Share News

Vijayawada Floods: విజయవాడలో వరద తగ్గకముందే..

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:21 AM

నాలుగు రోజులుగా విజయవాడ నగరం ముంపులోనే ఉంది. బుధవారం వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో జనం బయటకు వస్తున్నారు.

Vijayawada Floods: విజయవాడలో వరద తగ్గకముందే..

  • వైరల్‌ జ్వరాల వరద!

  • వరద తగ్గక ముందే విజృంభిస్తున్న వ్యాధులు

  • బాధితుల్లో ఎక్కువ మందికి వైరల్‌ ఫీవర్‌

  • 3 రోజులుగా ఆహారం, నీరు లేక నీరసం

  • నడిచి రావడంతో స్పృహ కోల్పోతున్న వైనం

విజయవాడ, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా విజయవాడ నగరం ముంపులోనే ఉంది. బుధవారం వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో జనం బయటకు వస్తున్నారు. అయితే ఈ నాలుగు రోజులూ వరద నీటితో సహజీవనం చేసిన వారిని ఇప్పుడు వైరల్‌ జ్వరాలు చుట్టుముడుతున్నాయి. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, ఆస్త మా, బీపీ షుగర్‌... బుడమేరు వరద బాధితులను ఎవరిని పలకరించినా ఇవే సమస్యలు. వాస్తవాని వరద తగ్గిన తర్వాత వ్యాధులు ప్రబలుతాయనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం శానిటేషన్‌పై యుద్ధ ప్రాతిపదికన యాక్షన్‌ ప్లాన్‌కు సిద్ధమైంది. కానీ.. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ వరద పూర్తిగా తగ్గకముందే జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో బాధితు లు వైద్య శిబిరాలకు క్యూ కడుతున్నారు. కొన్నిచోట్ల అంబులెన్స్‌ల్లో కూడా మందులు అందిస్తుండడంతో కొందరు అక్కడ తీసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఒకటి, రెండు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినా వాటి దగ్గర పరిమిత సంఖ్యలోనే మందులు ఉన్నాయి. ముఖ్యంగా డోలో-650 లేకపోవడంతో బాధితులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

తిండి, నీరు లేక నీరసించిన బాధితులు..

బుధవారం వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో పైపులరోడ్డు, ప్రకా్‌షనగర్‌, వాంబే కాలనీ వంటి దూర ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో బయట కు వచ్చారు. ప్రకాష్‌ నగర్‌ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర నడుములోతు వరదను దాటుకుంటూ వస్తున్నారు. మూడు రోజులుగా సరైన ఆహారం, నీరు లేక వారంతా నీరసించిపోయారు. దాదాపు 4 నుంచి 10 కిలోమీటర్లు నడిచి రావడం, తీవ్ర నీరసానికి గురికావడం వల్ల చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. అంబులెన్స్‌లను తగిన సంఖ్యలో సిద్ధం చేయటం వల్ల ఎప్పటికప్పుడు ఇలాంటి వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించగలుగుతున్నారు. గురువారం మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉండడంతో అంబులెన్స్‌లను పెంచితే సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఎనర్జీ డ్రింక్స్‌ అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆస్పత్రి

బయటకు వస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది వైరల్‌ జ్వరాలతోనే బాధపడుతున్నారు. పెద్ద వాళ్ల కం టే చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువ వల్ల చిన్నారులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. పెద్ద వాళ్లు నీరసం, ఒళ్లు నొప్పులు, బీపీ, షుగర్‌ వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. గుండె జబ్బులు, కాలేయ, కిడ్నీ సమస్యలు, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని బయటకు రాగానే పెద్ద ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కొందరు సాధారణ జ్వరాలకు మందులు తీసుకున్నప్పటికీ అవి తీవ్రరూపం దాల్చుతాయేమోనన్న అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వరద బాధితులతో కిటకిటలాడుతోంది. ఈ వైరల్‌ జ్వరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలి. బుధవారం ఆంధ్రజ్ర్యోతిలో ప్రచురితమైన ుకష్టాలు.. కన్నీళ్లు్‌ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్‌ సృజన ఉదయాన్నే సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ మీద అపరిశుభ్రంగా ఉన్న ఆహార వర్యార్ధాలను శుభ్రం చేయించారు. కాగా, పారిశుధ్య చ ర్యలు చేపడితే వ్యాధులు ప్రబలకుండా అడ్డుకోవచ్చు.

Updated Date - Sep 05 , 2024 | 09:42 AM