Share News

ఎమ్మెల్యేలకు క్రీడా గాయాలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:11 AM

క్రీడా పోటీల్లో పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ క్రికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ కిందపడడంతో గడ్డం వద్ద గాయమైన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేలకు క్రీడా గాయాలు

  • రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌కు కాలు ఫ్రాక్చర్‌

విజయవాడ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): క్రీడా పోటీల్లో పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ క్రికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ కిందపడడంతో గడ్డం వద్ద గాయమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, బుచ్చయ్యచౌదరి కెప్టెన్లుగా బుధవారం కబడ్డీ జట్లు తలపడ్డాయి. విష్ణు జట్టులోని ఎమ్మెల్యే శ్రీధర్‌ కూతకు వెళ్లారు. ఆయనను బుచ్చయ్యచౌదరి జట్టు పట్టుకోగా శ్రీధర్‌ కాలు విరిగింది. అదేవిధంగా కూతకు వచ్చిన క్రీడాకారుడ్ని పట్టుకోడానికి బుచ్చయ్యచౌదరి ఒక్కోఅడుగు వెనక్కి వేస్తూ అదుపు తప్పి కింద పడిపోవడంతో తలకు వెనుక భాగంలో గచ్చు తగిలి గాయమైంది. వైద్య సిబ్బంది వెంటనే బ్యాండేజ్‌ వేశారు. క్రికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ ఎమ్మెల్సీ రాంభూపాల్‌ రెడ్డి కిందపడటంతో శరీరంపై పలుచోట్ల కొట్టుకుపోయిన గాయాలయ్యాయి. కాగా, క్రికెట్‌ పోటీల్లో మంత్రి సత్యకుమార్‌ జట్టుపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ జట్టు విజయం సాధించింది. తొలుత నాదెండ్ల మనోహర్‌ జట్టు బ్యాటింగ్‌ చేయగా, తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సత్యకుమార్‌ జట్టు నిర్దేశిత లక్ష్యానికి చేరుకోకుండానే ఆలవుటయ్యింది.


‘కుర్చీ’ నాదే... మ్యూజికల్‌ చైర్‌ పోటీలో ఎమ్మెల్యే మిరియాల శిరీష విజేతగా నిలిచారు. మంత్రులు సవిత, అనిత, సంధ్యారాణితోపాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. సవిత ద్వితీయ, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తృతీయ స్థానాల్లో నిలిచారు.

విసిరేస్తా... పురుష, మహిళా ఎమ్మెల్యేలకు వేర్వేరుగా షాట్‌పుట్‌ పోటీలు నిర్వహించారు. మహిళ విభాగంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి విజేతగా నిలిచారు. పురుషులకు రెండురౌండ్లుగా పోటీలు నిర్వహించగా ఎమ్మెల్యేలు విజయ్‌కుమార్‌, కామినేని శ్రీనివాస్‌ విజేతలుగా నిలిచారు. ఆరు పదుల వయసు దాటిన ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కూడా షాట్‌పుట్‌ విసిరి తన సత్తాను చూపించారు.

ఎమ్మెల్యేల గెలుపు పరుగు... 100మీ, పరుగు పందెంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్‌, ఎమ్మెల్యే రామాంజనేయులు విజేతలుగా నిలిచారు.

Updated Date - Mar 20 , 2025 | 04:11 AM