Share News

బరిలోకి బాబు!

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:59 AM

వైసీపీ సర్కారు గత ఐదేళ్లలో అతలాకుతలం చేసిన ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ చక్కదిద్దేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే రంగంలోకి దిగిపోయారు.

బరిలోకి బాబు!

వ్యవస్థలను చక్కదిద్దే పనిలో నిమగ్నం

ప్రమాణస్వీకారానికి ముందే గాడిలో పెట్టే చర్యలు

రోజుల వ్యవధిలోనే మార్పు చూపే యత్నం

అమరావతి ప్రాంతంలో సీఎస్‌ సుడిగాలి పర్యటన

200 పొక్లయిన్లతో జంగిల్‌ క్లియరెన్స్‌

రాష్ట్రవ్యాప్తంగా వీధిదీపాల వెలుగులకు ఆదేశం

పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని సూచన

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు

సురక్షిత తాగునీటి సరఫరాకు నిర్దేశం

జగన్‌తో అంటకాగిన అధికారులకు ఉద్వాసన

కీలక ఫైళ్లు మాయం కాకుండా అప్రమత్తం

ఫైబర్‌నెట్‌, ఏపీఎండీసీ, బేవరేజెస్‌ ఆఫీసులు సీజ్‌

బాధ్యతలు చేపట్టగానే వివిధ శాఖలపై సీఎం సమీక్ష!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ సర్కారు గత ఐదేళ్లలో అతలాకుతలం చేసిన ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ చక్కదిద్దేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు తర్వాత భారీ మెజారిటీతో టీడీపీ కూటమి గెలుపొందింది. తొలుత 9వ తేదీన సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. అయితే ప్రధాని మోదీ అదే రోజు బాధ్యతలు చేపడుతుండడం.. ఎన్డీయేలో టీడీపీ ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో.. తన ప్రమాణ స్వీకారాన్ని 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే బాధ్యతలు చేపట్టనప్పటికీ.. ఒక్క రోజు కూడా వృఽథాచేయడం ఈ విజనరీ నేతకు ఇష్టం ఉండదని.. సీఎ్‌సకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. తాను బాధ్యతలు చేపట్టేనాటికే ఎంతో కొంత మార్పు కనిపించాలని భావిస్తున్నారు. జగన్‌ సర్కార్‌ నిర్వాకంతో కసితో ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తన నుంచి ఏం ఆశిస్తున్నారో.. తదనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పాలనలో విశేషానుభవం ఉన్న ఆయన.. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఛిద్రమైన వ్యవస్థలను సరిచేసేందుకు ముందుగా నడుం బిగించారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మళ్లీ చేసి చూపించేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకున్న చంద్రబాబు.. ప్రధానమైన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిపై దృష్టి పెట్టారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని మొదలుపెట్టింది. ఆయన ఆదేశాలతో అమరావతిలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణ పనులను సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ స్వయంగా పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్ధండరాయునిపాలెంలోని సీఆర్‌డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఏపీ ఎన్జీవో నివాస భవనాల సముదాయాలను.. హైకోర్టు తదితర ప్రాంతాలను సీఎస్‌ పరిశీలించారు. రాజధాని ప్రాంతం చిట్టడవిలో మారి ఉండడంతో తొలుత పెద్దఎత్తున జంగిల్‌ క్లియరెన్స్‌ పనులకు ఆదేశించారు. 200 పొక్లయిన్లు చిట్టడవిగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. రోడ్లు బాగు చేయడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద మళ్లీ పనులు ప్రారంభించారు.

ఆ అధికారులను దూరం పెడుతూ..

వైసీపీతో అంటకాగిన అధికారుల కదలికలపై చంద్రబాబు దృష్టి సారించారు. ముఖ్యంగా సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను నియమించారు. ఆయన వచ్చీరాగానే సీఎం కార్యాలయంలోని పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్‌ గుప్తాలను బదిలీ చేశారు. వారికి పోస్టింగ్‌ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీచేశారు. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రను నియమించారు. జగన్‌ చేసిన విధ్వంసంలో పాలుపంచుకున్న కొన్ని శాఖల వివాదాస్పద అధికారులను పక్కనబెడుతూ ఉత్తర్వులిస్తున్నారు. వైసీపీ ముద్ర వేసుకున్న అధికారులను కీలక స్థానాల నుంచి తప్పించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇదే విధానంలో కింది స్థాయి సిబ్బంది స్థాన చలనానికీ ఆయా శాఖల అధికారులు ఆదేశాలిస్తున్నారు. కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం అవ్వకుండా.. ఫైబర్‌నెట్‌, ఏపీఎండీసీ, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కార్యాలయాలను సీజ్‌ చేయించారు. ఏపీఎస్పీ పోలీసులతో పహరా ఏర్పాటు చేశారు. సీఐడీతో ఫైళ్లు తనిఖీలు చేయిస్తున్నారు.

నివేదికలు సిద్ధం..

ఇక 12న సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు జరిపే సమీక్షలకు కీలక అధికారులు సిద్ధమవుతున్నారు. ఐదేళ్లుగా పడకేసిన పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్‌ అధికారులు నివేదిక రెడీ చేస్తున్నారు. ఇతర సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత వివరాలు కూడా చంద్రబాబు తెలుసుకున్నారు. విద్యుత్‌ శాఖలో ట్రాన్స్‌కో, జెన్‌కో వ్యవహారాలపైనా సమాచారం తెప్పించుకున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధిదీపాలు వెలగడం లేదని తెలియడంతో వెంటనే చక్కదిద్దాలని ఆదేశాలు జారీచేశారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులకు ఆస్కారం లేకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. విజయవాడలో కొద్ది రోజుల కిందట కలుషిత తాగునీటితో మరణాలు సంభవించిన నేపఽథ్యంలో సురక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక వీఐపీ రాకపోకల పేరుతో ట్రాఫిక్‌ నిలిపివేత వంటి చర్యలు వద్దని పోలీసులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా తన కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో ప్రజలు ఇబ్బంది పడేలా ట్రాఫిక్‌ ఆపొద్దని ఇప్పటికే సూచించారు. రోజుల వ్యవధిలోనే పాలనలో మార్పు చూపించాలన్న కృతనిశ్చయంతో ఆయన ఉన్నారని.. దానికి అనుగుణంగానే ఉన్నతాధికారులకు సూచనలు, ఆదేశాలు వెళ్తున్నాయని అధికార వర్గాలు, టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.


రాజధానిలో సీఎస్‌ సుడిగాలి పర్యటన

జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశం

అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనుల పరిశీలన

తుళ్లూరు, జూన్‌ 9: రాజధాని అమరావతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రాజధానిలో అన్నిచోట్లా వీధి లైట్లు వెలగాలని సీఆర్డీయే అధికారులను ఆదేశించారు. ముందుగా ఉద్దండ్రాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సీఎస్‌ పరిశీలించారు. అనంతరం రాయపూడి రెవె న్యూలో నిర్మాణం పూర్తికావచ్చిన సీఆర్డీఏ రీజినల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎస్‌ అమరావతి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాయపూడిలో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయ భవనాలను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు, ఏపీ ఎన్జీవో నివాస భవనాల సముదాయాలను, హైకోర్టు జడ్జీల బంగ్లాలను ఆయన పరిశీలించారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పౌండేషన్‌ వరకు వచ్చి ఆగిపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. సీఎస్‌తో పాటు సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, అదనపు కమిషనర్‌, సీఆర్డీఏ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన పనులు చేయడానికి 25 ప్రదేశాలను గుర్తించామని చెప్పారు. రాజధాని రైతుల వార్షికకౌలును త్వరలోనే అందజేస్తామని చెప్పారు. రాజధానిలో చంద్రబాబు అప్పగించిన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తామని ప్రకటించారు. రేయింబవళ్లు జేసీబీ యంత్రాలు జంగిల్‌ క్లియరెన్స్‌ పనులలో నిమగ్నమయ్యాయని, ఇప్పటికే 80 యంత్రాలు పనులు చేస్తున్నాయని తెలిపారు. నిర్మాణంలో వినియోగించి తుప్పుపట్టిన ఇనుము విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 03:59 AM