Justice Satyanarayana Murthi,: తిరుమలలో ఏకసభ్య కమిషన్
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:50 AM
శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన శనివారం తిరుమలలోని క్యూలైన్లను, కంపార్టుమెంట్లను పరిశీలించారు. తిరిగి ఆదివారం ఉదయం ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన
రద్దీ వేళల్లో క్యూలైన్లలో ఇబ్బందులపై ఆరా
తొక్కిసలాటపై విచారణకు నేడు కలెక్టర్
రేపు టీటీడీ ఈవో, ఇతర అధికారులు..
తిరుమల, మార్చి 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి తిరుమలలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన శనివారం తిరుమలలోని క్యూలైన్లను, కంపార్టుమెంట్లను పరిశీలించారు. తిరిగి ఆదివారం ఉదయం ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు దర్శనానికి ఎలా వెళ్తున్నారు? తిరిగి ఎలా వస్తున్నారు? రద్దీ అధికంగా ఉన్న సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? తదితరాలను పరిశీలన చేయడంతోపాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, లైజన్ ఆఫీసర్ రూప్‌చంద్‌తో కలిసి యాత్రికుల వసతి సముదాయం-4(పీఏసీ)లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ను వీడియోవాల్‌పై ఉన్న స్ర్కీన్ల ద్వారా వీక్షించారు. తిరుమలలో మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు? వాటి ద్వారా ఎలాంటి పరిశీలనలు చేస్తున్నారు? బ్యాకప్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయాలను టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు ఆయనకు వివరించారు. సోమవారం ఉదయం తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంటారు. వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్‌ను విచారించనున్నారు. ఈనెల 18వ తేదీన టీటీడీ ఈవోను, ఇతర అధికారులను విచారించనున్నారు.
ఇవి కూడా చదవండి..