మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్‌తేజ్ అరెస్టు
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:25 AM
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో ప్రధాన నిందితుడు, సీనియర్ అసిస్టెంట్ గోరంట్ల గౌతమ్‌తేజ్‌ను

చిత్తూరు, మదనపల్లె, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో ప్రధాన నిందితుడు, సీనియర్ అసిస్టెంట్ గోరంట్ల గౌతమ్‌తేజ్‌ను సోమవారం పలమనేరులో అరెస్టు చేసిన పోలీసులు, చిత్తూరు సీఐడీ కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ ఏడాది జూలై 21న రాత్రి మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి రికార్డులన్నీ దగ్ధమైన విషయం తెలిసిందే. ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పనిచేసిన ఆర్డీవో, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. గౌతమ్‌తేజ్‌ను అరెస్టు చేసి చిత్తూరు సీఐడీ కోర్టులో హాజరుపరిచినట్లు సీఐడీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. అరెస్టు విషయాన్ని గౌతమ్‌తేజ్ కుటుంబ సభ్యులకూ తెలియజేసినట్లు అందులో పేర్కొన్నారు. తండ్రి మరణించంతో కారుణ్య నియామకం పొందిన గౌతమ్‌తేజ్.. చిత్తూరు కలెక్టరేట్‌లో పనిచేశారు. అప్పట్లో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు పొందే అభ్యర్థుల వద్ద ఇతను డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.