Election Results: ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..
ABN, Publish Date - May 30 , 2024 | 10:09 AM
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం ఏడో విడత పోలింగ్‌తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం..
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం ఏడో విడత పోలింగ్‌తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల(Election Result) కోసం జూన్4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం ఏడో విడతలోనూ కొన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు.. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఓవైపు ఎన్డీయే కూటమి (NDA Alliance) 400 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకోగా.. అధికారానికి కావాల్సిన మెజార్టీ మార్క్‌ను దక్కించుకుంటామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనే టెన్షన్ పోటీచేసిన అభ్యర్థుల్లో నెలకొంది. సాధారణంగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే విజేత ఎవరనే అనుమానం చాలామందికి కలుగుతుంది. మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారా అనే ప్రశ్న రావొచ్చు. ఇలా ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే ఏం చేస్తారనేది తెలుసుకుందాం.
సమానంగా వస్తే..
బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ నిర్వహించినప్పుడు చెల్లని ఓట్లు ఎక్కువుగా ఉండేవి. ఈవీఎంలు వచ్చిన తర్వాత చెల్లని ఓట్లు అనేవి లేకుండా పోయాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికి ఓటు వేయకూడదనుకున్నప్పుడు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ అది చెల్లని ఓటుగా పరిగణించరు. కేవలం చెల్లని ఓట్లనేవి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రమే కనిపిస్తాయి. నోటాకు కాకుండా.. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి పోలైతే వారిని విజేతగా ప్రకటిస్తారు. అదే ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే.. మరోసారి రీకౌంటింగ్ చేసే అవకాశం ఉంటుంది. రీ కౌంటింగ్‌లోనూ ఓట్లు సమానమని తేలితే.. లాటరీ విధానంలో ఆ ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు.
లాటరీ విధానంలో..
ఎన్నికల ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ వరకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలని భారత రాజ్యాంగం చెబుతోంది. దీని ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే విజేతను ఎలా నిర్ణయించాలనేదానిపై ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. సమానంగా ఓట్లు వచ్చినందున మరోసారి ఆ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహిస్తే ఖర్చుతో కూడుకున్నది కావడం, అలాగే ఫలితంలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పడు లాటరీ విధానంలో విజేతను నిర్ణయిస్తారు. ఇద్దరు అభ్యర్థల పేర్లను చీటీలపై రాసి ఒకచీటిని తీస్తారు. ఎవరి పేరు ఆ చీటీలో వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. సమానంగా ఓట్లు రావడమనేది ఎక్కువుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతుంటాయి. ఓట్లు తక్కువుగా ఉండటంతో సమానంగా వచ్చే అవకాశం ఉండొచ్చు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read more Andhra Pradesh and Telugu News
Updated Date - May 30 , 2024 | 10:47 AM