Vigilance Report : ఐపీఎస్ సంజయ్ ప్రాసిక్యూషన్
ABN , Publish Date - Dec 22 , 2024 | 03:45 AM
సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఏసీబీకి అనుమతిచ్చిన ప్రభుత్వం
సీఐడీ చీఫ్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో అక్రమాలు
ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు
అరెస్ట్ చేసేందుకూ అవకాశం
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా, ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వహించిన సమయంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇటీవల ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ చట్టం 1969లోని సెక్షన్ 3(1) కింద చర్యలు తీసుకుంది. అక్రమాలపై విచారణ చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఏసీబీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి నిరోధక చట్టం 17ఎ ప్రకారం ఒక ప్రభుత్వ అధికారిపై విచారణ జరపాలంటే ఆయనను తొలగించే అధికారం ఉన్న అధికారి అనుమతి తప్పసరిగా తీసుకోవాలి. దాంతో ఏసీబీ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. సంజయ్‌పై కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా విజయవాడ దాటి వెళ్లకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏసీబీ విచారణ ప్రారంభించడంతో పాటు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నో ఆరోపణలు...
జగన్ జమానాలో సీఐడీ చీఫ్ కంటే ముందు సంజయ్ ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వహించారు. అప్పట్లో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. అగ్ని ఎన్‌వోసీ టెండర్ల ప్రక్రియలో అక్రమాలతో పాటు నిబంధనల అమలులో అవకతవకలకు పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో అగ్ని ఓర్టల్‌లో ఎన్‌వోసీలు, హార్డ్‌వేర్ సరఫరా కోసం రూ.2.29 కోట్ల ఒప్పందాన్ని సౌత్రికా టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ ఒప్పందంలో సదరు కంపెనీకి రూ.59.93 లక్షలు ముందుగా చెల్లింపులు చేశారు. కానీ నెల రోజుల్లో కేవలం 14 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. మైక్రోసాఫ్ట్ లాప్‌ట్యా్‌పలు, యాపిల్ ఐ ప్యాడ్‌లను ఆయన నేరుగా కొనుగోలు చేశారు. టెండర్ ప్రక్రియ లేకుండా కొనుగోలు చేయడంతో పాటు అధిక ధరలకు రూ.17.89 లక్షలు చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యాంగా ఆర్థిక లావాదేవీలు, అధిక ధరలకు పరికరాలు కొనుగోలు చేయడం వంటి వాటిని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణలో కూడా ఆయన అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1.19 కోట్లు కేటాయించింది. వాటిని కృతి వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నిర్వహించారు. వాస్తవానికి భారీ స్థాయిలో సదస్సులు నిర్వహించలేదు. ఏ కంపెనీకీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించలేదు. తూతు మంత్రంగా ప్రైవేటు భవనాల్లో సదస్సులు నిర్వహించేశారు. ఇందుకు రూ.3.10 లక్షలు మాత్రమే ఖర్చు అయింది. మిగిలిన బడ్జెట్ మొత్తం లేని కంపెనీ పేరుతో దారి మళ్లించారు. కాగితాలపై మాత్రం టెండర్లు పిలిచినట్లు, కంపెనీని ఎంపిక చేసినట్లు, దాని ద్వారా సదస్సులు నిర్వహించినట్లు చూపించారు. దీనిపైనా విజిలెన్స్ అధికారులు విచారణ చేసి బాధ్యుడిగా సంజయ్‌ను గుర్తించారు.
సీఐడీ చీఫ్‌గా వివాదాలు
జగన్ ప్రభుత్వంలో సంజయ్ సీఐడీ విభాగాధిపతి కాకముందు కీలకమైన పోస్టులు, చెప్పుకోదగ్గ పోలీస్ విభాగంలో పని చేయలేదు. జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా సీఐడీ చీఫ్‌గా నియమించింది. ఆయన వైసీపీ రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడి వేధించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంఘటనలు మొదలుకుని చాలా విషయాల్లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చివరికి అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా సంజయ్ కీలకంగా మారారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహరాల్లో ముఖ్యమంత్రికి నేరుగా జోక్యం ఉండదన్న విషయం తెలిసీ స్కిల్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించారు. అర్ధరాత్రి నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేయించారు. తన అధికార పరిధి దాటి మరీ జగన్‌కు జై అన్నట్లుగా వ్యవహరించారు. మార్గదర్శి కేసుల విషయంలో దూకుడుగా వ్యవహరించారు. కేసుల విషయాల్లో గతంలో ఏ పోలీస్ అధికారి చేయనివిధంగా ప్రెస్‌మీట్లు పెట్టి హడావిడి చేశారు. చివరికి ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేసినా, నోరెత్తినా కేసులు , అరెస్టులతో పాటు వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.