AP Elections: చెల్లి ప్రశ్నలకు సమాధానం ఉందా జగన్..!
ABN , Publish Date - Apr 09 , 2024 | 09:08 AM
ఐదేళ్ల కాలంలో ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్ (Jagan) వైఫల్యా లను సొంత చెల్లి షర్మిల ఎన్నికల ప్రచారంలో బయటపెట్టారు. ప్రజలకు ఇచ్చి అమలు చేయని హామీల గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతల నుంచి సమాధానమే కరువైంది.
ఐదేళ్ల కాలంలో ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్ (Jagan) వైఫల్యాలను సొంత చెల్లి షర్మిల ఎన్నికల ప్రచారంలో బయటపెట్టారు. ప్రజలకు ఇచ్చి అమలు చేయని హామీల గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతల నుంచి సమాధానమే కరువైంది. విపక్షాల నుంచి ఎవరు ఏ చిన్న విమర్శ చేసినా.. విరుచుకుపడే కొందరు వైసీపీ నేతలు.. పీసీసీ చీఫ్ షర్మిల (Sharmila) ప్రశ్నలకు ఎందుకు స్పందిచడంలేదనే చర్చ నడుస్తోంది. ఐదేళ్ల ముందు తన అన్నయ్య గెలుపు కోసం శ్రమించానని, ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామని.. అవి ఎందుకు అమలు చేయలేదంటూ జగన్‌పై ప్రశ్నలు సంధిస్తున్నారు. షర్మిల ప్రశ్నలు, విమర్శలపై వైసీపీ నాయకులు మాత్రం నోరు మెదపడంలేదు. అంటే షర్మిల ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానాలు లేవనేది స్పష్టమవుతోంది. జగన్ పాలనా వైఫల్యాలను షర్మిల ప్రజలకు వివరిస్తున్నారు. తన సొంత అన్నయ్య రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేశారో తెలియజేస్తున్నారు. జగన్ మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా జగన్ పాలనా వైఫల్యాలు, మోసాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఎంతో చేశామని, తమలా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని జగన్ చెబుతున్న మాటలు అసత్యాలనే విషయం ప్రజలకు సులభంగా అర్థమవుతున్నాయట.
మద్య నిషేదం మొదలు..
2019 ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే దశలవారీ మద్యపాన నిషేధం చేస్తామని వైసీపీ తరపున హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తైంది. హామీ అమలు చేశారా జగనన్న అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం పక్కనపెడితే నాసిరకం మద్యం అమ్ముతూ జగన్ సారా వ్యాపారం చేస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. మద్యం ధరలు పెంచి సొంత బ్రాండ్లతో పేద ప్రజల డబ్బులు దోచుకుంటున్నారంటూ షర్మిల ఆరోపించారు. గతంలో ఇదే విషయం విపక్షాలు మాట్లాడితే.. పొంతనలేని సమాధానాలిస్తూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు విపక్ష పార్టీలపై అసత్య ఆరోపణలు చేసేవాళ్లు వైసీపీ నాయకులు. ప్రస్తుతం షర్మిల సంధిస్తున్న ప్రశ్నలపై ఏ ఒక్కరూ స్పందిచడం లేదు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, ఎంతమందికి ఉద్యోగాలను ఈ ప్రభుత్వం కల్పించిందంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలతో వైసీపీ నాయకులకు షర్మిల కంటిపై కునుకులేకుండా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు పూర్తయ్యేలోపైనా షర్మిల ప్రశ్నలకు వైసీపీ నాయకులు స్పందిస్తారా.. లేదా ఐదేళ్ల పాలనలో విఫలమయ్యామని వైసీపీ నాయకులు ఒప్పుకుంటారో అన్నది వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..