CM Chandrababu : కాలంతో పరుగు!
ABN , Publish Date - Dec 17 , 2024 | 03:00 AM
పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 అక్టోబరు నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

పోలవరం 2026 అక్టోబరుకే పూర్తవ్వాలి: సీఎం
ప్రాజెక్టులో ప్రతి పనికీ కాల వ్యవధి.. నిర్దిష్ట కార్యాచరణ ప్రకటన
జాప్యానికి తావులేకుండా పక్కా ప్రణాళిక
అనుమతులు, ఇతరత్రా అంశాలపై దృష్టి
ఇంజనీరింగ్ విభాగానికి అతిపెద్ద బాధ్యత
2న డయాఫ్రం వాల్ పనులకు శ్రీకారం
సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు
జగన్ పాలనలో ప్రాజెక్టు సర్వనాశనం
జరిగిన నష్టం అంతా ఇంతా కాదు
2019లో మేం మళ్లీ గెలిచి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తయ్యేది
ఐదేళ్లలో పనులు చేయకపోవడంతో రూ.15 వేల కోట్ల నష్టం
ప్రాజెక్టు ప్రాముఖ్యమెంతో ప్రధానికి చెప్పి రూ.12,157 కోట్లు సాధించాం: సీఎం
ప్రాజెక్టు వద్ద పనుల పరిశీలన అధికారులతో సమీక్ష.. దిశానిర్దేశం
ఒక వ్యక్తి మూర్ఖత్వానికి, రాక్షసత్వానికి పోలవరం బలైంది. నాశనం చేసిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు.
పోలవరాన్ని పూర్తిచేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్‌లైన్ అవుతుంది. గొల్లపల్లి, బనకచర్లకు 3 దశల్లో అనుసంధానం చేయవచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా అనుసంధానమవుతుంది. దీంతో రాష్ట్రానికి నీటి సమస్యే ఉండదు.
పోలవరం ప్రాజెక్టు ఐకాన్ నిర్మాణంగా సాగాలి. దానిని రాష్ట్ర ప్రజలంతా చూడాలి.
ప్రాజెక్టు పనులను అందరూ తిలకించేలా త్వరలోనే ఏర్పాట్లు చేస్తాం.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏలూరు, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 అక్టోబరు నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కాలంతో పరుగులు తీస్తూ పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నామని.. దానికి అనుగుణంగానే నిర్దిష్ట గడువులోగా వాటిని పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించామని ప్రకటించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు క్షేత్రాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి.. తర్వాత అధికారులతో సమీక్షించారు. పనులు పరుగులు తీయించేలా దిశానిర్దేశం చేశారు. మీడియాతోనూ మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర జీవనాడి అని, ఈ ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అధారిటీతో చర్చించామని నిర్మాణ పనులకు దశల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని 2026 నాటికి పూర్తి చేయబోతున్నామని ధీమాగా చెప్పారు. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం పనులను సమాంతరంగా చేపట్టవచ్చని నిపుణులు సూచించారని తెలిపారు. దెబ్బతిన్న వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ పనులు జనవరి 2వ తేదీన మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. అందుకు అవసరమైన యంత్ర సామగ్రిని ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేస్తున్నారన్నారు. వాల్ నిర్మాణం 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వ కాలంలో 72 శాతం పనులు పూర్తి చేశామని, గత ప్రభుత్వం కేవలం 3.84 శాతం మాత్రమే పూర్తి చేసిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదని దుయ్యబట్టారు. రూ.2,400 కోట్ల నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియజేసి మొదటి దశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు సాధించామన్నారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టు పనులు చేయకపోవడం వల్ల రూ.15 వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఆ లాభం కూడా వచ్చి ఉండేదని, అది కూడా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అప్పట్లో డయాఫ్రం వాల్ రూ.440 కోట్లతో పూర్తి చేస్తే ప్రస్తుతం అది 990 కోట్లు ఖర్చు కానుంది. శాండ్ ఫిల్లింగ్‌కు రూ.350 కోట్లు అవుతుంది. కేంద్రం నుంచి రూ.8,242 కోట్లు వస్తే అందులో రూ.2,342 కోట్లు దారి మళ్లించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు 76.79 శాతం పూర్తయ్యాయి.ప్రాజెక్టు నిర్మాణంపై నిపుణులతో వర్క్‌షాపు కూడా నిర్వహించాం’ అని తెలిపారు. డిజైన్ల ఆమోదం, అనుమతులు, ఇతరత్రా అవసరాలపై ముందుచూపుతో వ్యవహరించాలని స్పష్టంచేశారు. నిర్టిష్ట కార్యాచరణ ప్రకటన ద్వారా పనులు శరవేగంగా పూర్తిచేసే అతిపెద్ద బాధ్యతను ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించారు
. గైడ్‌బండ్ కుంగడానికి, నష్టం జరగడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా.. గత ప్రభుత్వం నష్టం చేసి ఇప్పటికీ బుకాయిస్తూనే ఉందని, డయాఫ్రం వాల్ అంటే తెలియని వ్యక్తులు నాటి ప్రభుత్వంలో ఉన్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. గత పాలకులకు ప్రజలు తగిన శిక్ష విధించారని.. 11 సీట్లే ఇచ్చారని చెప్పారు. కానీ ప్రాజెక్టు పూర్తిగాకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని రికవరీ చేయలేం కదా అని వ్యాఖ్యానించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
రివర్స్ టెండరింగ్‌తో..
పోలవరం రాష్ట్రానికి జీవనాడి. దానిని పూర్తి చేయాలన్న తలంపుతో 30 సార్లు పోలవరం వచ్చాను. 80 సార్లు వర్చువల్‌గా సమీక్షించా. అటువంటి ప్రాజెక్టును వైసీపీ సర్వనాశనం చేసింది. రివర్స్ టెండరింగ్ పేరుతో నాటి సీఎం జగన్ అప్పటి కాంట్రాక్టరుకు నోటీసులిచ్చి బయటకు పంపేశారు. అవినీతి, కుట్ర, అనుభవరాహిత్యంతో ప్రాజెక్టు పనులన్నీ నాశనం చేశారు. 2020లో కాఫర్‌డ్యాం గ్యాప్‌ను పూడ్చకపోవడంతో భారీ వరదకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. 2019లో మేం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లుగా మారాయి. వాటిని జగన్ ప్రభుత్వం పొడిచేసి నాశనం చేసింది.
సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు
పోలవరం ఎత్తు తగ్గించాలని కేంద్రానికి ఎవరు లేఖలు రాశారు.. ఎవరు ఒప్పుకొన్నారు..? సిగ్గులేకుండా ఇప్పటికీ మాట్లాడుతున్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్టును 45.75 మీటర్ల ఎత్తున నిర్మించేందుకే మేం శ్రమిస్తున్నాం. గత ప్రభుత్వం ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం చేయడమే కాకుండా ఏ పనికీ కనీసం గడువు కూడా విధించలేదు. ఎక్కడికక్కడ విశృంఖలంగా వ్యవహరించారు. త్యాగం చేసిన వారినేకాదు చెడు చేసిన వారిని కూడా గుర్తు పెట్టుకోవాలి. ప్రాజెక్టులో ఒకేసారి నీరు నిల్వ చేయలేం. నిర్మాణం పూర్తయ్యాక నిపుణుల సలహా మేరకు దశల వారీగా నీటి నిల్వను పెంచుతూ పోతాం.