YS Jagan: జగన్ ‘బొమ్మ’కు బిల్లులు!
ABN , Publish Date - Nov 11 , 2024 | 05:47 AM
జగన్ ఫొటోలతో ఉన్న పాసుపుస్తకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో పీడ విరగడైందని రైతులు సంబరపడ్డారు.
ఓ మంత్రి, ఐఏఎస్ మంత్రాంగం..
ఇప్పటిదాకా రూ.120 కోట్లు విడుదల’
మరో 150 కోట్ల విడుదలకు యత్నం..
త్వరలో 65 కోట్లు చెల్లించేలా ప్రతిపాదన
ఇందులో రిటైర్డ్ ఐఏఎస్ బినామీ కంపెనీ
నాడు అడ్డగోలుగా సమగ్ర భూ సర్వే
సర్వే రాళ్లపై జగన్ చిత్రాలు పాసుపుస్తకాల నిండా ఆయన ఫొటోలే
కూటమి ప్రభుత్వం వచ్చాక పాసుపుస్తకాల రద్దు, సర్వే బంద్
చిత్రంగా విచారణకు బదులు చెల్లింపులు
గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ చెల్లించని వైనం
గత టీడీపీ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం పనులు చేసిన ఎంతోమంది కాంట్రాక్టర్లు ఇప్పటికీ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. గత జగన్ సర్కారు కక్షసాధింపు ధోరణితో రకరకాల కొర్రీలు వేసి పెండింగ్‌లో పెట్టింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నవారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బిల్లులు క్లియర్ చేయకుండా... జగన్ ప్రభుత్వంలో అడ్డగోలు పనులు చేసిన వారికి మాత్రం చెల్లింపులు చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో భూముల సమగ్ర సర్వే పేరిట సర్వే రాళ్ల కొనుగోలు, వాటిపై జగన్ చిత్రాలు చెక్కించడం, పాస్ పుస్తకాల నిండా జగన్ ఫొటోలు వేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తప్పుపట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయించాల్సి ఉంది. అలాంటిది... ఈ పనులకు సంబంధించి ఇటీవల 120 కోట్ల బిల్లులు చెల్లించారు. మరో 150 కోట్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? బిల్లుల చెల్లింపు వెనుక మతలబు ఏమిటి?
తెర వెనుక ఇలా..
కాంట్రాక్టర్లకు బిల్లులు సజావుగా చెల్లించేలా సహకరిస్తున్న సీనియర్ ఐఏఎస్‌కు గతంలో రీ సర్వే జరిగే సమయంలోనే డ్రోన్ల కొనుగోలు, పాసుపుస్తకాల ముద్రణ టెండర్లలో భారీగానే లబ్ధి చేకూరిందని ప్రచారం జరుగుతోంది. దీంతో కూటమి ప్రభుత్వంలో ఆయన తన పలుకుబడి ఉపయోగించి తెరవెనక మంత్రాంగం నడుపుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం తనకు సన్నిహితుడైన కీలక మంత్రిని రంగంలోకి దింపి లాబీయింగ్ చేయిస్తున్నారని తెలిసింది. జగన్ ప్రభుత్వంలో రీ సర్వే పేరిట కొనుగోళ్లు, చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేయించాల్సిన కూటమి ప్రభుత్వం... ఆ కాంట్రాక్టర్లకు శరవేగంగా బిల్లులు చెల్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
అమరావతి-ఆంధ్రజ్యోతి: జగన్ ఫొటోలతో ఉన్న పాసుపుస్తకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో పీడ విరగడైందని రైతులు సంబరపడ్డారు. తప్పుల తడక అయిన సమగ్ర భూ సర్వేను ఆపేయడంతో దరిద్రం వదిలిందని ఊపిరి పీల్చుకున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంతవరకు బాగానే ఉంది. అదేమిటో కానీ ఓ మంత్రి, ఓ సీనియర్ ఐఏఎస్ జట్టు కట్టి జగన్ ప్రభుత్వంలో రీ సర్వే పేరిట జరిగిన ఖర్చులకు ఇప్పుడు బిల్లులు ఇప్పిస్తున్నారు. అంతేగాక అదే రీ సర్వేను ఎలాగైనా మళ్లీ పట్టాలు ఎక్కించాలని చూస్తున్నారు. మరోసారి ప్రభుత్వ సొమ్ముతో భారీగా రోవర్లు, డ్రోన్లు కొనుగోలు చేయించాలని తహతహలాడుతున్నారు. గత కాంట్రాక్టర్లను పేషీకి పిలిపించుకొని మంతనాలు చేయిస్తున్నారు. పాత బిల్లులు ఇవ్వాలంటూ తరచూ ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి సిఫారసులు పంపిస్తున్నారు. లబ్ధిపొందే వారి జాబితాలో జగన్ ప్రభుత్వంలో కీలక సలహాదారు, వైసీపీ నేత బినామీ కంపెనీ, మరో రిటైర్డ్ ఐఏఎస్ బినామీ కంపెనీలున్నాయి. వారికి లబ్ధి చేకూర్చడం కోసం కూటమి సర్కారులోని ఓ మంత్రి, సీనియర్ ఐఏఎస్ తపన పడిపోతుండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. కమిషన్‌ల కోసమే అయితే బిల్లులు ఇప్పించాల్సిన పనిలేదు. అంతకుమించి మరేదో తెరచాటు మంత్రాంగం సాగుతోంది. రీ సర్వే ను పున:ప్రారంభించి భారీగా కొనుగోళ్ల పేరిట ఖర్చు పెట్టించేందుకే మాస్టర్‌ప్లాన్ వేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి రాగానే రీ సర్వేనే నిలిపివేశారు.
నాడు అంతా అడ్డగోలు..
జగన్ ప్రభుత్వంలో 2019 డిసెంబరు నుంచి 2024 మా ర్చి వరకు భూముల సర్వే చేశారు. ఇందుకు కేంద్రం నుంచి వచ్చిన డిజిల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్(డీఐఎల్‌ఆర్‌ఎమ్‌పీ) నిధులను వాడారు. ఈ ప్రా జెక్టు వ్యయం రూ.965 కోట్లు. డ్రోన్లు, రోవర్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు, ఇతర సాంతికేతను సమకూర్చేందుకు రూ.580 కోట్లు వ్యయం చే శారు. ఇందులోనే సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చిన నిధులున్నాయి. సర్వే రాళ్ల కొనుగోలు, జగన్ ఫొటోలతో పాసుపుస్తకాల ముద్రణ, రాళ్ల తయారీ కోసం మరో రూ.600 కోట్లు ఖర్చుపెట్టారు. ఇలా మొత్తం రూ.1180 కోట్లు ఖర్చు పెట్టి హడావుడి చేశారు. రీ సర్వేతో కొత్త సమస్యలను కోకొల్లలుగా పుట్టించారు. సర్వే రాళ్ల కొనుగోలులో నాటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి పెద్ద దందా నడిపారు. సర్వే కోసం ఆశాఖ భారీగా రోవర్లు, డ్రోన్లు కొనుగోలు చేసింది. జగన్ ఫొటోలతో పాసుపుస్తకాల ను ముద్రించే కాంట్రాక్టును గుంటూరుకు చెందిన ఓ ప్రింటర్‌కు అప్పగించింది. ఆయన.. జగన్ హయాంలో కీల క సలహాదారుగా వ్యవహరించిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ మనిషి. ఇక రోవర్ల కొనుగోలులో ఓ రాజకీయ సలహాదారు చక్రం తిప్పారు. తమ అస్మదీయ కంపెనీలకే టెండర్లు ఇప్పించా రు. ప్రభుత్వ సొమ్ము వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేయించిన పరికరాలేవీ ఇప్పుడు పనికొచ్చే పరిస్థితిలో లేవు. డ్రోన్లు మూలనపడ్డాయి. అవి పనిచేయడానికి మళ్లీ భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జగన్ ఫొటోలతో ముద్రించిన పాసుపుస్తకాల కోసం దాదా పు 20 కోట్లపైనే ఖర్చు పెట్టారు. జగన్ ప్రభుత్వం దిగిపో యే నాటికి... రోవర్లు, డ్రోన్లు సరఫరా చేసిన కంపెనీలకు, ప్రింటర్స్‌కు దాదాపు 270 కోట్ల బిల్లులు చె ల్లించాల్సి ఉంది.
ఇప్పుడు బిల్లుల చెల్లింపులు..
ఎన్నో అక్రమాలు, నిధుల దుర్వినియోగంతో కూడిన రీ సర్వేను కూటమి సర్కారు ఆపేసింది. ఈ నేపథ్యంలో దాని పై విచారణ చేయించాల్సి ఉంది. అయితే చిత్రంగా.. ప్రభుత్వంలో ఈ బిల్లుల చెల్లింపు సాగిపోతోంది. ఇప్పటి వరకు 3 పద్దుల్లో కలిపి రూ.120 కోట్ల మేర చెల్లించినట్లు తెలిసింది. మరో రూ.150 కోట్లు ఉన్నాయి. ఇందులో 65 కోట్లు త్వరలో ఇచ్చేలా ప్రతిపాదనలు వెళ్లాయి. పాసుపుస్తకాలు ముద్రించి న గుంటూరు కాంట్రాక్టర్, డ్రోన్ కాంట్రాక్టర్లు గత కొద్దిరోజులుగా ఆర్థిక శాఖలోని ఓ కీలక అధికారి పేషీలోనే మకాం వేశారు. వారు రోజువారీగా ఓ కీలక మంత్రి పేషీ, ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసు, ఆర్థిక శాఖ కీలక అధికారి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కీలకమైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నా, రీ సర్వే పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరిగిపోతున్నాయి.