Share News

CM Chandrababu : నేరస్థులను వదలొద్దు

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:44 AM

నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలి పెట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాజకీయ ముసుగు వేసుకుని అరాచకాలకు తెగబడే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu : నేరస్థులను వదలొద్దు

  • రాజకీయ అరాచక శక్తులను ఉపేక్షించొద్దు

  • పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి

  • గత ప్రభుత్వ తాలూకు వాసనలు ఒక్క పోలీసు స్టేషన్‌లోనూ కనిపించరాదు

  • వనరులు దోపిడీ చేసిన దొంగలు జైలుకెళ్లాలి

  • ఐదేళ్లూ ప్రజల్ని వేధించిన వారికి శిక్ష పడాలి

  • పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు

  • తిరుమల కొండపైన అక్రమాలపై ఆరా

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలి పెట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాజకీయ ముసుగు వేసుకుని అరాచకాలకు తెగబడే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎస్‌, డీజీపీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ ఏడీజీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమాలు, అవినీతి కేసుల స్థితి గతులపై అధికారులతో మాట్లాడారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపైన అక్రమాలపై విజిలెన్స్‌ నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా జారీచేసిన బ్రేక్‌ దర్శనాల టికెట్లకు కమీషన్ల వసూళ్లు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సంఖ్యలో చూపించిన తేడాలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పోలీసుల పనితీరులో అన్ని చోట్లా మార్పు కనిపించాలని, గత ప్రభుత్వ వాసనలు ఒక్క పోలీసు స్టేషన్‌లోనూ కనిపించడానికి వీల్లేదని డీజీపీ తిరుమలరావుకు సూచించినట్లు తెలిసింది. ‘టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలి.


కేసుల్లో శిక్షలు పెరిగితేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయన్న మీ పోలీసు సూత్రాన్ని గట్టిగా అమలుచేయండి’ అని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జగన్‌ పాలనలో వైసీపీ నేతలు రాష్ట్రమంతా దోచేశారని, ఇసుక దోపిడీలో తవ్వే కొద్దీ అక్రమాలు ఉన్నాయని అన్నట్టు సమాచారం. సహజ, ప్రభుత్వ వనరులు దోపిడీ చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలి పెట్టొద్దని ఆదేశించారు. ప్రజల నుంచి వేలాది ఫిర్యాదులు టీడీపీ కార్యాలయానికి వస్తున్నాయని, అందులో భూ సంబంధింత అక్రమాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రజల్ని వేధించి హింసించిన వ్యక్తుల్ని జైల్లో పెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన ఇళ్లను రాక్రీట్‌ అనే సంస్థకు ఎలాంటి టెండర్‌ లేకుండా కట్టబెట్టిన వైనాన్ని విజిలెన్స్‌ డీజీ హరీశ్‌ కుమార్‌ గుప్తా వివరించారు.

అప్పటి రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి సోదరుడికి చెందిన సంస్థ చేపట్టిన పనుల కన్నా కోట్లాది రూపాయల బిల్లులు అధికంగా డ్రా చేసుకున్నట్లు విజిలెన్స్‌ విచారణలో తేలిందన్నారు. మొత్తం ఏడు జిల్లాల్లో 52 వేల ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు తీసుకుని 23 వేల ఇళ్లకు పైగా పూర్తి చేయలేదని, ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 50 కోట్లకు పైగా అదనపు చెల్లింపులు జరిగాయని వివరించినట్లు తెలిసింది. ఇలాంటి దోపిడీతో పాటు మదనపల్లె ఫైల్స్‌ లాంటివి రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయని, పోలీసు శాఖ సీరియ స్‌గా తీసుకోవడం లేదని సీఎం వ్యాఖ్యానించారు.


చిన్న భూకబ్జా అయినా బాధ్యులకు శిక్ష పడేలా చూడాలని, బాధితులకు న్యాయం జరగాలని అన్నట్టు తెలిసింది. మద్యపాన నిషేధం పేరుతో ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్‌.. వేల కోట్లు ప్రజల నుంచి పీల్చేశారని, అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఆస్కారం ఉండదన్నారు. ఈ కేసులో కొంత పురోగతి సాధించామని, ఏపీ బేవరేజెస్‌ కార్యాలయంలో జరిపిన సోదాల్లో భారీగా డాక్యుమెంట్లు సీజ్‌ చేశామని ఈ సందర్భంగా సీఐడీ ఏడీజీ చెప్పినట్టు తెలిసింది. సైంటిఫిక్‌, డిజిటల్‌ ఎవిడెన్స్‌తో బాధ్యులకు కోర్టుల్లో శిక్షలు పడేలా ఉచ్చు బిగించాలని సీఎం సూచించినట్లు సమాచారం.

Updated Date - Oct 01 , 2024 | 03:44 AM