‘ఎడ్‌ఎక్స్’ పేరిట రూ.50 కోట్ల దోపిడీ!
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:53 AM
ఉన్నత విద్యలో కొన్ని సర్టిఫికేషన్ కోర్సులుంటాయి. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు అసలు కోర్సులతో పాటు అదనపు ప్రయోజనం కలిగించేలా ఈ తరహా సర్టిఫికేషన్ కోర్సులను కరిక్యులమ్‌లో చేర్చారు.
టెండర్లు లేకుండా అడ్డగోలుగా ఒప్పందం
2 వేల విదేశీ వర్సిటీల కోర్సులని జగన్ ప్రచారం
తీరా దేశంలో ఉన్న కోర్సులకే విదేశీ సర్టిఫికేషన్
వీడియోలు చూసి విద్యార్థులు నేర్చుకోవాలట
4 లక్షల లైసెన్సుల్లో 69 వేల మిగులు
వాటిని తీసుకోవాలని ఇప్పుడు విద్యార్థులపై ఒత్తిడి
ఆన్‌లైన్ రిక్వెస్ట్ ఓకే చేయాలని మెయిల్స్
అక్రమాలు బయటకు రాకుండా
ఉన్నత విద్యామండలి యత్నం
అవిగో విదేశీ కోర్సులు, ఇవిగో అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు అంటూ గత వైసీపీ ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టింది. విదేశీ యూనివర్సిటీల్లోని కోర్సులు అంటే ఇక్కడ విద్యార్థులు ఎగబడతారని, హాట్‌కేకుల్లా వాటి లైసెన్సులు అయిపోతాయని అప్పట్లో ఊదరగొట్టగా.. ఇప్పుడు లైసెన్సులు మిగిలిపోయాయని, వాటిని తీసుకోవాలని ఉన్నత విద్యామండలిలోని వైసీపీ అనుకూల అధికారులు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు. మేం కోర్సు ఇన్విటేషన్ మెయిల్ చేస్తాం... దానిని యాక్సెప్ట్ చేసి రిజిస్ర్టేషన్ చేసుకోవాలని బతిమాలుకునే పరిస్థితికి దిగిరావడంతో ఆ కోర్సులకు ఎలాంటి డిమాండ్ లేదని ఉన్నత విద్యామండలి పరోక్షంగా అంగీకరించింది. విద్యార్థుల భవిష్యత్తుకు ఉన్నత బాటలు అంటూ రూ.50కోట్లు ప్రైవేటు కంపెనీకి దోచిపెట్టగా, అందులో వైసీపీ పెద్దలకు ముడుపులు అందాయి. ఇప్పుడు ఆ అక్రమాలు బయటకు రాకుండా కొందరు అధికారులు నూరుశాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపించేందుకు నానా పాట్లు పడుతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉన్నత విద్యలో కొన్ని సర్టిఫికేషన్ కోర్సులుంటాయి. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు అసలు కోర్సులతో పాటు అదనపు ప్రయోజనం కలిగించేలా ఈ తరహా సర్టిఫికేషన్ కోర్సులను కరిక్యులమ్‌లో చేర్చారు. దేశంలోనే పలు కంపెనీలు అలాంటి అదనపు సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నాయి. అయితే, గత ప్రభుత్వం మన విద్యార్థులకు విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లోని కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం ఆగమేఘాలపై ఎడ్‌ఎక్స్ అనే అమెరికన్ కంపెనీని నామినేషన్ పద్ధతిపై ఎంపిక చేసింది. ఆ కంపెనీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌గా ఉంటూ విదేశీ వర్సిటీల్లోని కోర్సులు ఇక్కడ విద్యార్థులు చదివేందుకు వారధిగా పనిచేస్తుంది. ఇందుకోసం ఆ కంపెనీతో గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఒకేసారి రూ.49.9కోట్లు ఆ కంపెనీకి చెల్లించింది. అందుకుగాను ఆ కంపెనీ రాష్ర్టానికి 4లక్షల లైసెన్సులు ఇచ్చింది. వాటిని విద్యార్థులు వెంటనే ఉపయోగించుకుంటారని భావించగా 69వేల లైసెన్సులు ఖాళీగా మిగిలిపోయాయి. ఇది బయటపడితే ఈ ఒప్పందంలోని డొల్లతనం వెలుగులోకి వస్తుందని భావించిన ఉన్నత విద్యామండలిలోని వైసీపీ అనుకూల అధికారులు యూనివర్సిటీల ద్వారా గత కొద్దిరోజులుగా విద్యార్థులకు మెయిళ్లు పంప్తున్నారు. ఆ కోర్సులను తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఈ కోర్సులు ఇక్కడ లేవట
ఈ ఒప్పందం చేసుకున్న సమయంలో అప్పటి సీఎం జగన్ ప్రసంగించారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, స్టాక్ ఎక్స్చేంజ్, వెల్త్ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్ లాంటి కోర్సులు ఈ ఒప్పందంతో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇలాంటి కోర్సులు మన దేశంలో లేవని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి కోర్సులు అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉంచాయి. కానీ అలాంటి కోర్సులు ఇక్కడ లేవని జగన్ ప్రకటించడం, వాటికి అధికారులు తలూపడం చకచకా జరిగిపోయాయి. అలాగే ఆ కోర్సులను ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా అక్కడి వర్సిటీల్లోని అధ్యాపకులు బోధిస్తారని జగన్ చెప్పారు. తీరా చూస్తే అక్కడ రికార్డు చేసిన వీడియోలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. అలాంటి వీడియోలు యూట్యూబ్‌లో కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులకు చదువుకునే వీలుంది. అలాంటి కోర్సులకు ప్రభుత్వం ఏకంగా రూ.50కోట్లు చెల్లించింది.
ఒక్క విద్యార్థి 32 కోర్సులు ఎలా?
విద్యార్థులు వారికి నచ్చిన కోర్సులను ఎంచుకుని నేర్చుకుంటారు. కొందరు ఒకటి కంటే ఎక్కువ ఆన్‌లైన్ కోర్సులు చదువుతారు. కానీ ఎడ్‌ఎక్స్ ద్వారా మదనపల్లెకు చెందిన ఒక విద్యార్థి ఏకంగా 32 కోర్సులు పూర్తిచేశారంటే ఎవరైనా నమ్మగలరా? జగన్ సొంత మీడియానే ఈ ప్రచారం చేసింది. డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఏఐలతో పాటు మరో 29 రకాల కోర్సులను ఆ విద్యార్థి పూర్తిచేసినట్లు రాసుకొచ్చింది. అసలు ఒక్క విద్యార్థి అన్ని కోర్సులు ఎలా నేర్చుకుంటారు? ఈ కోర్సులు విద్యార్థుల రెగ్యులర్ చదువుకు అదనం మాత్రమే. అలాంటి 32 అదనపు కోర్సులను రెగ్యులర్ కోర్సులతో కలిపి ఎలా నేర్చుకున్నారో జగన్ మీడియాకే తెలియాలి. అసలు ఒక్కో కోర్సుకు నెల రోజులు పట్టినా దాదాపు మూడేళ్ల కాలం ఆ కోర్సులతోనే సరిపోతుంది.