AP Politics: ఏపీ మంత్రి మండలిలోకి నాగబాబు.. టీడీపీ రాజ్యసభ సభ్యులు వీళ్లే..
ABN , Publish Date - Dec 09 , 2024 | 09:06 PM
నాగబాబును తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగ్గా.. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించారు. ఆ తర్వాత ఏపీ నుంచి మూడు రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ అవ్వడంతో తప్పనిసరిగా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబు రాజ్యసభ సభ్యత్వంపై..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి జనసేనలో నాగబాబు ఎన్నికల ముందునుంచి కీలకంగా పనిచేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సోదరుడి ప్రచార బాధ్యతలను ఆయన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు మంచి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగ్గా.. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించారు. ఆ తర్వాత ఏపీ నుంచి మూడు రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ అవ్వడంతో తప్పనిసరిగా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబు రాజ్యసభ సభ్యత్వంపై స్పష్టత వచ్చిందని, బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తీరా చూస్తే మూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు, బీజేపీకి ఒకటి వెళ్లాయి. దీంతో నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కలేదు. తాజాగా నాగబాబును ఎమ్మెల్సీ చేసి ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే నాగబాబు జనసేన నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయనకు కేబినెట్‌లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీ రాజకీయాల కోసమేనా..
జనసేనను ఏపీలో బలపర్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు కూటమిలో ఉంటూనే క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు నాగబాబు మొదటినుంచి తోడుగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపిస్తే ఎక్కువ ఢిల్లీలో ఉండాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే బెటరనే ఆలోచన పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు, నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, మంత్రి హోదాలో నాగబాబును పార్టీ శ్రేణులకు దగ్గర చేయాలనే ఆలోచనలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే నాగబాబు మంత్రివర్గంలో చేరే అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
జనసేన నుంచి ముగ్గురు..
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ కాగా.. మరో ఇద్దరు నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేష్, తాజాగా నాగబాబు కేబినెట్‌లో చేరితే జనసేన నుంచి మంత్రుల సంఖ్య నాలుగుకు చేరుతుంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనే విషయంపై మరికొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.
రాజ్యసభకు ఇద్దరు..
మరోవైపు ఏపీ నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. బీద మస్తానరావు, సానా సతీష్ పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here