Share News

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ఇక లేరు

ABN , Publish Date - May 22 , 2024 | 01:02 AM

ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలపాటు కింగ్‌మేకర్‌గా వ్యవహరించిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త, దొమ్మేరు జమిందారు పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు)ఇక లేరు.

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ఇక లేరు

అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి

దొమ్మేరు జమిందార్‌గా సుపరిచితం

ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి..

ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం

నాడు ఉమ్మడి పశ్చిమను శాసించిన నాయకుడు

భార్య మరణంతో ఇంటికే పరిమితం

కొవ్వూరు, మే 21 : ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలపాటు కింగ్‌మేకర్‌గా వ్యవహరించిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త, దొమ్మేరు జమిందారు పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు)ఇక లేరు. ఆయన వయసు 71 ఏళ్లు. కొంతకాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య నాగమణి కొన్నేళ్ల క్రితమే మరణించారు. అప్పటినుంచి ఇంటికే పరిమితమయ్యారు.

కృష్ణబాబు ప్రస్థానం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ పిలుపుతో కృష్ణబాబు 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1983, 1985, 1989, 1994, 2004 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో మాత్రం ఓటమి పాలయ్యారు. సుమారు 23 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజా నాయకుడిగా పేరు పొందారు. నిజాయితీతో, నిస్వార్థంగా ప్రజాసేవ చేయడం వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. కొవ్వూరుతోపాటు, పోలవరం, గోపాలపురం, చింతలపూడి, తణుకు నియోజకవర్గ అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించేవారు. ఉమ్మడి పశ్చిమలో అన్ని నియోజకవర్గాల్లోను అభిమానులను, అనుచరగణాన్ని కలిగి ఉన్నారు. నాలుగు దశాబ్దాలపాటు జిల్లా రాజకీయాలను శాసించారు. మెట్ట ప్రాంతంలోని నాయకులు, కార్యకర్తలు ఆయన మాట జవదాటేవారు కాదు. జిల్లా పరిషత్‌, జిల్లా సహకార కేంద్రబ్యాంక్‌ చైర్మన్ల ఎంపికలోనూ కీలకపాత్ర పోషించేవారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో కొవ్వూరు ఎస్సీ రిజర్వు కావడంతో ఆయన పోటీకి దూరమయ్యారు. 2012 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ కేంద్రపాలక మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. ది ఆంధ్రా సుగర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణరంగారావు, అచ్చాయమ్మ దంపతులకు కృష్ణబాబు మూడో సంతానంగా 1953 మే 31న జన్మించారు. ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్‌కు సోదరి కుమారుడు. బోళ్ల బుల్లిరామయ్యకు బావమరిది. ది ఆంధ్రా సుగర్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పెండ్యాల నరేంద్రనాథ్‌ చౌదరి, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పెండ్యాల అచ్యుతరామయ్య(అచ్చిబాబు)లకు సోదరుడు. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు వెంకట్రాయుడు, రవిబాబు (ఎం.డి విభాస్‌ పాలిమర్స్‌), కుమార్తె అర్చన ఉన్నారు. కుమారులు పారిశ్రా మికవేత్తలు కాగా, కుమార్తె గృహిణి, అల్లుడు ఎస్‌.రాజీవ్‌కృష్ణ ప్రస్తు త రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు.

నేడు అంత్యక్రియలు

కృష్ణబాబు భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి కొవ్వూరు మండలం దొమ్మేరులోని వారి నివాసానికి తీసుకువస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం దొమ్మేరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కృష్ణబాబు మరణం తీరనిలోటు

కృష్ణబాబు మరణం జిల్లావాసులకు తీరని లోటని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యుడు కంఠమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి అన్నారు. ‘ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆయన వెంటనే స్పందించేవారు. ఆయన హయాంలోనే నియోజకవర్గంలో పంపింగ్‌ స్కీమ్‌ ఏర్పాటు చేసి, రైతులకు సాగునీరందించారు. 2003 గోదావరి పుష్కరాలకు కొవ్వూరు పట్టణాన్ని అభివృద్ధి చేశారు. అచ్చాయమ్మ కాలనీలో పేదలకు ఇళ్ళస్థలాలు అందించారు’ అని కొనియాడారు. కృష్ణబాబు మృతికి సంతాపంగా బుధవారం నియోజకవర్గంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలంతా సంతాప దినంగా పాటించాలని కోరారు. సంతాపం తెలిపిన వారిలో కొవ్వూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, రాజేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బండి పట్టాభి రామారావు, ఇమ్మణ్ణి వీర శంకరం, పేరిచర్ల బోసురాజు, కేవీకే రంగారావు, పెనుమాక జయరాజు, పిక్కి నాగేంద్ర సంతాపం తెలిపారు.

కృష్ణబాబు మృతికి హోం మంత్రి సంతాపం

దేవరపల్లి, మే 21: కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి పట్ల హోం మంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. యర్నగూ డెం క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ కృష్ణబాబు ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూ తి తెలిపారు. కృష్ణబాబు మరణం వ్యక్తిగతంగా తనకు, తమ పార్టీ తీరని లోటన్నారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావుతో కృష్ణబాబుకు ఉన్న సాన్నిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారన్నారు. అలాగే చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాట్రగడ్డ శ్రీనివాస్‌చౌదరి.. కృష్ణబాబు మృతికి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మృతి మెట్ట ప్రాంత ప్రజలకు తీరని లోటని అన్నారు.

కృష్ణబాబు మృతికి చంద్రబాబు సంతాపం

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఎమ్మెల్యేగా కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి కృష్ణబాబు విశేష సేవలు అందించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారని కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - May 22 , 2024 | 07:54 AM