Share News

Madanapalle: ఆ రిపోర్ట్ వచ్చాకే నిందితులను పట్టుకోగలం.. రికార్డుల దగ్ధంపై డీఐజీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 29 , 2024 | 09:32 PM

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై కర్నూల్ డీఐజీ ప్రవీణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నిందితులెవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.

Madanapalle: ఆ రిపోర్ట్ వచ్చాకే నిందితులను పట్టుకోగలం.. రికార్డుల దగ్ధంపై డీఐజీ కీలక వ్యాఖ్యలు

అన్నమయ్య: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై కర్నూల్ డీఐజీ ప్రవీణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నిందితులెవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.

"మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో కొన్ని దస్త్రాలు స్వాధీనం చేసుకున్నాం. నవాజ్ బాషాపై కేసు నమోదు చేశాం. ఇంకా ఎవర్ని అదుపులోకి తీసుకోలేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వస్తానే 15 రోజుల్లో నిందితులను గుర్తించగలం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఈ కేసును విచారిస్తున్నాం. సీసీటీవీ ఫుటేజీలను, 2 వేలకుపైగా ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించాం. వాట్సాప్‌నకు సంబంధించిన ఐపీడీఆర్‌ కూడా పరిశీలించాం. అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, విలువైన ఆధారాలు సేకరించాం. పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నాం.ఎనిమిది కొత్త కేసులు కూడా రిజిస్టర్ చేశాం.


పగడ్బందీగా దర్యాప్తు చేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చాక నిందితులను అరెస్టు చేస్తాం. ఇప్పటివరకు15 మందిని విచారించాం. మాధవరెడ్డి ఇంట్లో 500 వరకు ఇళ్ల స్థలాలు, భూముల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. హైదరాబాద్‌లోని శశికాంత్ ఇంట్లో మదనపల్లికి చెందిన భూముల దస్త్రాలు దొరికాయి. మాజీ మంత్రి పీఏ తుకారం ఇంట్లో కూడా సోదాలు చేశాం.

తంబాలపల్లి మాజీ ఎమ్మెల్యే నవాబ్ బాషా ఇంట్లో సోదాలు చేసినప్పటికీ అక్కడేమీ దొరకలేదు. సీఐడీ అధికారుల సాయంతో 15 బృందాలు ఈ కేసుని విచారిస్తున్నాయి. కొంతమంది బాధితులు తమను మాధవరెడ్డి అనుచరులు బెదిరించారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం" అని ప్రవీణ్ పేర్కొన్నారు.


ఇద్దరు సస్పెండ్..

ఓ వైపు మదనపల్లి ఘటనపై విచారణ జరుగుతుండగా.. మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే సీఐ, మరో ఇద్దరు పీసీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జులై 21వ తేదీ రాత్రి 11.30 సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్లు కాలిపోయాయి.


ఈ ఘటనకు10 రోజుల ముందు వరకు సీసీ కెమెరాలు పనిచెయ్యకపోవడం, ఘటన జరిగిన రోజున ఓ అధికారి అర్ధరాత్రి వరకూ ఆఫీసులో ఉండటం వంటి విషయాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి అనుచరులను పోలీసులు విచారిస్తున్నారు. వైసీపీ నేతలు అధికారం చాటున అక్రమాలకు పాల్పడ్డారని.. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 09:39 PM