే విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీని ఆధారంగా జనాభా ఎక్కువగా ఉన్న ఏపీకి తక్కువ విద్యుత్తును కేటాయించి, జనాభా తక్కువగా ఉన్న తెలంగాణకు ఎక్కువ కేటాయించారు. దీంతో విభజన తర్వాత ఏపీలో డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేయలేకపోయింది.

5. పన్నుల్లోనూ అదే తేడా

పన్నుల పంపకంలో కూడా ఏపీకి అన్యాయం జరిగింది. విభజన నాటికి ప్రభుత్వం ప్రజలకు, కంపెనీలకు, ఇతర సంస్థలకు తిరిగి చెల్లించాల్సిన పన్ను రీఫండ్‌లను జనాభా ప్రాతిపదికన విభజించారు. దీనివల్ల ఎక్కువ జనాభా ఉన్న ఏపీపై అధిక భారం పడింది. అలాగే, ప్రజలు, ఇతర సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను మాత్రం భౌగోళిక ప్రాతిపదికన, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత ప్రభుత్వానికి చెల్లించాలన్న నిబంధన పెట్టారు. ఈ నిబంధనతో తెలంగాణ ప్రభుత్వానికి లాభం చేకూరగా, ఏపీకి రూ.3,800 కోట్ల నష్టం వాటిల్లింది.

6. సింగరేణిపై ద్వంద్వ వైఖరి

సింగరేణి సంస్థ 9వ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ భౌగోళిక ప్రాతిపదికన ఆ కంపెనీలో తెలంగాణకు 51 శాతం ఈక్విటీ కేటాయించారు. విజయవాడ కొండపల్లిలో ఉన్న ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్‌ఎంఈఎల్‌ కూడా 9వ షెడ్యూల్‌లో ఉంది. భౌగోళికంగా ఏపీలో ఉన్న ఈ సంస్థ రాష్ట్రానికే దక్కాలి. కానీ, దాన్ని కూడా తెలంగాణకే కేటాయించారు.

7. ఏపీపైనే వేల కోట్ల అప్పుల భారం

విభజన తర్వాత ఏపీకి రూ.1,30,000 కోట్ల రుణ భారాన్ని కేటాయించారు. దీంతోపాటు రూ.33వేల కోట్ల రుణాన్ని విభజించకుండా కేవలం ఏపీ ఖాతాలో పెట్టడం రాష్ట్ర ఖజానాను కుంగదీసింది. దీంతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి చాలా తగ్గిపోయింది. కనీసం ఈ రూ.33,000 కోట్లను జనాభా ప్రాతిపదికన పంచినా ప్రభుత్వంపై కొంతభారం తగ్గేది. కానీ, మొత్తం ఏపీ ఖాతాలోనే వేయడంతో వాటి అసలు, వడ్డీ చెల్లింపులతో రాష్ట్రం మరింత కుంగిపోయింది.

8. పెన్షన్‌ రుణాలు

ఉమ్మడి రాష్ట్రం పెన్షన్‌ రుణాలను జనాభా ప్రాతిపదికన విభజించి ఏపీపై మోయలేని భారం వేశారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు పూర్తవుతున్నా విభజన చట్టంలోని అనేక సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. వీటి పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నించింది. జగన్‌ సీఎం అయ్యాక విభజన అంశాలపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

Updated Date - May 23 , 2024 | 03:53 AM