MLC: ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదు
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:27 AM
వైసీపీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్సీ కేజేఆర్ భరత్ ఎన్నికల తర్వాత కుప్పంలో కనిపించక పోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.
కుప్పం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్సీ కేజేఆర్ భరత్ ఎన్నికల తర్వాత కుప్పంలో కనిపించక పోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కుప్పం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులు తప్ప కుప్పంలో లేరు. సొంతూరు హైదరాబాదుకు వెళ్లిపోయారు. స్థానికంగా పార్టీకి నాయకత్వం వహించేవారు లేకపోవడంతో అసహనానికి గురైన వైసీపీ కార్యకర్తలు.. ‘ఎమ్మెల్సీ భరత్ మాకు కనిపించడంలేదు. ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయగలరు- కుప్పం నియోజకవర్గ కార్యకర్తలు’ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘కనబడుటలేదు’ అన్న శీర్షికతో ఉన్న ఈ పోస్టుల్లో, ‘పేరు: భరత్ ఎమ్మెల్సీ, వయసు: 35’ అని కూడా స్పష్టంగా రాశారు. నిన్నమొన్నటిదాకా వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కూడా అయిన భరత్ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపరిమిత అధికారం అనుభవించారు. తన సామాజిక వర్గంలోనే కొందరిలో ఆయనపట్ల అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఇపుడు ప్రతిపక్షంలో వచ్చిన సమయంలో తమకు అండగా ఉండకుండా సొంత ప్రాంతానికి వెళ్లిపోవడంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు.